TG: తెలంగాణలో నువ్వా నేనా!
ABN , Publish Date - Jun 02 , 2024 | 05:04 AM
తెలంగాణలోని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అంటూ పోటీ పడ్డాయా!? ఫలితాల్లోనూ ఆ రెండూ ఢీకొంటున్నాయా!? రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఉనికిని కోల్పోనుందా!? ఈ ప్రశ్నలకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ‘ఔను’ అనే అంటున్నాయి.
కాంగ్రె్‌స-బీజేపీ మధ్య పోటాపోటీ.. అయినా, బీజేపీదే పైచేయి
బీఆర్‌ఎ్‌సకు ఒక్క సీటూ రాకపోవచ్చు.. ఎగ్జిట్ పోల్స్ అంచనా
కాంగ్రెస్‌కు 7-8, బీజేపీకి 8-9 సీట్లు.. ఇది ఆరా సర్వే
ఇరు పార్టీలకు 7-9 చొప్పున అని ఏబీపీ సీఓటర్ లెక్క
హస్తానికి 4-6, కమలానికి 11-12 సీట్లన్న ఇండియా టుడే
బీఆర్‌ఎ్‌సకు ఒక్క సీటూ అనుమానమే!
ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అంటూ పోటీ పడ్డాయా!? ఫలితాల్లోనూ ఆ రెండూ ఢీకొంటున్నాయా!? రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఉనికిని కోల్పోనుందా!? ఈ ప్రశ్నలకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ‘ఔను’ అనే అంటున్నాయి. శనివారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల అంచనా ప్రకారం.. కాంగ్రెస్, బీజేపీ సమాన సీట్లను సాధించనున్నాయి. మరికొన్ని సంస్థలు అయితే.. కాంగ్రెస్ కంటే బీజేపీయే పైచేయి సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆరా సర్వే సంస్థ, ఏబీపీ-సీ ఓటర్, పీపుల్స్ పల్స్ సంస్థలు రెండు పార్టీలు దాదాపు సమాన సంఖ్యలో సీట్లు గెలుచుకుంటాయని పేర్కొన్నాయి. కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధించనున్న స్థానాల్లో వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూలు, భువనగిరి ఉన్నాయని అనేక సంస్థలు పేర్కొన్నాయి.
కాంగ్రెస్ గెలుపొందనున్న అన్ని స్థానాల్లోనూ బీజేపీ రెండో స్థానంలో, బీఆర్‌ఎస్ మూడో స్థానంలో ఉండనున్నాయి. ఇండియా టుడే, న్యూస్-18, జన్ కీ బాత్, ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ సంస్థలు మాత్రం బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని విశ్లేషించాయి. గత ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ గెలిచింది. వీటిలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ ఉన్నాయి. వీటిని నిలబెట్టుకోవడంతోపాటు చేవెళ్ల, మల్కాజిగిరి, జహీరాబాద్ స్థానాల్లోనూ విజయం సాధించే అవకాశాలున్నాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. అన్ని సంస్థల కంటే భిన్నంగా బీజేపీ 11-12 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఇండియా టుడే - మై యాక్సిస్ సంస్థ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 43 శాతం ఓట్లను సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీ 7-10 స్థానాలను కైవసం చేసుకుంటుందని సీఎన్‌ఎన్ సంస్థ తెలిపింది.
బీఆర్‌ఎస్ 9 నుంచి 0కు
రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకోనుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీ ఓటమి పాలవ్వనుందని దాదాపు అన్ని సంస్థలు తేల్చి చెప్పాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 9 స్థానాలు సాధించిన గులాబీ పార్టీ.. ఈసారి అన్నిచోట్ల మూడో స్థానానికి పరిమితం కానుందని వివరించాయి. ఒక్క సీఎన్‌ఎన్ మాత్రమే బీఆర్‌ఎస్ 2-5 స్థానాలు సాధించే అవకాశముందని పేర్కొంది.
సంస్థ కాంగ్రెస్ బీజేపీ బీఆర్‌ఎస్ ఎంఐఎం
ఆరా 7-8 8-9 0 1
ఏబీపీ-సీఓటర్ 7-9 7-9 0 1
పీపుల్స్ పల్స్ 7-9 6-8 0-1 1
ఇండియా టీవీ 6-8 8-10 0-1 1
న్యూస్ 18 5-8 7-10 0-1 0-1
జన్‌కీ బాత్ 4-7 9-12 0-1 1
ఆపరేషన్ చాణక్య 8 7 1 1
ఇండియ టీవీ
-మై యాక్సెస్ 4-6 11-12 0 1
సిఎన్‌ఎన్ 5-8 7-10 2-5 1