Share News

T. Jaggareddy: మోదీ హయాంలో వంద ఎమర్జెన్సీలు!

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:54 AM

‘‘ఎప్పుడో 50 ఏళ్ల కిందటి ఎమర్జెన్సీ గురించి ప్రధాని మోదీ మాట్లాడుతున్నరు. కానీ.. మోదీ నేతృత్వంలో వంద ఎమర్జెన్సీలు ఉన్నట్టుగా పాలన సాగింది’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆరోపించారు. బంగ్లాదేశ్‌ విమోచన కోసం పాకిస్తాన్‌తో యుద్ధం చేసినప్పుడు అప్పటి బీజేపీ నేత వాజ్‌పేయి..

T. Jaggareddy: మోదీ హయాంలో వంద ఎమర్జెన్సీలు!

  • ఇందిరను దుర్గామాతగా వాజ్‌పేయి అభివర్ణించారు.. ఆ విషయాన్ని ప్రధాని మోదీ ఎందుకు ప్రస్తావించరు?

  • వెనక్కి తీసుకున్న సాగు చట్టాలపై చర్చ ఎందుకు పెట్టరు?

  • పుల్వామా దాడి ఘటనపై చర్చ చేపట్టే ధైర్యం లోక్‌సభస్పీకర్‌కు ఉందా?

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): ‘‘ఎప్పుడో 50 ఏళ్ల కిందటి ఎమర్జెన్సీ గురించి ప్రధాని మోదీ మాట్లాడుతున్నరు. కానీ.. మోదీ నేతృత్వంలో వంద ఎమర్జెన్సీలు ఉన్నట్టుగా పాలన సాగింది’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆరోపించారు. బంగ్లాదేశ్‌ విమోచన కోసం పాకిస్తాన్‌తో యుద్ధం చేసినప్పుడు అప్పటి బీజేపీ నేత వాజ్‌పేయి.. ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చారని గుర్తు చేశారు. బీజేపీ నేతలకు ఆ విషయం గుర్తు లేదా? సభలో ప్రధాని మోదీ ఎందుకు ప్రస్తావించలేదు? అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతైనా ప్రజలకు ఉపయోగపడే అంశాల గురించి పార్లమెంట్‌లో మోదీ మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. కానీ ఎమర్జెన్సీ అంశాన్ని ఆయన ప్రస్తావించడం దురదృష్టకరం’’ అని అభిప్రాయపడ్డారు.


ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందరాగాంధీ ఓడినా.. ఆ తర్వాతి ఎన్నికల్లో 353 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఎప్పుడో జరిగిన ఘటనను ఇప్పుడు సభలో ప్రస్తావించడం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? అని నిలదీశారు. మోదీ తీరును మోహన్‌ భాగవత్‌ సైతం తప్పు పట్టారని పేర్కొన్నారు. ‘‘బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఇందిరాగాంధీది. మోదీ ప్రధాని అయ్యాక.. బ్యాంకులనే ఎత్తివేశారు. ఈ అంశంపై చర్చకు సిద్దమా?’’ అని సవాల్‌ విసిరారు. ఆనాడు భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తే యుద్ధం చేసి తిరిగి తీసుకువచ్చారని, ఇప్పుడు మోదీ ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారని నిలదీశారు. గుజరాత్‌కు మోదీ సీఎంగా ఉన్నప్పుడే గోద్రా ఘటన జరిగిందని, 2 వేల మంది చనిపోయారని గుర్తు చేశారు. ఈ ఘటనపై చర్చకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. సాగు చట్టాలను తెచ్చి రైతులను హింసించిన బీజేపీ.. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చిస్తుందా? పుల్వామా దాడి ఘటనపై చర్చ చేపట్టే ధైర్యం లోక్‌సభ స్పీకర్‌కు ఉందా? అని నిలదీశారు.


పదేళ్లలో ఒక సారి సీఎం అవుతా!

‘‘సోనియా, రాహుల్‌ ఆదేశిస్తే రెండేళ్లు గాంధీభవన్‌లో అటెండర్‌గా పనిచేస్తా. కానీ, వచ్చే పదేళ్లలో ఒక్క సారి పీసీసీ చీఫ్‌, సీఎంను అవుతా’’ అని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన వయస్సు 58 ఏళ్లని, 68 వచ్చేలోగా సీఎం అవుతానని పేర్కొన్నారు. తాను ఒక విజన్‌తో ఉన్నానని, ఎవరికీ పోటీ కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌ ఎంపికకు సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని, ఆ ప్రొటోకాల్‌లో కూడా తాను లేనని చెప్పారు. సోనియా, రాహుల్‌ తీసుకునే నిర్ణయం సరిగ్గానే ఉంటుందని, దాన్నే తాను అనుసరిస్తానని వెల్లడించారు. టీపీసీసీ చీఫ్‌ పోస్టు కోసం పది మంది నేతల పేర్లపై చర్చ జరుగుతోందని ఇంతటి స్వేచ్ఛ బీజేపీలో ఉంటుందా? అని నిలదీశారు.

Updated Date - Jun 29 , 2024 | 04:54 AM