Khammam Floods: కన్నీరు మున్నేరు
ABN , Publish Date - Sep 03 , 2024 | 04:36 AM
కుండబోత వర్షం.. ఫలితంగా ముంచెత్తిన వరద హోరు తగ్గాయి! అయితే అవి మిగిల్చిన విధ్వంసం.. ఇళ్లలో నిత్యావసరాలు సహా అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన బడుగు జీవుల్లో నిండిన విషాదం ఎప్పుడు పోతుందనేది మాత్రం తెలియదు! ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉప్పొంగి..
ఊర్లలోకి వరద..
ఇళ్లలో మోకాలిలోతు బురద
ఖమ్మం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కుండబోత వర్షం.. ఫలితంగా ముంచెత్తిన వరద హోరు తగ్గాయి! అయితే అవి మిగిల్చిన విధ్వంసం.. ఇళ్లలో నిత్యావసరాలు సహా అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన బడుగు జీవుల్లో నిండిన విషాదం ఎప్పుడు పోతుందనేది మాత్రం తెలియదు! ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉప్పొంగి.. జిల్లా కేంద్రం సహా రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, కూసుమంచి, చింతకాని, ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఎక్కడచూసినా మోకాలిలోతు బురదే! ఇళ్లలోనూ బురదే!మాయదారి వరద దెబ్బకు సైకిళ్లు, బైక్‌లతో పాటు టీవీలు, ఫ్రిజ్‌ల వంటి గృహోపకరణాలు పనికిరాకుండా పోయాయి.
ఏడాది గాసం కోసం నిల్వ ఉంచుకున్న బియ్యం, పప్పులు అన్నీ వరదపాలవ్వడంతో ఏం తిని బతికేది? అన్న ఆందోళన బాధితుల నుంచి వ్యక్తమవుతోంది. శనివారం రాత్రి మున్నేరు ఉప్పెనతో ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కట్టుబట్టలతో పిల్లాపాపలతో కలిసి పునరావాస కేంద్రాలకు పరుగులు తీసిన ప్రజలు అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కాగా మహోగ్రరూపం దాల్చిన మున్నేరు తగ్గుముఖం పట్టింది. ఆదివారం మధ్యాహ్నం 36 అడుగులకు చేరుకున్న మున్నేరు రాత్రినుంచి తగ్గుముఖం పట్టి సోమవారం ఉదయం 19.5 అడుగులకు చేరుకుంది.
మున్నేరు వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 7,090 మందిని తరలించారు. సోమవారం ఉదయానికి వరద తగ్గడంతో దాదాపు సగం మంది ఇళ్లకు చేరుకున్నారు. కంపుకొడుతున్న పరిసరాల మధ్య ఇళ్లలో పేరుకుపోయిన బురదను శుభ్రం చేసుకుంటున్నారు. ఖమ్మంలోని బొక్కలగడ్డ, మోతినగర్, కవిరాజ్‌నగర్, మమతారోడ్డు, ఖానాపురం, వెంకటేశ్వరనగర్, ధంసలాపురం, దానవాయిగూడెం, రూరల్ మండలంలోని కరుణగిరి, జలగంనగర్ పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు జలమయం కావడంతో బురద మేటలు వేసింది. ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు వరద కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పునరుద్ధరణకు, తాగునీరు అందించేందుకూ చర్యలు చేపట్టారు. మున్నేరు వరద, వర్షంనీరు కారణంగా ఖమ్మం పట్టణంలో పంపింగ్‌వెల్స్ పనిచేయకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. కొన్ని కాలనీల్లో విద్యుత్తు సరఫరా లేక మోటార్లు పనిచేయడం లేదు.
చూస్తుండగానే మా ఇల్లు మునిగింది
ఇలాంటి వరద ఎప్పుడూ చూడలేదు. ఒక్కసారిగా వరద వచ్చపడింది. ఇళ్లు, సామగ్రి వదిలేసి భార్యాపిల్లలతో బయటకొచ్చాం. చూస్తుండగానే ఇల్లు మునిగింది. ఇప్పుడు పునరవాస కేంద్రంలో ఉంటున్నాం.. ఇక్కడ భోజనం, వసతి బాగానే ఉంది. ఇంటికి వెళితే మళ్లీ ఎలా బతకాలో అర్థం కావడంలేదు. వరదతో ఉన్నదంతా కోల్పోయాం. ఇంట్లో ఉన్న బియ్యం, పప్పులూ బురదపాలయ్యాయి.
- యడ్లపల్లి నాంచారయ్య
జ్వరంతోనే పరుగు తీశా
ఆ రోజు రాత్రి జ్వరంతో ఇంంట్లో పడుకున్నా. వరద పోటెత్తుతోందని చెప్పడంతో తెల్లవారుజామున నేను, నా భర్త, పిల్లలం కలిసి పునరావాస కేంద్రానికి పరుగు తీశాం. ఇంట్లోని బియ్యం, దుస్తులు, నిత్యావసర వస్తువులు అన్నీ కోల్పోయాం. ఇంట్లో మోకాలి లోతు బురద ఉంది. మేము హోటల్‌లో పనిచేసి పొట్టపోసుకుంటాం. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
- దగ్గు సుమలత, వెంకటేశ్వరనగర్