Share News

Flood Victims: హరీశ్‌రావు మల్లన్నసాగర్‌ ముంపు బాధితులనూ ఓదార్చు!

ABN , Publish Date - Sep 29 , 2024 | 03:41 AM

మూసీ నిర్వాసితులను పరామర్శించిన హరీశ్‌రావు.. మల్లన్నసాగర్‌ ముంపు బాధితులనూ ఓదార్చాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సూచించారు.

Flood Victims: హరీశ్‌రావు మల్లన్నసాగర్‌ ముంపు బాధితులనూ ఓదార్చు!

  • త్వరలోనే టీపీసీసీ కార్యవర్గ విస్తరణ: మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మూసీ నిర్వాసితులను పరామర్శించిన హరీశ్‌రావు.. మల్లన్నసాగర్‌ ముంపు బాధితులనూ ఓదార్చాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సూచించారు. ఇన్నాళ్లుగా వారి బాధలు హరీశ్‌కు కనిపించడంలేదా అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు మల్లన్నసాగర్‌ నిర్వాసితులను కలిసేందుకు తాము వెళితే అప్పటి ప్రభుత్వం అరెస్టులు చేసిందని చెప్పారు. హైడ్రా కార్యకలాపాలు, మూసీ అభివృద్ధితో సామాన్యులకు కొంత ఇబ్బంది కలిగినా మొత్తంగా హైదరాబాద్‌కు లాభమే జరగుతుందని అన్నారు. మూసీ ప్రక్షాళన జరిగితే కింద ఉన్న రెండు జిల్లాలకు సాగునీరు పెరుగుతుందని చెప్పారు.


గాంధీభవన్‌లో శనివారం మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల చేరికతో స్థానికంగా పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, అయితే కొత్త, పాత నేతల మధ్య సమన్వయం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే టీపీసీసీ కార్యవర్గ విస్తరణ ఉంటుందని, ముగ్గురి నుంచి ఐదుగురి వరకు కార్యనిర్వాహక అధ్యక్షులు ఉండే అవకాశం ఉందని అన్నారు. డీసీసీ అధ్యక్ష బాధ్యతలను ఎమ్మెల్యేలకు ఇవ్వాలన్న ప్రతిపాదనా ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని తెలిపారు. ఏఐసీసీ పెద్దలు ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల బిజీలో ఉన్నారని, త్వరలోనే వారిని వెళ్లి కలుస్తామని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు.


  • దసరాలోపు గురుకుల పీఈటీ పోస్టుల భర్తీ

తెలంగాణ గురుకుల నోటిఫికేషన్‌ -2017కు సంబంధించి 616 పీఈటీ పోస్టుల భర్తీని దసరాలోపు పూర్తయ్యేలా చూస్తానని అభ్యర్థులకు టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ హామీఇచ్చారు. గాంధీభవన్‌లో శనివారం మహే్‌షకుమార్‌గౌడ్‌ను కలిసిన ఉద్యోగార్థులు.. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కోరగా.. ఆయన ఈమేరకు హామీ ఇచ్చారు.

Updated Date - Sep 29 , 2024 | 03:41 AM