Share News

Komatireddy Rajagopal Reddy: సభకే రానప్పుడు.. విపక్ష నేతగా ఎందుకు?

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:04 AM

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శాసనసభకే రానప్పుడు.. ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలెందుకని ప్రశ్నించారు.

Komatireddy Rajagopal Reddy: సభకే రానప్పుడు.. విపక్ష నేతగా ఎందుకు?

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ఒకరికి ఇవ్వొచ్చుగా!

  • అధికారం ఉన్నప్పుడు రాజును అనుకున్నారు

  • ఐఏఎ్‌సలతోనూ కాళ్లు మొక్కించుకున్నారు

  • విద్యుత్తు రంగంపై బాధ్యతలేని నిర్ణయాలు

  • కేసీఆర్‌పై ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు

  • మీకు కేసీఆర్‌ అవసరంలేదు.. మేమే ఎక్కువ

  • ఒకేరోజు 19 పద్దులపై చర్చ సాధ్యమా?: జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శాసనసభకే రానప్పుడు.. ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలెందుకని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ సభ్యుల్లోనే ఎవరో ఒకరికి ఆ అవకాశం ఇవ్వొచ్చు కదా! అని అన్నారు. సోమవారం శాసనసభలో డిమాండ్లపై చర్చ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, ‘‘పదేళ్లు మీ స్థాయి (బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేల) ఏంటో అందరికీ తెలుసు. సీఎం మీకు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. నేను రాజును, నా తర్వాత నా కొడుకు రాజు అవుతాడు అనుకున్నాడు. రాష్ట్రాన్ని రాజులాగా, దేశంలో తెలంగాణ భాగం కాదన్నట్లుగా పాలించాడు.


దేశంలో ఎక్కడా లేనివిధంగా మంత్రులు, ఎంపీలతోపాటు ఐఏఎ్‌సలతోనూ కాళ్లు మొక్కించుకున్నాడు’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలో ఓట్లన్నీ బీజేపీకి వేయించారని ఆరోపించారు. ఛత్తీ్‌సగఢ్‌తో తక్కువ ధర కే ఒప్పందం చేసుకున్నా.. చెల్లింపులు చేయకపోవడం వంటి కారణాలతో ఆ రాష్ట్రం కరెంట్‌ ఆగిపోయిందని తెలిపారు. పైగా ఛత్తీ్‌సగఢ్‌ నుంచి కరెంట్‌ కొంటామని కారిడార్‌ బుక్‌ చేసుకొని, కరెంట్‌ తెచ్చుకోకున్నా.. చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. విద్యుత్తు రంగంలో బాధ్యతారాహిత్యంతో నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. దేశంలో సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్‌ కట్టారని విమర్శించారు.


దేశంలో పవర్‌ ప్లాంట్లన్నీ బొగ్గు గనుల ఉదరభాగంలో కడతారని, కానీ.. దామరచర్లలో యాదాద్రి ప్లాంట్‌ నిర్మాణం మాత్రం బొగ్గు గనులకు 250 కిలోమీటర్ల దూరంలో చేపడుతున్నారని అన్నారు. యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్‌ల పనులను నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారని, ఈ ప్లాంట్‌లలో సబ్‌ కాంట్రాక్ట్‌లన్నీ కూడా తమ వారికే కట్టబెట్టారని ఆరోపించారు. రామగుండంలో 4వేల మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాన్ని ఎన్‌టీపీసీ తన సొంత నిధులతో కడుతుండగా.. ప్రభుత్వం మాత్రం అప్పులు చేసి, తప్పుడు నిర్ణయాలతో ప్లాంట్‌ల నిర్మాణం చేపట్టిందని విమర్శించారు. కరెంట్‌ తీసుకుంటారా? లేదా? అని ఎన్‌టీపీసీ నాలుగు దఫాలుగా లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. పదేళ్ల పాలనలో ఇళ్లపై నుంచి వైర్లు కూడా మార్చలేదని, హైదరాబాద్‌లో తమ బంధువు కూడా కరెంట్‌ షాక్‌తో చనిపోయారని విచారం వ్యక్తం చేశారు.


  • కేసీఆర్‌ అవసరం లేదు.. మేమే ఎక్కువ

‘‘శాసనసభలో మీతో చర్చించడానికి కేసీఆర్‌ అవసరంలేదు.. మీకు మేమే ఎక్కువ’’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి.. అధికారపక్ష సభ్యులనుద్దేశించి అన్నారు. పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘కరెంట్‌ తీసుకుంటారా? లేదా? అని ఎన్‌టీపీసీ 4 నెలలుగా లేఖలు రాస్తోంది. అధికారంలో ఉన్నది మీరే. ఇంకా అధికారంలోకి వచ్చామనే భావన మీలో కలగడం లేదు. ఛత్తీ్‌సగఢ్‌ కరెంట్‌ యూనిట్‌కు రూ.3.90కే వస్తే.. ఎన్‌టీపీసీ కరెంట్‌కు రూ.5.60 అవుతాయి. ఒక ప్రభుత్వరంగ సంస్థ మరో ప్రభుత్వరంగ సంస్థతో ఒప్పందం చేసుకున్నా, నామినేషన్‌పై పనులు అప్పగించినా నష్టాలేముంటాయి?’’ అని ప్రశ్నించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే రూ.30 వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పినా తాము వినకుండా.. ఆ మొత్తాన్ని వదులుకున్నామని చెప్పారు.


ఉదయ్‌ ఒప్పంద పత్రాలు చూపించి... ఏదో కొలంబస్‌, వాస్కోడిగామాలాగా సీఎం వ్యవహరించారని మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు తప్ప.. మిగిలిన వినియోగదారులకు మీటర్లు పెట్టడమే ఉదయ్‌ ఒప్పందంలో ఉందని తెలిపారు. విషయాన్ని దాచిపెట్టి, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికే ఉదయ్‌ ఒప్పందం వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు సహా 27 రాష్ట్రాలు ఉదయ్‌ ఒప్పందంలో చేరిన తర్వాత తాము చేరామని పేర్కొన్నారు. 2014కు ముందే కరెంట్‌ లైన్ల కింద ఇళ్లు కట్టుకున్నారని, 2014 తర్వాత కట్టకుండా అడ్డుకున్నామని తెలిపారు. 2014కు ముందు తెలంగాణ విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 7778 మెగావాట్లుగా ఉంటే.. గత పదేళ్లలో 19 వేల మెగావాట్లకు చేరిందన్నారు.


2014కు ముందు రోజూవారీ వినియోగం 128 మిలియన్‌ యూనిట్లు ఉంటే.. 298 మిలియన్‌ యూనిట్లకు చేర్చామన్నారు. అప్పులు చేసి అభివృద్ధి చేశామని, అప్పులు చేయకుండానే ఇంత వృద్ధి సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. అంతకుముందు పద్దుల పుస్తకాలు అందకపోవడంపై స్పందిస్తూ, ‘‘ఒకే రోజు 19 పద్దులపై చర్చ చేయడం ప్రజాస్వామ్యమా? మేమేం మాట్లాడాలో మాకే అర్థం కావడం లేదు. తెల్లవారుజామున 4:30 గంటలకు పద్దుల పుస్తకం పంపించి, చర్చించాలని కోరితే ఎలా?’’ అని జగదీశ్‌రెడ్డి ఆక్షేపించారు.

Updated Date - Jul 30 , 2024 | 03:04 AM