Share News

KTR: సీఎంపై పరువునష్టం దావా వేస్తా..

ABN , Publish Date - Oct 06 , 2024 | 04:37 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి సీఎం రేవంత్‌రెడ్డిపై, రాష్ట్ర మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు.

KTR: సీఎంపై పరువునష్టం దావా వేస్తా..

  • అడ్డగోలుగా మాట్లాడిన మంత్రినీ వదలను

  • మూసీ గబ్బంతా సీఎం, మంత్రుల నోట్లోనే: కేటీఆర్‌

  • హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్‌ విడుదల

  • కొడంగల్‌లో రెడ్డికుంటలో రేవంత్‌రెడ్డి ఇల్లు

  • సీఎంకు దమ్ముంటే.. ఆ ఇల్లు కూలగొట్టాలి: కేటీఆర్‌

  • రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్‌ఎస్‌ రైతు ధర్నా

రంగారెడ్డి అర్బన్‌/కందుకూరు/మహేశ్వరం,అక్టోబరు5(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి సీఎం రేవంత్‌రెడ్డిపై, రాష్ట్ర మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. మూసీ గబ్బు అంతా ముఖ్యమంత్రి నోట్లో, మంత్రుల నోట్లోనే ఉందని, సీఎం మాటలు రోత పుట్టించేలా ఉన్నాయని అన్నారు. రేవంత్‌ గబ్బు మాటల విషయంలో ఇప్పటివరకు ఊరుకున్నామని, ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పారు. తర్వలోనే ముఖ్యమంత్రిపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. తనపై అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిని కూడా వదిలిపెట్టబోనని, క్షమాపణ చెప్పేదాకా సివిల్‌, క్రిమినల్‌ కేసులు వేస్తానని స్పష్టం చేశారు.


శనివారం రంగారెడ్డి జిల్లా కందుకూరులో నిర్వహించిన రైతు ధర్నాలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు కొడుకులకు ఫాంహౌ్‌సలు ఉన్నాయంటున్నారని, అవి ఎక్కడున్నాయో సీఎం చెబితే తామే కూలగొడతామని అన్నారు. ‘‘రేవంత్‌రెడ్డీ నీ కళ్లు చల్లబడతాయనుకుంటే మావి కూలగొట్టి అక్కడికే ఆపెయ్‌. పేదవాళ్ల జోలికి మాత్రం వెళ్లకు’’ అని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో 50 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నవారిని ఆక్రమణదారులు, కబ్జాదారులు అంటున్నారని మండిపడ్డారు.


  • రెడ్డికుంటలో రేవంత్‌ ఇల్లు..

కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంటలో ఉందని, ఆయన అన్న తిరుపతిరెడ్డి ఇల్లు దుర్గం చెరువులో ఎఫ్‌టీఎల్‌లో ఉందని కేటీఆర్‌ ఆరోపించారు. దమ్ముంటే ముందు వాటిని కూలగొట్టి.. తర్వాత పేదోళ్ల వద్దకు రావాలన్నారు. చారాణా రుణమాఫీ చేసి మొత్తం మాఫీ చేశామని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఫార్మాసిటీ కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 14 వేల ఎకరాలు సేకరించామని కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు ఊరూరా తిరిగి తాము అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దుచేసి భూములను తిరిగి రైతులకు ఇస్తామన్నారని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆరోపించారు. ఫార్మాసిటీ పేరును మార్చి ఫోర్త్‌ సిటీ అని పెట్టారని అన్నారు. వాస్తవానికి అది ఫోర్త్‌సిటీ కాదని, రేవంత్‌రెడ్డి ఫోర్‌ బ్రదర్స్‌ సిటీ అని వ్యాఖ్యానించారు. వాళ్లు రైతులను బెదిరించి అసైన్డ్‌ భూములను కూడా లాక్కుంటున్నారని ఆరోపించారు. ఫోర్త్‌ సిటీ పేరుతో చేస్తున్న డ్రామాలపై రైతులు కోర్టులో కేసులు వేయాలని, అందుకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


  • రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ల సీఎం..

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లా పని చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగంలో రాష్ట్ర ప్రభుత్వమే పనులు చేస్తదట. కోమటిరెడ్డి నియోజకవర్గంలో కమీషన్లు, కాంట్రాక్టుల కోసం అలైన్‌మెంట్‌ మార్చి తమ భూములను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ధ్వజమెత్తారు. రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, కల్యాణ లక్ష్మికి పైసల్లేవటగానీ.. మూసీలో పోసేందుకు మాత్రం రూ.లక్షా 50 వేల కోట్లు ఉన్నాయట అని విమర్శించారు. అందులో రూ.25 నుంచి 35 వేల కోట్లు నొక్కేసి.. ఢిల్లీకి పంపాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని ఆరోపించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తన ముగ్గురు కొడుకులకు ఫాంహౌ్‌సలు ఎక్కడున్నాయో సీఎం వెతికిపెట్టాలన్నారు.

Updated Date - Oct 06 , 2024 | 04:37 AM