Kaleshwaram: పనులు ఎలా జరుగుతున్నాయి!
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:51 AM
రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఎన్‌డీఎ్‌సఏ మధ్యంతర నివేదిక ప్రకారం మరమ్మతు పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి శుక్రవారం ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ సందర్శించనున్నారు.
హైదరాబాద్, మహదేవపూర్ రూరల్, మంథని/మంథనిరూరల్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఎన్‌డీఎ్‌సఏ మధ్యంతర నివేదిక ప్రకారం మరమ్మతు పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి శుక్రవారం ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 11.40 గంటలకు హెలికాప్టర్‌లో సుందిళ్లకు చేరుకొని, బ్యారేజీ మరమ్మతు/పునరుద్ధరణ పనులను పరిశీలిస్తారు. నిర్మాణ సంస్థ నవయుగతో పనులపై చర్చిస్తారు. అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలిస్తారు. తర్వాత మేడిగడ్డకు వెళతారు. బ్యారేజీని పరిశీలించి, మరమ్మతులపై నిర్మాణ సంస్థతో చర్చిస్తారు. మేడిగడ్డలో ప్రస్తుతం గ్రౌటింగ్‌తో పాటు గేట్లను ఎత్తే ప్రక్రియ చేపడుతున్నారు. గురువారం అధికారులు మేడిగడ్డ 16, 17వ నంబర్ గేట్లను విజయవంతంగా పైకి లేపారు. ఈ గేట్లను 100.50 మీటర్ల ఎత్తుకు లేపారు. దీంతో మరో ఐదు గేట్లను ఎత్తే ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.
నేడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలనకు మంత్రి ఉత్తమ్
కాగా, 7వ బ్లాకులో చేపట్టిన భూభౌతిక, మృత్తిక, భూసాంకేతిక పరీక్షలు కొనసాగుతున్నాయి. సీఎ్‌సఎంఆర్‌ఎ్‌సకు చెందిన హరిదేవ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల నిపుణుల బృందం ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రతి పిల్లరు, గేట్ల ముందున్న బే ప్రాంతాల్లో ఈ బృందం పరీక్షలు చేస్తున్నట్టు ఓ అధికారి వివరించారు. మరోవైపు సుందిళ్ల బ్యారేజీ మరమ్మతు పనులు వారం రోజులుగా వేగంగా కొనసాగుతున్నాయి. ఎన్‌డీఎ్‌సఏ సూచనల మేరకు బ్యారేజీ ఎగువ, దిగువన సీసీ బ్లాక్‌ల మరమ్మతులను నవయుగ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 2022లో వరదల వల్ల బ్యారేజీ ఎగువ ప్రాంతంలో కట్టకు ఒకవైపు పడిన గండిని పూర్తిస్థాయిలో పూడ్చివేస్తున్నారు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం అన్నారం, శనివారం సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి, మరమ్మతు పనులను పరిశీలిస్తారు. తర్వాత హైదరాబాద్ చేరుకుని సోమవారం నుంచి శనివారం వరకు విచారణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. ఈ నెల 16న తిరిగి కోల్‌కతా వెళతారు.