Manuguru: బీటీపీఎస్‌లో ప్రమాదంతో రూ.25కోట్ల నష్టం..
ABN , Publish Date - Jul 01 , 2024 | 04:33 AM
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎ్‌స)లో శనివారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదానికి పిడుగుపాటే కారణమని అధికారులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్-3 (320, 420/16.5 కేవీ) పూర్తిగా కాలిపోయింది.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డైరెక్టర్ లక్ష్మయ్య
డిప్యూటీ సీఎం భట్టి ఆరా.. నివేదిక ఇవ్వాలని ఆదేశం
మణుగూరు/హైదరాబాద్, జూన్ 30(ఆంధ్రజ్యోతి): భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎ్‌స)లో శనివారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదానికి పిడుగుపాటే కారణమని అధికారులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్-3 (320, 420/16.5 కేవీ) పూర్తిగా కాలిపోయింది. దీంతో యూనిట్-1 ద్వారా ఉత్పత్తి అయిన 270 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పిడుగుపాటుతో ట్రాన్స్‌ఫార్మర్ బుష్‌లు పేలిపోయి తునాతునకలయ్యాయి. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉన్న ఆయిల్‌కు నిప్పంటుకోవడం వల్లే మంటలు ఎగిసిపడినట్లు గుర్తించారు. ఆ సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సుమారుగా రూ.25కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
కాగా, ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం రాత్రి 7.26నిమిషాలకు యూనిట్-1 ట్రిప్ కావడానికి పిడుగుపాటే కారణమన్నారు. పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే ఎంత నష్టం జరిగిందన్న అంశాన్ని నిర్దిష్టంగా చెప్పగలమన్నారు. కాగా, బీటీపీఎస్ అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరా తీశారు. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని జెన్‌కో థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య, చీఫ్ ఇంజనీర్లు రత్నాకర్, బిచ్చన్నను ఆదేశించారు.