Share News

Hyderabad: ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ ఆలస్యం?

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:33 AM

వైద్య విద్యకు సంబంధించి ఎంబీబీఎస్‌ ప్రవేశాల ప్రక్రియ ఈ ఏడాది ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. నీట్‌ -2024పై దేశ వ్యాప్తంగా జరుగుతున్న రగడే ఇందుకు కారణం. నీట్‌ మార్కులపై ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది.

Hyderabad: ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ ఆలస్యం?

  • నీట్‌-2024పై రగడే కారణం!

  • తెలంగాణలో 56 కాలేజీల్లో 8,515 ఎంబీబీఎస్‌ సీట్లు

  • రాష్ట్రంలో కొత్త కళాశాలలపై కొనసాగుతున్న సందిగ్ధత

  • ఇప్పటిదాకా తనిఖీలకు రాని ఎన్‌ఎంసీ ఈ ఏడాది ఆయా కళాశాలల్లో ప్రవేశాలు అనుమానమే

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) : వైద్య విద్యకు సంబంధించి ఎంబీబీఎస్‌ ప్రవేశాల ప్రక్రియ ఈ ఏడాది ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. నీట్‌ -2024పై దేశ వ్యాప్తంగా జరుగుతున్న రగడే ఇందుకు కారణం. నీట్‌ మార్కులపై ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. నీట్‌-2024ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిల్‌ను కోర్టు తోసిపుచ్చింది. కానీ, నీట్‌ విషయంలో మరిన్ని కేసులు పడే అవకాశం ఉందని, విషయం అంత త్వరగా తేలేట్లుగా కనిపించడం లేదని జాతీయ వైద్య విద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) అధికారులు రాష్ట్ర వైద్య విద్య ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మరోపక్క, దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీలు, వాటిలోని సీట్ల వివరాలను ఎన్‌ఎంసీ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. విద్యార్థులు ఆయా కళాశాలల్లోనే చేరాలనే పేర్కొంది. ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు కలిపి తెలంగాణలో 56 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో మొత్తం 8,515 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి.


కొత్త కాలేజీల సంగతేంటో?

రాష్ట్రం ప్రభుత్వం దరఖాస్తు చేసిన కొత్త వైద్య కళాశాలల అనుమతిపై ఎన్‌ఎంసీ ఏటూ తేల్చడం లేదు. అనుమతి ఇస్తారో ? ఇవ్వరో కూడా స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో కొత్త కళాశాలల్లో ఈ ఏడాది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం అనుమానంగానే ఉంది. గద్వాల, వరంగల్‌(నర్సంపేట్‌), యాదాద్రి, మేడ్చల్‌ (కుత్బుల్లాపూర్‌), నారాయణపేట్‌, ములుగు, మెదక్‌, రంగారెడ్డి(మహేశ్వరం) జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు- సెప్టెంబరులో ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేసింది. ఆయా కళాశాలలను వర్చువల్‌గా, స్వయంగా తనిఖీ చేసిన ఎన్‌ఎంసీ బృందాలు పలు లోపాలను ఎత్తి చూపి వాటిని సరిచేసుకోవాలని సూచించాయి. ఆ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ లోపాలను సవరించింది. అయితే వైద్య కళాశాలలకు లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌(ఎల్‌ఓపీ) ఇచ్చేముందు ఎన్‌ఎంసీ బృందాలు మరోమారు తనిఖీ చేస్తాయి. మరికొద్ది రోజుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఎన్‌ఎంసీ బృందాలు ఇప్పటిదాకా మళ్లీ తనిఖీలకు రాలేదు.


నిజానికి, తాము ఎత్తిచూపిన లోపాలను సరి చేసుకున్నట్టు చూపించిన తర్వాత వాటికి సంతృప్తి చెందితేనే ఎన్‌ఎంసీ అనుమతి ఇస్తుంది. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ప్రభుత్వం అప్పీలు చేసుకునే వీలుంటుంది. ప్రభుత్వ కళాశాల కాబట్టి సర్కారే గ్యారంటీగా ఉండి లోపాలను సవరించుకుంటామని లిఖితపూర్వక హామీనిస్తుంది. దాంతో ఎన్‌ఎంసీ అనుమతి మంజూరు చేస్తుంది. ఈ వ్యవహారానికి 20-30 రోజుల సమయం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరుతూ వైద్యవిద్య సంచాలకులు ఎన్‌ఎంసీకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఎన్‌ఎంసీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మరోపక్క, అనుమతుల విషయమై కొన్ని వైద్య కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి చర్చినట్టు సమాచారం.

Updated Date - Jun 13 , 2024 | 03:33 AM