Share News

Harish Rao: గతంలో కేటీఆర్‌ను విమర్శించిన సీఎం రేవంత్‌.. ఇప్పుడు దావొస్‌కు ఎందుకెళ్లారు

ABN , Publish Date - Jan 18 , 2024 | 05:11 PM

దావొస్‌కు గతంలో మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) వెళ్తే సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) డబ్బులు దండగ అని విమర్శించారని.. ఇప్పుడు అక్కడకు ఆయన ఎందుకు వెళ్లారని మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao ) ప్రశ్నించారు.

Harish Rao: గతంలో కేటీఆర్‌ను విమర్శించిన సీఎం రేవంత్‌.. ఇప్పుడు దావొస్‌కు ఎందుకెళ్లారు

సిద్దిపేట: దావొస్‌కు గతంలో మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) వెళ్తే సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) డబ్బులు దండగ అని విమర్శించారని.. ఇప్పుడు అక్కడకు ఆయన ఎందుకు వెళ్లారని మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao ) ప్రశ్నించారు. అదానీ అవినీతి వెనుక ప్రధాని మోదీ ఉన్నాడని రాహుల్ గాంధీ గతంలో అంటే.. ఇప్పుడేమో రేవంత్‌రెడ్డి అతని కోసం పాకులాడుతున్నారని.. ఇద్దరిలో ఎవరు కరెక్టో చెప్పాలని నిలదీశారు. బీజేపీతో కొట్లాడతామని కాంగ్రెస్ నేతలు గతంలో అన్నారని.. ఇప్పుడేమో వారితో కలిసి తిరుగుతున్నారన్నారు. బీజేపీలో బండి సంజయ్, రఘునందన్‌రావు, అరవింద్, ఈటల రాజేందర్ లాంటి నేతలను బీఆర్ఎస్ ఓడించిందని గుర్తుచేశారు. గజ్వేల్‌లో బీఆర్‌ఎస్ కృతజ్ఞత సభను గురువారం నిర్వహించారు. ఈ సభలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడుతూ... గజ్వేల్‌లో కేసీఆర్ గతంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను కూడా కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం తగ్గుతుందన్నారు. రైతులకు భరోసాను ఇచ్చి సాగు విస్తీర్ణం పెంచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పారు. ఇప్పుడిప్పుడే కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడుతుందని. 10, 15 రోజుల్లో ఆయనే గజ్వేల్‌కి వస్తారన్నారు. కర్ణాటకలో ఆరు నెలలైనా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని, అదే పరిస్థితి త్వరలో తెలంగాణలో కూడా పునరావృతం అవుతుందన్నారు. కొండపొచమ్మ, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయాలని హరీశ్‌రావు కోరారు.

కాంగ్రెస్ అభివృద్ధి అంతా కేసులు, కుట్రలు, బెదిరించుడే...

కాంగ్రెస్ అభివృద్ధి అంతా కేసులు, కుట్రలు, బెదిరించుడు తప్ప ఏం లేదని విమర్శించారు. రెండు జాతీయ పార్టీల కుట్రలను ఛేదించి గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌ను గెలిపించుకున్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నా సమయంలో గజ్వేల్‌లో ఏ పార్టీ వారిపై కేసులు పెట్టలేదు, వేధించలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో హత్య రాజకీయాలు, క్రిమినల్ కేసులు, దండగలు కట్టుడు, పంచాయతీలు లేవని.. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుడు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందని చెప్పారు. గజ్వేల్‌లో గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలను వేధించేవారని.. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదని అంతలోనే బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కేసుల్లో ముందుకు తీసుకు పోతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ 9వ తేదీన రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని అన్నారని.. ఇంత వరకు రైతు బంధు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. రైతు బంధు, నిరుద్యోగ భృతి, 4 వేల పెన్షన్, ఉచిత విద్యుత్, తదితర హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి.. ఇంత వరకు ఏ ఒక్కటినీ కూడా అమలు చేయడం లేదని హరీశ్‌రావు ఆక్షేపించారు.

Updated Date - Jan 18 , 2024 | 06:12 PM