Share News

Kaleshwaram: మేడిగడ్డ కింద అగాధం?

ABN , Publish Date - May 24 , 2024 | 03:51 AM

మేడిగడ్డ మరమ్మతులకు మరో గండం వచ్చి పడింది. మొత్తం బ్యారేజీ కింద పెద్ద అగాధం ఉన్నట్లుగా నీటిపారుదల శాఖ అధికారులు తేల్చారు. మేడిగడ్డ బ్యారేజీలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల బ్యారేజీ అడుగున పెద్ద అగాధం ఏర్పడిందని అంచనాకు వచ్చారు.

Kaleshwaram: మేడిగడ్డ కింద అగాధం?
Medigadda Project

  • 12000-15000 క్యూబిక్‌ మీటర్ల ఖాళీ

  • బ్యారేజీ పొడవునా బొరియలాగా విస్తరణ!

  • పునాదిలో ఇసుక కొట్టుకుపోవడం వల్లే..

  • ఏడో బ్లాకు వద్ద భూగర్భంలో ప్రకంపనలు

  • 16వ నంబరు గేటు ఎత్తబోతే భారీ శబ్దాలు

  • ప్రెషర్‌ గ్రౌటింగ్‌ పద్ధతిలో ఇసుక సిమెంట్‌తో

  • అగాధం పూడ్చిన తర్వాతే ఎత్తాలని నిర్ణయం

  • దాన్ని నింపకుండా పనులు నిర్వహిస్తే

  • బ్యారేజీ మరింతగా లోపలికి కుంగే ప్రమాదం

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ మరమ్మతులకు మరో గండం వచ్చి పడింది. మొత్తం బ్యారేజీ కింద పెద్ద అగాధం ఉన్నట్లుగా నీటిపారుదల శాఖ అధికారులు తేల్చారు. మేడిగడ్డ బ్యారేజీలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల బ్యారేజీ అడుగున పెద్ద అగాధం ఏర్పడిందని అంచనాకు వచ్చారు. ఆ అగాథం సైజు 12000 క్యూబిక్‌ మీటర్ల నుంచి 15000 క్యూబిక్‌ మీటర్ల వరకు ఉండొచ్చని ఇటీవల నిర్వహించిన గ్రౌండ్‌ పెనట్రేటింగ్‌ రాడార్‌ టెస్ట్‌ ఆధారంగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. అంటే, కొత్త సచివాలయం సైజులో నాలుగో వంతు అన్నమాట. అయితే, ఈ అగాధం ఒకేచోట కాకుండా బ్యారేజీ పొడవునా కొన్నిచోట్ల పెద్దగా కొన్నిచోట్ల చిన్నగా ఉంటుందని వేస్తున్నారు. అగాధం పెద్దగా ఉన్న ఏడో బ్లాక్‌లో ప్రస్తుతం పియర్లు కుంగిపోయాయి.


ఈ బ్లాక్‌లోనే 16వ నంబర్‌ గేటును తాజాగా పైకి ఎత్తడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నించగా, బ్యారేజీ కింద భూగర్భంలో నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. వెంటనే పనులు నిలిపేశారు. జియోఫిజికల్‌, జియో టెక్నికల్‌ పరీక్షలు అగాధం ఉన్న విషయాన్ని ధ్రువీకరించిన నేపథ్యంలో టన్నుల కొద్దీ బరువు ఉన్న భారీ గేటును పైకి ఎత్తే సమయంలో పునాదులపై ఒత్తిడి పెరిగి, బ్యారేజీ మరింత లోతుల్లోకి కుంగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. శబ్దాల నేపథ్యంలో అగాధాన్ని వూడ్చిన తర్వాతే గేట్లను పైకి ఎత్తే పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. నిజానికి ఆనకట్టల భద్రత సంస్థ బ్యారేజీ కింద ఖాళీ ఉన్న విషయాన్ని ఎప్పుడో ధ్రువీకరించింది. దాన్ని తీవ్రత తాజా పరీక్షల్లో తెలుస్తోంది. గతేడాది అక్టోబరు 21న 7వ నంబర్‌ బ్లాకు కుంగిన తర్వాత అక్కడి నుంచి నీటి లీకేజీని ఆపడానికి ఏకంగా 40 వేల ఇసుక బస్తాలను ఖాళీలో వేశారు. తాజాగా 12000-15000 క్యూబిక్‌ మీటర్ల అగాధం ఉందని అంచనాకు రావడం ఆందోళన కలిగించే పరిణామం.


