Hyderabad: విద్యుత్ కమిషన్.. వివక్ష చూపుతోంది!
ABN , Publish Date - Jun 28 , 2024 | 04:40 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని విద్యుత్ కమిషన్ తీవ్ర వివక్ష చూపుతోందని మాజీ సీఎం కేసీఆర్ తరఫు న్యాయవాది ఆరోపించారు.
ఇక.. కమిషన్ ఎదుట హాజరై ఏం లాభం?
కేసీఆర్ తరఫున న్యాయవాది వాదనలు
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని విద్యుత్ కమిషన్ తీవ్ర వివక్ష చూపుతోందని మాజీ సీఎం కేసీఆర్ తరఫు న్యాయవాది ఆరోపించారు. కమిషన్ ఏర్పాటు చెల్లదని, విద్యుత్ చట్టం ప్రకారం కమిషన్ వేసే అధికార పరిధి ప్రభుత్వానికి లేదని, కమిషన్ తనకు ఇచ్చిన నోటీసులను కొట్టేయాలని పేర్కొంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్.. రిజిస్ట్రీ అభ్యంతరాల మధ్య గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. రిజిస్ర్టీ అభ్యంతరాలను తోసిపుచ్చిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం.. కేసీఆర్ పిటిషన్‌కు రెగ్యులర్ నంబర్ కేటాయించాలని ఆదేశించింది. కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. ‘ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ వేసింది. కమిషన్ హెడ్ జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కేసీఆర్ వాదన వినకుండానే తప్పు చేసినట్లు ముందే ఓ నిర్ణయానికి వచ్చేశారు.
తప్పు జరిగిందని మీడియా సమావేశం పెట్టి ముందే తీర్పు ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ కమిషన్ ఎదుట వాదన వినిపించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ నుంచి తప్పుకోవాలని పేర్కొంటూ సమగ్ర వివరాలతో లేఖ రాశాం. ఆయన కమిషన్‌లో ఉండడం మా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. ఇదే జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి డివిజన్ బెంచ్‌లో సభ్యుడిగా ఉండి.. ఎంక్వైరీ కమిషన్ ఎలా వ్యవహరించాలో వివరిస్తూ ‘పీలా పోతినాయుడు’ కేసులో తీర్పు ఇచ్చారు. కానీ.. ఆయనే ఇప్పుడు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలకు ఛత్తీ్‌సగఢ్, తెలంగాణ రాష్ట్రాల ఈఆర్సీలు ఆమోదం తెలిపాయి. కేంద్ర అటవీ, పర్యావరణ, విద్యుత్‌శాఖల అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్టులు చేపట్టాం. మేం చేసుకున్న ఒప్పందాలన్నీ ప్రభుత్వాల మధ్య జరిగినవే. ఎక్కడా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేదు.
బీహెచ్‌ఈఎల్ సైతం మహారత్న హోదా కలిగిన ప్రభుత్వం సంస్థ. విద్యుత్ చట్టం ప్రకారం విచారణ పరిధి ఈఆర్సీకి మాత్రమే ఉంటుంది. రాజకీయ కక్షతో వేసిన ఈ కమిషన్... తదుపరి చర్యలు తీసుకోకుండా, ఎలాంటి నివేదిక ఇవ్వకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వండి’అని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. అసలు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? సదరు రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చిస్తారా? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. కమిషన్ నివేదికను హైకోర్టులో సవాల్ చేస్తామని, కానీ..తన క్లయింట్‌కు వ్యతిరేకంగానే రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉన్నందున.. విచారణను అడ్డుకోవాలని కోరుతున్నామన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.