Vajedu: మా జాడ కోసం పోలీసులే ఏసును అడవికి పంపారు
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:22 AM
తమ జాడ కనుగొనేందుకు ఇల్లెందుల ఏసు అనే వ్యక్తిని పోలీసులే అడవిలోకి పంపగా మందుపాతర తొక్కి అతడు మరణించాడని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఏసు మరణానికి పోలీసులే బాఽధ్యులని, బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంటూ
అతని మరణానికి వారిదే బాధ్యత
లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
వాజేడు, జూన్ 6: తమ జాడ కనుగొనేందుకు ఇల్లెందుల ఏసు అనే వ్యక్తిని పోలీసులే అడవిలోకి పంపగా మందుపాతర తొక్కి అతడు మరణించాడని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఏసు మరణానికి పోలీసులే బాఽధ్యులని, బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంటూ మావోయిస్టు పార్టీ గురువారం ఓ లేఖ విడుదల చేసింది. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురానికి చెందిన ఇల్లెందుల ఏసు(55) కట్టెల కోసం ఇటీవల కొంగాల అడవుల్లోకి వెళ్లి మందుపాతరకు బలయ్యాడు. మందుపాతర పేలడంతో ఏసు వెంట ఉన్న అతని కుమారుడు గాయపడ్డాడు. ఈ ఘటనపై వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత గురువారం లేఖ విడుదల చేశారు. బూచీట్రాప్ తొక్కడంతో ఏసు ప్రాణాలు కోల్పోయాడని, అతని మృతికి తాము చింతిస్తున్నామని పేర్కొన్నారు.
కగార్ పేరుతో మావోయిస్టు పార్టీపై దాడులు జరుగుతున్నాయని, కొందరికి డబ్బు ఆశచూపి వేటగాళ్ల మాదిరిగా అడవిలోకి పంపి తమ సమాచారం తెలుసుకుని తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీ్‌సగఢ్ పోలీసులు కూం బింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈనేపథ్యంలో ఆత్మరక్షణ కోసం ఎత్తైన కొండల్లో అనేక ట్రాప్‌లు ఏర్పాటు చేశామని, ఈ విషయాన్ని పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తెలియజేశామని పేర్కొన్నారు. ఏసు మృతికి బాధ్యత వహించకపోగా మావోయిస్టులపై నింద వేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల అనుసరిస్తున్న ఈ విధానాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు.