Share News

Malabar Gold Group: రాష్ట్రంలో రూ.750 కోట్లతో మలబార్‌ గోల్డ్‌ పెట్టుబడులు

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:12 AM

దిగ్గజ ఆభరణాల తయారీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ రాష్ట్రంలో రూ.750 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే రూ.183 కోట్లతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బంగారు, వజ్రాభరణాల తయారీ యూనిట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఆ సంస్థ.

Malabar Gold Group: రాష్ట్రంలో రూ.750 కోట్లతో మలబార్‌ గోల్డ్‌ పెట్టుబడులు

  • 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు

  • మంత్రి శ్రీధర్‌బాబుతో మలబార్‌ చైర్మన్‌ భేటీ

  • ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రైవేటు అప్పులు

  • సోషల్‌ స్టాక్‌ ఎక్స్చేంజీతో నిధుల సమీకరణ

  • కన్సల్టెన్సీలతో శ్రీధర్‌బాబు సమావేశం

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): దిగ్గజ ఆభరణాల తయారీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ రాష్ట్రంలో రూ.750 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే రూ.183 కోట్లతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బంగారు, వజ్రాభరణాల తయారీ యూనిట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఆ సంస్థ.. తాజా పెట్టుబడులతో 1500 మందికి ప్రత్యక్షంగా, మరో 1,250 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించనుంది. మలబార్‌ గోల్డ్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌ గురువారం ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల వివరాలను ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో రూ.750 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు.


ఈ ఏడాది చివరికల్లా ఆభరణాల తయారీ యూనిట్‌ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మలబార్‌ సంస్థ.. మహేశ్వరం యూనిట్‌లో ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చేందుకు 120 మంది మహిళలను ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, గ్రామీణ యువతకు ఆభరణాల తయారీ, మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మలబార్‌ గోల్డ్‌ మహేశ్వరం యూనిట్‌కు ప్రత్యేక తాగునీటి పైప్‌లైన్‌ ఏర్పాటుచేయాలని, మౌలిక సదుపాయాల కల్పన పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


ఏఐపై 20 ఏళ్ల రోడ్‌ మ్యాప్‌..

ప్రభుత్వ పాలన, పారిశ్రామిక రంగాల్లో కృత్రిమ మేధ, సైబర్‌ సెక్యూరిటీ వినియోగంపై.. రానున్న 20 ఏళ్లకు సంబంధించిన ఒక రోడ్‌ మ్యాప్‌ రూపొందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కోరారు. గురువారం ఆయన బ్రిటిష్‌ హైకమిషన్‌, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఏఐ సిటీలో బ్రిటిష్‌ హైకమిషన్‌, ఎర్నెస్ట్‌ సంస్థలు కీలక భాగస్వాములు కావాలని కోరారు. ఏఐ సిటీలో అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంలో సహకరించాలని కోరారు.


ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రైవేటు అప్పులు

ఓవైపు సంక్షేమ పథకాలకు నిధుల లేమి..? మరోవైపు నిరాశాజనకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి..! ఇంకోవైపు కొత్త అప్పులకు ప్రతిబంధకంగా మారిన ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి..! ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. సోషల్‌ ఎక్స్చేంజీల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం ఎక్విప్‌ దేసీ అనే పెట్టుబడుల సేకరణ సంస్థ, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు అవసరమయ్యే కొత్త అప్పులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కార్పొరేట్‌ సంస్థలు తక్కువ వడ్డీలకు రుణాలు ఇస్తుంటాయి. ఈ విధానాన్ని సోషల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ అంటారు. దీనికి సెబీ ఆమోదం కూడా ఉంది. రాష్ట్రంలోని సంక్షేమ పథకాల అమలుకు ఈ విధానం ద్వారా అప్పులను సేకరించాలని నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

Updated Date - Jul 19 , 2024 | 04:12 AM