Crime News: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో లక్షలు స్వాహా చేసిన కిలేడీలు..
ABN , Publish Date - Jul 17 , 2024 | 08:38 PM
నిత్యం ఏదో ఒక అంశంలో ప్రజల్ని కేటుగాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు. ప్రతి రోజూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు, బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెట్టి మరికొందరు, ఆన్ లైన్ మోసాలకు ఇంకొందరు బలైపోతున్నారు. మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ యాప్‌ల ద్వారా యువతీయువకులు సైతం మోసపోతున్నారు. మీ పేరుతో లాటరీ తగిలిందని ఆ నగదు మెుత్తాన్ని మీ ఖాతాలో వేయాలంటే చెప్పిన లింక్‌పై క్లిక్ చేయాలంటూ మరికొందరిని బురిడీ కొట్టిస్తున్నారు.
సంగారెడ్డి: నిత్యం ఏదో ఒక అంశంలో ప్రజల్ని కేటుగాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు. ప్రతి రోజూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు, బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెట్టి మరికొందరు, ఆన్ లైన్ మోసాలకు ఇంకొందరు బలైపోతున్నారు. మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ యాప్‌ల ద్వారా యువతీయువకులు సైతం మోసపోతున్నారు. మీ పేరుతో లాటరీ తగిలిందని ఆ నగదు మెుత్తాన్ని మీ ఖాతాలో వేయాలంటే చెప్పిన లింక్‌పై క్లిక్ చేయాలంటూ మరికొందరిని బురిడీ కొట్టిస్తున్నారు.
అలాగే బ్యాంక్ ఖాతాల నుంచి బాధితులకు తెలియకుండానే నగదు మాయం చేస్తున్న కేటుగాళ్లు మరికొందరు. ఇలాంటి మోసాలు నిత్యకృత్యంగా మారాయి. మోసం చేసే వారిలో ఆడ, మగ తేడా లేదు. మోసపోయే వారిలోనూ ఆడ, మగ, విద్యావంతులు, నిరక్ష్యరాసులు అన్న తేడా లేదు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కితే ఇక అంతే సంగతులు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సంగారెడ్డిలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కిలేడీలు లక్షలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.
సంగారెడ్డిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉద్యోగిణి అనురాధ, ఆశావర్కర్ మరియమ్మ నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేశారు. స్టాఫ్ నర్సు, కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేశారు. ఒక్కొక్కరి వద్ద రెండు నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేశారు. నగదు తీసుకుని ఎన్ని రోజులైనా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో గట్టిగా నిలదీశారు.
దీంతో బాధితులకు నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చి బురిడీ కొట్టించారు. ఎంతో ఆశతో విధుల్లో చేరేందుకు ఆ పత్రాలు తీసుకుని వెళ్లారు బాధితులు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత మోసపోయినట్లు గుర్తించారు. దీంతో అనురాధ, మరియమ్మను నిలదీశారు. అనంతరం సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మోసం చేసిన కిలేడీలు అనురాధ, మరియమ్మలను అరెస్టు చేశారు.