మొత్తం గేట్లు ఎత్తమనడంతో..

మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం ఎనిమిది బ్లాకులు ఉన్నాయి. వాటికి 85 గేట్లు ఉన్నాయి. గతేడాది అక్టోబరు 21న ఏడో బ్లాకు కుంగిన వెంటనే 77 గేట్లను ఎత్తి, బ్యారేజీలో నిల్వ చేసిన నీటిని దిగువకు వదిలేశారు. 7వ బ్లాకు కుంగడంతో 15వ నంబరు నుంచి 22వ నంబర్‌ వరకు గేట్లు మొరాయించాయి. దాంతో అప్పట్లో ఈ గేట్లను ఎత్తలేక పోయారు. పిల్లర్లకు నిట్టనిలువున పగుళ్లు కూడా రావడంతో వీటిని బలవంతంగా ఎత్తే ప్రయత్నం చేయలేదు. కేంద్ర జల వనరుల సంఘం మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల కమిటీ ఇటీవల కాళేశ్వరంపై సమర్పించిన మధ్యంతర నివేదికలో వర్షాకాలానికి ముందు నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతుల గురించి చెప్పింది. మేడిగడ్డలో మొరాయించిన గేట్లన్నీ వర్షాకాలానికి ముందే పైకెత్తాలని స్పష్టం చేసింది. ఏడో బ్లాకులోని రెండు పియర్లకు పగుళ్లు ఏర్పడి ఉండడంతో 19, 20, 21 పియర్ల మధ్య ఉన్న గేట్లను అత్యంత జాగ్రత్తగా పైకి ఎత్తాలని సూచించింది. గేట్లను ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి ఏర్పడకుండా ఇతర గేట్ల వద్ద క్రేన్లను ఏర్పాటు చేసి, ఎత్తాలని సూచించింది. నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీతో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు ఈ నెల 17న 15వ నంబర్‌ గేటును విజయవంతంగా పైకి ఎత్తారు. 16వ నంబర్‌ గేటును ఎత్తడానికి ప్రయత్నించగా, శబ్థాలు, ప్రకంపనలు రావడాన్ని అధికారులు గుర్తించారు.


ఐదేళ్ల క్రితమే సంకేతాలు

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 2019 జూలైలో పూర్తయింది. ఆ ఏడాది వరదల సందర్భంగా బ్యారేజీ ప్రమాద సంకేతాలను వెలువరించిందని ఎన్డీఎ్‌సఏ నిపుణుల కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అప్పట్లో పట్టించుకోక పోవడంతోనే బ్యారేజీ పరిస్థితి నానాటికి దిగజారిపోయి చివరకు కుంగిపోవడానికి కారణమయిందని తేల్చిచెప్పింది. మళ్లీ బ్యారేజీ ప్రమాదసంకేతాలు వెలువరిస్తుండటంతో మున్ముందు ఏం జరుగనుందనే ఆందోళనలు నీటిపారుదల శాఖలో వ్యక్తమవుతున్నాయి. అత్యవసర మరమ్మతులు నిర్వహించే సమయంలో అనుకోని ప్రమాదం సంభవిస్తే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశాలున్నాయని ఇంజనీర్లు భయపడుతున్నారు.


పరీక్షల తర్వాతే బొరియపై స్పష్టత

బ్యారేజీ కింద ఖాళీ ప్రదేశాన్ని గుర్తించడానికి భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలను నిపుణుల కమిటీ సూచించిన మూడు సంస్థలతో అధ్యయనం చేయిస్తారు. అగాధంపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చాక ఇసుక, సిమెంట్‌ మిశ్రమాన్ని పంపించి పూడుస్తారు. దీన్నే ప్రెషర్‌ గ్రౌటింగ్‌ అంటారు.

Updated Date - May 24 , 2024 | 08:58 AM