Share News

Congress: మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు పార్టీ పగ్గాలు..

ABN , Publish Date - Sep 07 , 2024 | 03:00 AM

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్ష నియామకంపై ఊహాగానాలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎట్టకేలకు తెరదించింది. అందరూ ఊహించినట్లుగానే బీసీ నేతకే పట్టం కట్టింది.

Congress: మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు పార్టీ పగ్గాలు..

  • తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియామకం

  • బీసీ నేతకు పట్టం కట్టిన పార్టీ అధిష్ఠానం

  • డీఎస్‌ తర్వాత నిజామాబాద్‌ జిల్లా నుంచి రెండో వ్యక్తి

  • ఎన్‌ఎస్‌యూఐ నుంచి మహేశ్‌కుమార్‌ ప్రస్థానం

  • పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కీలక స్థాయికి చేరిక

  • పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషిచేస్తా: మహేశ్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/నిజామాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్ష నియామకంపై ఊహాగానాలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎట్టకేలకు తెరదించింది. అందరూ ఊహించినట్లుగానే బీసీ నేతకే పట్టం కట్టింది. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నిర్ణయం తీసుకున్నారని, ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు.


ఇంతకాలం పీసీసీ అధ్యక్షుడిగాముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందించిన సేవలను పార్టీ ప్రశంసిస్తోందని ఆయన పేర్కొన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో గౌడ సామాజికవర్గం నుంచి ఎంపికైన తొలి పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ నిలిచారు. అలాగే టీపీసీసీకి నాలుగో అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్‌.. మూడేళ్లుగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్‌రెడ్డి పదవీకాలం పూర్తయిన దగ్గర్నుంచి నూతన అధ్యక్ష నియామకంపై అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పదవి ఉన్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు కేటాయించాలంటూ ఆ వర్గానికి చెందిన పలువురు నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ నేతలూ తమ సామాజిక వర్గాలకు కేటాయించాలని హైకమాండ్‌ను అడిగారు.


  • అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వచ్చినా..

రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యులతో అధిష్ఠానం ప్రాథమికంగా చర్చించినప్పుడు.. బీసీ వర్గం నుంచి మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీగౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎస్టీల నుంచి మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్‌, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్లు ప్రతిపాదనలోకి వచ్చాయి. అధిష్ఠానంతో పలుమార్లు భేటీ అయిన సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌.. ఓవైపు సామాజికవర్గాల వారీగా ప్రతిపాదిత పేర్లపై చర్చిస్తూనే.. మరో వైపు ఏ సామాజిక వర్గం నుంచి నూతన చీఫ్‌ను ఎంపిక చేయాలన్నదానిపై చర్చలు జరిపారు.


ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ మాదిగకు ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చ నడిచినా.. ప్రస్తుత పరిస్థితుల్లో వివాదాలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో దానిని పక్కన పెట్టారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీలే అయినందున.. ఈ వర్గం నుంచే ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం అధిష్ఠానం పెద్దలు వ్యక్తం చేశారు. అయితే ఎస్టీలకు టీపీసీసీ చీఫ్‌ పోస్టు ఇస్తే.. దేశ వ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుందన్న అభిప్రాయాన్ని సీఎం రేవంత్‌ అధిష్ఠానం ముందు వెలిబుచ్చినట్లు సమాచారం. ఎంపీ బలరాంనాయక్‌ పేరును ఆయన సూచించినట్లు తెలిసింది. బీసీల్లోనైతే ఎవరికి ఇచ్చినా పరస్పరం సహకరించుకుంటామన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం.


  • అధిష్ఠానం మార్కు నిర్ణయం..

సంప్రదాయకంగా సీఎం రేవంత్‌ సహా పార్టీ ముఖ్య నాయకులందరి అభిప్రాయాలనూ తీసుకున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం.. తాను అనుకున్నట్లుగా బీసీలకే టీపీసీసీ చీఫ్‌ పోస్టు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రతిపాదిత పేర్లపై సమీక్ష చేసి మహేశ్‌కుమార్‌గౌడ్‌, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌లలో ఒకరిని నియమించాలనుకుంది. దీనిపై రాష్ట్రంలో ఫ్లాష్‌ సర్వేలు నిర్వహించి.. మహేశ్‌కుమార్‌గౌడ్‌ నియామకానికే ఓటేసింది. మొత్తమ్మీద అధ్యక్ష నియామకంలో తన ముద్రను బలంగా చూపించింది. విద్యార్థి దశనుంచీ కాంగ్రెస్‌ రాజకీయాల్లోనే ఉండడం, ఎన్‌ఎ్‌సయూఐ నుంచి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వరకు పని చేసిన అనుభవం ఉండడం.. ముఖ్యంగా గత మూడేళ్లుగా పార్టీ సంస్థాగత వ్యవహారాలను చక్కబెడుతుండడాన్ని పరిగణనలోకి తీసుక్ను అధిష్ఠానం.. మహేశ్‌కుమార్‌గౌడ్‌ను టీపీసీసీకి కొత్త చీఫ్‌గా నియమించింది.


  • దత్తాత్రేయుని సన్నిధిలో ఉండగా..

