NEET: తెలంగాణ విద్యార్థులకు ఊరట..
ABN , Publish Date - Sep 21 , 2024 | 04:31 AM
నీట్ కౌన్సెలింగ్ స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించినవారు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
హైకోర్టుకెళ్లినవారు కౌన్సెలింగ్‌కు హాజరవ్వొచ్చు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): నీట్ కౌన్సెలింగ్ స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించినవారు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కౌన్సెలింగ్‌కు సమయం తక్కువగా ఉండడంతో ఈ ఒక్కసారికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. వైద్య విద్య ప్రవేశాల కోసం తెచ్చిన జీవో 33లోని నిబంధన 3(ఎ)ను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కల్లూరి నాగ నరసింహా అభిరామ్, మరికొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాము తెలంగాణ స్థానికులమేనని, కేవలం ఒకట్రెండేళ్లు ఇతర రాష్ట్రాల్లో చదివినంత మాత్రాన ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు అనర్హులుగా ప్రకటించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత ఈ నెల 5న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం విద్యార్థులకు సానుకూలంగా తీర్పు వెలువరించింది. ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవీ రూపొందించలేదని అభిప్రాయ పడింది. తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల మేరకు ప్రతి విద్యార్థికి స్థానిక కోటా వర్తింపజేయాలని ఆదేశించింది. స్థానికతపై హైకోర్టు తీర్పును ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
మెడికల్ సీట్ల కేటాయింపునకు సంబంధించి నాలుగు రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అయినప్పటికీ మరోసారి కోర్టును ఆశ్రయించారని చెప్పారు. తొలుత నీట్ పరీక్షల్లో స్థానికతకు సంబంధించి ప్రతి విద్యార్థి స్థానికుడై ఉండాలని, 9, 10, 11 తరగతులు రాష్ట్రంలో చదివి ఉండాలని స్పష్టం చేశారు. తెలుగు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాల, కళాశాల, ఉన్నత చదువులు విదేశాల్లో పూర్తిచేసి నీట్ కు తెలంగాణలో హాజరయ్యారని వివరించారు. దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఏపీకి చెందిన విద్యార్థులు తెలంగాణలో నీట్ పరీక్ష రాసి అర్హత సాధిస్తున్నారని, కానీ ఏపీలో తెలంగాణ వారికి అవకాశం లేదని తెలిపారు. స్థానికతపై తెలంగాణ తీసుకువచ్చిన కొత్త జీవోను హైకోర్టు నిలిపివేసిందని వాదనలు వినిపించారు.
నీట్ ఫలితాలకు వారం ముందే జీవో
నీట్ పరీక్ష ఫలితాలకు కేవలం వారం రోజుల ముందే తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో తెచ్చిందని విద్యార్థుల తరపు న్యాయవాది మురళీధర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అందుకే.. జీవోను హైకోర్టు నిలిపివేసిందని తెలిపారు. ఈ క్రమంలో సింఘ్వీ కలుగజేసుకుని ఉమ్మడి ప్రాంతానికి సంబంధించిన 371(డి) పదేళ్ల వరకు ఉంటుందని, ఆ గడువు ముగియడంతో కొత్త నిబంధనను తెచ్చారని గుర్తు చేశారు. ఒకసారి మినహాయింపు కింద విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
సెప్టెంబరు చివరి వారంలో తొలి, అక్టోబరు మొదటి వారంలో రెండో కౌన్సెలింగ్ ఉన్నదని, విద్యార్థుల ప్రయోజనం కోరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 14న చేపడతామని స్పష్టం చేసింది.