Sampath Kumar: రాష్ట్రంలో విద్య, ఉద్యోగ రంగాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి
ABN , Publish Date - Aug 12 , 2024 | 04:48 AM
సుప్రీం కోర్టు తీర్పు మేరకు మాదిగ జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగ సంఘాలువిజ్ఞప్తి చేశాయి.
మాదిగ సంఘాల డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు తీర్పు మేరకు మాదిగ జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగ సంఘాలువిజ్ఞప్తి చేశాయి. వర్గీకరణ అమలుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ను కోరాయి. ఈ మేరకు ఆదివారం బంజారాహిల్స్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో మాదిగ సంఘాల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. హక్కుల కోసం జరిగిన అతిపెద్ద ఉద్యమం మాదిగ రిజర్వేషన్ ఉద్యమమన్నారు.
వర్గీకరణ మీద ఈనెల 13న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షులతో సమావేశం జరగనుందని పేర్కొన్నారు. వర్గీకరణపై దేశంలో అన్ని రాష్ట్రాలకంటే మొదట ఆర్డినెన్సు తీసుకువస్తామని సీఎం మాట ఇచ్చారని సతీష్ మాదిగ గుర్తు చేశారు. 75 లక్షల జనాభా ఉన్న మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదని, తక్కువ జనాభా ఉన్న వారికి మాత్రం డిప్యూటీ సీఎం, మంత్రి పదవులు కట్టబెట్టారని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం అసంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో ఈనెల 22న మాదిగలతో భారీ ఎత్తున సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సదస్సులో మాజీమంత్రి ఎర్ర చంద్రశేఖర్, పిడమర్తి రవి, ఎపురి సోమన్న, మాదిగల సంఘాల నాయకులు, తదితరులు మాట్లాడారు.