Damodar Rajanarasimha: వర్గీకరణ చట్టరూపం దాల్చేవరకు కలిసి సాగుదాం
ABN , Publish Date - Aug 04 , 2024 | 05:10 AM
ఎస్సీ వర్గీకరణ చట్ట రూపం దాల్చేవరకు కలిసికట్టుగా ముందుకు సాగాలని మంత్రి దామెదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రాలు వర్గీకరణను చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్‌కు రుణపడి ఉంటాం: దామోదర
బేగంపేట, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ చట్ట రూపం దాల్చేవరకు కలిసికట్టుగా ముందుకు సాగాలని మంత్రి దామెదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రాలు వర్గీకరణను చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లోని బేగంపేట ప్లాజా హోటల్‌లో ‘ఎస్సీ వర్గీకరణ-మాదిగల భవిష్యత్’ అనే అంశంపై మాదిగ ప్రజా ప్రతినిధులు, నేతల సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దామోదర మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాతో సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించడం వల్లే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామన్న సీఎంకు రుణపడి ఉంటామన్నారు. ఎస్సీ వర్గీకరణకు నిపుణులతో కమిటీ వేసి ఆర్డినెన్స్ తేవాలని ఆయన్ను కోరతామని చెప్పారు. మాదిగల సమ్మేళనం పేరుతో ఈనెల 16 లేదా 17వ తేదీల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సీఎంను ఆహ్వానించి.. సన్మానించనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసి మాదిగ జాతికి చంద్రబాబు ఎంతో మేలు చేశారన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేల్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్యతో పాటు పలువురు దళిత నేతలు పాల్గొన్నారు.