Farmer Registration: ‘రైతుబీమా’లోకి కొత్త రైతులు..
ABN , Publish Date - Jul 21 , 2024 | 03:02 AM
రైతుబీమా పథకంలో కొత్త రైతుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొని, పథకంలో లేని వారి పేర్లను నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి శనివారం సర్క్యులర్ జారీచేశారు.
వివరాల నమోదుకు ఆగస్టు 5 గడువు
సంతకం చేసి, నామినీ పేరుతో ఏఈవోకివ్వాలి
ఆగస్టు పదో తేదీనాటికి ఎల్‌ఐసీకి జాబితా
వివరాల నమోదుకు ఆగస్టు 5 గడువు
ఆగస్టు పదో తేదీనాటికి ఎల్‌ఐసీకి జాబితా
కొత్తగా పట్టా బుక్కులు పొందిన రైతులు 3,22,582 మంది
సంతకం చేసి, నామినీ పేరుతో స్వయంగా ఏఈవోకు ఇవ్వాలి
ఆగస్టు 14తో ముగియనున్న 2023-24 పాలసీ గడువు
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రైతుబీమా పథకంలో కొత్త రైతుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొని, పథకంలో లేని వారి పేర్లను నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి శనివారం సర్క్యులర్ జారీచేశారు. 2024-25 ఫార్మర్ గ్రూప్ ఇన్సురెన్స్ స్కీమ్‌లో కొత్త రైతులను చేర్చటానికి ఆగస్టు ఐదో తేదీనాటికి గడువు విధించారు. అలాగే ఐదెకరాల విస్తీర్ణంలోపున్న పాత పట్టాదారులు, గతంలో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నప్పటికీ నమోదుచేసుకోని 5 ఎకరాలకు మించి ఉన్న పట్టాదారుల వివరాలను నమోదుచేయటానికి ఆగస్టు ఐదో తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించారు.
ఎల్‌ఐసీకి ఆగస్టు 10వ తేదీ నాటికి అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఫలితంగా ఆగస్టు ఐదో తేదీ నాటికి నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని డీఏవోలు, ఏడీఏలు, ఎంఏవోలు, ఏఈవోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. రైతుబీమా పథకం 2018-19లో ప్రారంభమైంది. రైతుల తరఫున ఎల్‌ఐసీకి రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోంది. పథకంలో 59 ఏళ్లలోపు వయసున్న రైతులకే అవకాశం కల్పించారు. రైతులు ఏ కారణంతో చనిపోయినా కూడా నామినీకి రూ.5 లక్షలు చెల్లించేలా పథకానికి రూపకల్పన చేశారు. 2018-19లో 31.25 లక్షలు, 2019-20లో 30.73 లక్షలు, 2020-21లో 32.73 లక్షలు, 2021-22లో 35.64 లక్షలు, 2022-23 లో రూ. 37.77 లక్షలు, 2023- 24 లో 41.03 లక్షల మంది రైతులు రైతుబీమా పథకంలో నమోదు చేసుకున్నారు. ఈ సారి(2024- 25) రాష్ట్రవ్యాప్తంగా 3,22,582 మంది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్నారు.
వీరిని జిల్లాల వారీగా రైతుబీమా పథకంలో నమోదు చేయించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ధరణి నుంచి వచ్చిన సమాచారంతోపాటు... రైతుల నుంచి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్, నామినీ ఆధార్ కార్డు జిరాక్సు కాపీలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పట్టాదారులు దరఖాస్తుపై సంతకం చేసి స్వయంగా ఏఈవోకు ఇవ్వాలని, నామినీని కూడా వారే సూచించాలని నిబంధన విధించారు. ఈ ధ్రువపత్రాలు ఏఈవోలకు ఇస్తే.. రైతుబీమా పోర్టల్‌లో నమోదుచేస్తారు. రైతుల వయస్సును ఆధార్ కార్డు ప్రకారమే లెక్కిస్తారు. 59 ఏళ్లు దాటిన రైతులను పథకం నుంచి తొలగిస్తారు.
2023-24కు సంబంధించి పాలసీ గడువు ఆగస్టు 14 తేదీన ముగుస్తుంది. ఆ వెంటనే కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. ఆమేరకు సర్కారు ప్రీమియం చెల్లిస్తుంది. గత ఆరేళ్లలో రైతుబీమాలో నమోదుచేసుకొని, ఎల్‌ఐసీ ఐడీ నంబరు కలిగి ఉన్న రైతుల వివరాల సేకరణను మాత్రం ఈనెల 30 తేదీ నాటికి పూర్తిచేయాలని ఏఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా 2023-24 సంవత్సరానికి ఒక్కో రైతు పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం రూ.3,600 చొప్పున ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లించింది. ఈసారి ఫార్మర్ గ్రూప్ లైఫ్ ఇన్సురెన్స్‌లో నమోదుచేసే రైతుల సంఖ్య సుమారు 45 లక్షలకు దగ్గరగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.