కర్ణాటకలోని గానుగాపురం దత్తాత్రేయుని సన్నిధిలో మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఉండగా.. అధిష్ఠానం పెద్దలు ఆయనకు ఫోన్‌ చేసి టీపీసీసీ చీఫ్‌గా నియమితులైనట్లు తీపి కబురు చెప్పారు. ఆ ఉత్సాహంలో దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న మహేశ్‌కుమార్‌గౌడ్‌.. అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శనివారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. సీఎంతో భేటీలో.. బాధ్యతల స్వీకరణ ముహూర్తం ఎప్పుడన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


  • అధిష్ఠానానికి ధన్యవాదాలు: మహేశ్‌

తనపై అత్యంత నమ్మకముంచి కీలకమైన టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన అధిష్ఠానానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు,.. పార్టీ కోసం అనునిత్యం పాటుపడుతున్న నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నానన్నారు. పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతను చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేసి.. పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు. నిరంతరం నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తానని, రాష్ట్రాభివృద్ధికి, పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు.


  • కార్యవర్గం కూర్పుపైనా కసరత్తు..

టీపీసీసీకి కొత్త చీఫ్‌ను ప్రకటించిన అధిష్ఠానం.. కార్యవర్గం కూర్పుపైనా కసరత్తు చేసింది. టీపీసీసీకి నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ప్రచార.. ఇతర కమిటీల చైర్మన్ల నియామకంపైనా కసరత్తు జరిగినట్లు చెబుతున్నారు. నాలుగు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవులను రెడ్డి, మైనారిటీ, ఎస్సీ మాదిగ, ఎస్టీ లంబాడాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు వినిపిస్తోంది. టీపీసీసీ చీఫ్‌ పదవికి చివరి వరకూ పోటీలో ఉన్న మధుయాష్కీగౌడ్‌కు ఏఐసీసీలోగానీ, రాష్ట్రంలోగానీ కీలక పదవి ఇచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.


  • ఇక.. కళకళలాడనున్న గాంధీభవన్‌!

టీపీసీసీ అధ్యక్షుడిగానూ సీఎం రేవంత్‌రెడ్డే ఉన్న నేపథ్యంలో.. పార్టీ కార్యక్రమాల కోసం ఆయన వచ్చిన వచ్చినప్పుడే గాంధీభవన్‌.. నేతలతో కళకళలాడుతున్న పరిస్థితి ఇప్పటి వరకూ ఉంది. అధ్యక్ష బాధ్యతలను మహేశ్‌కుమార్‌గౌడ్‌ స్వీకరించిన తర్వాత.. ఆయన నిత్యం గాంధీభవన్‌లో అందుబాటులో ఉండనున్నారు. దీంతో ఇక మీదట గాంధీభవన్‌ నిత్యం నేతలతో కళకళలాడనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


  • నిజామాబాద్‌ నుంచి డీఎస్‌ తర్వాత రెండో వ్యక్తి..

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా డి.శ్రీనివాస్‌ తర్వాత నిజామాబాద్‌ జిల్లా నుంచి మళ్లీ బొమ్మ మహే్‌షకుమార్‌గౌడ్‌కే అవకాశం దక్కింది. ఉమ్మడి రాష్ట్ర హయాంలో పీసీసీ అధ్యక్షుడిగా రెండు దఫాలు డి.శ్రీనివాస్‌ పనిచేశారు. ఉమ్మడి రాష్ట్ర హయాంలో జిల్లా నుంచి డీఎ్‌సకు అవకాశం దక్కగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహే్‌షకుమార్‌గౌడ్‌కే దక్కింది. ఇద్దరు కూడా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన నేతలే. కాగా, టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమించడంతో జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. నిజామాబాద్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు.


  • ఎన్ఎస్‌యూఐ నుంచి పార్టీలోనే...

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం రహమత్‌నగర్‌కు చెందిన బొమ్మ మహే్‌షకుమార్‌గౌడ్‌ విద్యార్థి దశలో ఎన్‌ఎ్‌సయూఐలో చేరారు. అప్పటినుంచి కాంగ్రె్‌సలోనే కొనసాగారు. ఉమ్మడి రాష్ట్ర హయాంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సామాజిక సమీకరణాల వల్ల అవకాశం రాకున్నా.. వివిధ హోదాల్లో పార్టీలో పనిచేశారు. నిజామాబాద్‌ జిల్లా ఎన్‌ఎ్‌సయూఐ అధ్యక్షుడిగా 1986 నుంచి 1990 వరకు పనిచేశారు. ఆ తర్వాత 1990లో ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై 1998 వరకు పనిచేశారు. అనంతరం యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శిగా 1998 నుంచి 2000 వరకు పనిచేశారు.


ఆ తర్వాత కాంగ్రెస్‌లో ఆయన సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. మొదట పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా 2000 నుంచి 2003 వరకు పనిచేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా 2012 నుంచి 2016 వరకు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా 2016 నుంచి 2021 వరకు కొనసాగారు. 1994లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన 2014లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ పడ్డారు. తర్వాత మళ్లీ అవకాశం రాలేదు. ఉమ్మడి రాష్ట్ర హయాంలో 2013లో రాష్ట్ర వేర్‌ హౌజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులై ఆయన రెండేళ్ల పాటు కొనసాగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలువురు నేతలు పార్టీ మారినా ఆయన కాంగ్రె్‌సలోనే కొనసాగారు. పీసీసీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు 2021లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆయనను గత జనవరిలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.


మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రస్థానం...

పేరు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌

తండ్రి పేరు గంగాధర్‌గౌడ్‌

పుట్టిన తేదీ ఫిబ్రవరి 24, 1966

పుట్టిన ఊరు రహమత్‌నగర్‌(నిజామాబాద్‌)

విద్యార్హత బీకాం

భార్య పేరు సంధ్యారాణి

కుమారులు రిత్విక్‌, ప్రణవ్‌

Updated Date - Sep 07 , 2024 | 03:00 AM