Mallareddy University: మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థుల ఆందోళన
ABN , Publish Date - Aug 11 , 2024 | 03:50 AM
అస్వస్థతకు గురైన విద్యార్థిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలో వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని, ఆ కారణంగానే అతడు మృతి చెందాడంటూ మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
విద్యార్థి మృతిని నిరసిస్తూ అద్దాలు, సామగ్రి ధ్వంసం
ఆస్పత్రికి తరలించడంలో జాప్యం చేశారని ఆగ్రహం
సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం: వీసీ
మేడ్చల్ టౌన్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): అస్వస్థతకు గురైన విద్యార్థిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలో వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని, ఆ కారణంగానే అతడు మృతి చెందాడంటూ మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీలో మూడు రోజుల క్రితం ఎ.అరుణ్‌కుమార్ అనే విద్యార్థి తరగతి గదిలోనే కుప్పకూలగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలోపే మరణించిన విషయం తెలిసిందే. అయితే, వర్సిటీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడంటూ అగ్రికల్చర్ విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు.
విద్యార్థి సంఘాలతో కలిసి క్యాంప్‌సలోని కాలేజీ భవనం ఎదుట బైఠాయించారు. దీనిపై స్పందించేందుకు తొలుత వర్సిటీ అధికారులు నిరాకరించడంతో ఆగ్రహించిన విద్యార్థులు.. భవనం అద్దాలు, సామగ్రిని ధ్వంసం చేశారు. కాలేజీ నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని, విద్యార్థులతో మాట్లాడారు. అరుణ్‌కుమార్ అస్వస్థతకు గురైన విషయాన్ని జూనియర్ లెక్చరర్లు, హెచ్‌వోడీకి చెప్పినా పట్టించుకోలేదని, 40నిమిషాలు వృథా చేశారని విద్యార్థులు ఆరోపించారు.
ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తరలించేందుకు యత్నించినా అనుమతించలేదని, చివరకు అంబులెన్స్‌ను రప్పించి ఆస్పత్రికి తరలించారని తెలిపారు. అరుణ్‌కుమార్‌ను అరగంట ముందు తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని వైద్యులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీలో అంబులెన్స్‌తోపాటు ప్రైమరీ హెల్త్‌సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వర్సిటీ వీసీ వీఎ్‌సకే రెడ్డి తదితరులు విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తామని హామీ ఇచ్చారు.
తరగతి గదిలో విద్యార్థి చనిపోవడం బాధాకరమని, ఈ విషయమై విచారణ చేపట్టి.. సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వర్సిటీలో శాశ్వతంగా ఉండేలా అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీలు ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.