Share News

Komatireddy Venkata Reddy: కేసీఆర్‌, కేటీఆర్‌పై హరీశ్‌రావుకు కోపం!

ABN , Publish Date - Dec 30 , 2024 | 03:27 AM

బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తన మామ కేసీఆర్‌, బామ్మర్ది కేటీఆర్‌పై కోపం ఉందని, అందుకే ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లీజు టెండర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరిపించాలని అసెంబ్లీలో డిమాండ్‌ చేశారని రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

Komatireddy Venkata Reddy: కేసీఆర్‌, కేటీఆర్‌పై  హరీశ్‌రావుకు కోపం!

అందుకనే ఓఆర్‌ఆర్‌ మీద విచారణ జరిపించాలన్నారు

  • ఆయన కోరిక మేరకే సిట్‌

  • గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆర్‌ఆర్‌ఆర్‌లో ఆరేళ్ల జాప్యం

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తన మామ కేసీఆర్‌, బామ్మర్ది కేటీఆర్‌పై కోపం ఉందని, అందుకే ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లీజు టెండర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరిపించాలని అసెంబ్లీలో డిమాండ్‌ చేశారని రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. హరీశ్‌రావు కోరిక మేరకే సిట్‌ను వేశామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ‘రెడ్డి హాస్టల్‌’ పూర్వ విద్యార్థుల సమావేశంలో కోమటిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు రూ.7,300 కోట్లకు ఓఆర్‌ఆర్‌ను అమ్ముకుందన్నారు. ఓఆర్‌ఆర్‌ నిర్మాణం కోసం అప్పట్లోనే రూ.6,500 కోట్లను వెచ్చిస్తే.. ఆ ప్రాజెక్టును కేసీఆర్‌ రూ.7,300 కోట్లకు అమ్ముకోవడం దారుణమని విమర్శించారు. ఫార్ములా-ఈ రేసు కేసులో ఒకరో, ఇద్దరో జైలుకు వెళ్లడం ఖాయమని.. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.


కేంద్రప్రభుత్వం రీజినల్‌ రింగు రోడ్డు ఉత్తరభాగం పనుల నిర్వహణకు టెండర్లను ఆహ్వానించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. మార్చిలో పనులు ప్రారంభిస్తామని, పెండింగ్‌ పనులను ఆలోపు పూర్తిచేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే కేంద్రం ఆర్‌ఆర్‌ఆర్‌ను మంజూరు చేసినా.. నాటి పాలకుల నిర్లక్ష్యంతో ఆరేళ్లపాటు జాప్యం చోటు చేసుకుందన్నారు. ఈ నేపథ్యంలో తాను, సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు కేంద్రంతో చర్చించామని, ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీని మరోసారి కలిశామన్నారు. 20 రోజుల్లో టెండర్లు పిలుస్తామని గడ్కరీ చెప్పారని, అన్నట్టుగానే టెండర్లను ఆహ్వానించారని కోమటిరెడ్డి తెలిపారు.


రెడ్డి హాస్టల్‌కు సహకరిస్తా

అంతకుముందు రెడ్డి హాస్టల్‌ పూర్వ విద్యార్థుల (అల్యూమిని) సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రసంగిస్తూ.. ఎంత పని ఒత్తిడితో ఉన్నా హాస్టల్‌కు అవసరమైన సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థుల చైర్మన్‌గా తనను ఎన్నుకున్నందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే రాజబహుదూర్‌ వెంకటరామారెడ్డి.. రెడ్డిహాస్టల్‌ తో పాటు పలు విద్యా సంస్థలను స్థాపించారని గుర్తు చేశారు.


మంత్రికి సీఎం రేవంత్‌ ఫోన్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం పనులకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లను ఆహ్వానించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2017లో ఆగిపోయిన ప్రాజెక్టు.. పట్టాలెక్కటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీ కృషి, సహకారంతోనే ఇది సాధ్యమైందని సీఎంకు తెలిపారు. ఆదివారం మంత్రి కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌పై కేంద్రం టెండర్లను ఆహ్వానించినందుకు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి సీఎం రేవంత్‌ తరపున మంత్రి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Dec 30 , 2024 | 03:27 AM