Hyderabad: కోదండరాం, అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం
ABN , Publish Date - Aug 17 , 2024 | 04:19 AM
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధినేత కోదండరాం, ఉర్దూ పత్రిక సియాసత్ న్యూస్ ఎడిటర్ అమెర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వడంతో మార్గం సుగమం
ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పని చేస్తా: కోదండరాం
అమరవీరుల స్తూపం వద్ద కోదండరాం, అలీఖాన్ నివాళి
హైదరాబాద్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధినేత కోదండరాం, ఉర్దూ పత్రిక సియాసత్ న్యూస్ ఎడిటర్ అమెర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్‌లో వీరితో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, పలువురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కాగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయగా అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.
తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన కోదండరాం, అలీఖాన్ పేర్లకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో దాసోజు, సత్యనారాయణలు హైకోర్టులో పిల్ వేశారు. కేసుకు సంబంధించి మార్చి 7న ఇచ్చిన ఉత్తర్వుల్లో.. దాసోజు, సత్యనారాయణ నియామకాలకు సంబంధించి మంత్రివర్గం సిఫారసులను తిప్పి పంపే అధికారమే ఉంది కానీ.. తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదంటూ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా.. మార్చి 7న హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోదండరాం, అలీఖాన్‌ల ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది.
జనవరి చివరి వారంలో ప్రమాణం చేయాల్సిన వీరు ఆరున్నర నెలలు ఆగాల్సి వచ్చింది. కాగా, ఎమ్మెల్సీ పదవిని అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నానని కోదండ రాం తెలిపారు. ప్రమాణం తర్వాత ఆయన మాట్లాడారు. తాము ఈ స్థాయిలో ఉన్నామంటే అనేకమంది చేసిన బలిదానాలే కారణమని పేర్కొన్నారు. తనతో పాటు పనిచేసిన ఉద్యమకారులు, అమర వీరుల ఆకాంక్షల మేరకు పని చేస్తానని తెలిపారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద కోదండరాం, అలీఖాన్ నివాళులు అర్పించారు.