Share News

Dr. Shivaramprasad: అకడమిక్‌ డీఎంఈ రాజీనామా!

ABN , Publish Date - Aug 10 , 2024 | 04:31 AM

వైద్యవిద్య అకడమిక్‌ సంచాలకుడు డాక్టర్‌ శివరాంప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేశారు. తనను ఆ పోస్టు నుంచి తప్పించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు.

Dr. Shivaramprasad: అకడమిక్‌ డీఎంఈ రాజీనామా!

  • ఆ పోస్టు తనకొద్దంటూ సర్కారుకు శివరాంప్రసాద్‌ లేఖ

  • కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు తేవాల్సిందేనని ఉన్నతాధికారుల ఒత్తిడి!

  • అది భరించలేకనే తప్పుకొన్న శివరాం?

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): వైద్యవిద్య అకడమిక్‌ సంచాలకుడు డాక్టర్‌ శివరాంప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేశారు. తనను ఆ పోస్టు నుంచి తప్పించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. తాను అకడమిక్‌ డీఎంఈగా విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నానని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వైద్యవిద్య సంచాలకుల పరిఽధిలో జరిగిన సాధారణ బదిలీల కంటే ముందే ఆయన సర్కారుకు రాజీనామా లేఖను పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా ఆయన డీఎంఈ కార్యాలయానికి కూడా రావడం లేదు.


వైద్యవిద్య అకడమిక్‌ సంచాలకుడిగా తీవ్రమైన పనిభారం, ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేకనే ఆ పోస్టు నుంచి తప్పుకొన్నారని శివరాంప్రసాద్‌ సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం కొత్తగా 8 వైద్య కళాశాలల్లో ఈ ఏడాది నుంచి ప్రవేశాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, అధ్యాపకులు, సౌకర్యాల లేమి కారణంగా 8 కాలేజీలకు జాతీయ వైద్య మండలి అనుమతి ఇవ్వలేదు. దీనిపై డీఎంఈ కార్యాలయం అప్పీలుకు వెళ్లగా.. నాలుగింటికి అనుమతులు వచ్చాయి. మరో నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. ఎలాగైనా సరే వాటికి అనుమతులు తీసుకురావాల్సిందేనని ఉన్నతాఽధికారులు డీఎంఈ కార్యాలయంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అది భరించలేకనే ఆయన అకడమిక్‌ డీఎంఈ పదవి నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.

Updated Date - Aug 10 , 2024 | 04:31 AM