Nigerian gangs: నైజీరియా టు రాజమండ్రి వయా హైదరాబాద్
ABN , Publish Date - Jul 19 , 2024 | 05:51 AM
నైజీరియా డ్రగ్స్ దందా ప్రధాన నగరాలకే కాకుండా.. చిన్న నగరాలకు కూడా విస్తరించిందని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్) పోలీసులు గుర్తించారు. ఇటీవల టీజీ న్యాబ్, సైబరాబాద్ పోలీసులు జరిపిన దాడుల్లో పట్టుబడ్డ నైజీరియన్ గ్యాంగ్‌కు సంబంధించి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రకాశం జిల్లాకు కూడా తరలింపు.. పక్కాగా నైజీరియన్ కలేషీ నెట్‌వర్క్
చేతులు మారే కొద్దీ పెరిగే కొకైన్ ధర
వెల్లడించిన పోలీసుల రిమాండ్ రిపోర్ట్
హైదరాబాద్ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): నైజీరియా డ్రగ్స్ దందా ప్రధాన నగరాలకే కాకుండా.. చిన్న నగరాలకు కూడా విస్తరించిందని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్) పోలీసులు గుర్తించారు. ఇటీవల టీజీ న్యాబ్, సైబరాబాద్ పోలీసులు జరిపిన దాడుల్లో పట్టుబడ్డ నైజీరియన్ గ్యాంగ్‌కు సంబంధించి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో హైదరాబాద్‌లో డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి.. ప్రస్తుతం నైజీరియాలో ఉంటున్న ప్రధాన నిందితుడు డివైన్ ఎబుకా సుజీ సముద్ర మార్గం ద్వారా కొకైన్‌ను భారత్‌కు పంపుతున్నాడని పేర్కొన్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరే కొకైన్.. హైదరాబాద్, గోవా, బెంగళూరు నగరాలకు సరఫరా అవుతుందని వివరించారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, ప్రకాశం జిల్లాలకు చేరుతుందని రిమాండ్ రిపోర్ట్‌లో సరఫరా చైన్ వివరాలను పూసగుచ్చినట్లు వెల్లడించారు. ‘‘హైదరాబాద్ నెట్‌వర్క్‌ను ఎజియోనిలి ఫ్రాంక్లిన్ ఉచెన్నా అలియాస్ కలేషీ నిర్వహిస్తున్నాడు.
బెంగళూరుకు చెందిన హెయిర్ స్టైలిస్ట్ యువతి ఒనుహ బ్లెస్సింగ్ అలియాస్ జోయానాగోమ్స్ ఈ సరఫరా చైన్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె ఢిల్లీ నుంచి కొకైన్‌ను రైలు, విమానాల్లో హైదరాబాద్‌కు తరలిస్తోంది. కలేషీ దాన్ని డ్రగ్స్ పెడ్లర్లు ఆయిజ్ మహీమ్ అదెషోలా(నైజీరియా దేశస్థుడు), బెంగళూరుకు చెందిన అల్లం సత్య వెంకట గౌతమ్, బోరబండకు చెందిన సన్నబోయిన వరుణ్‌కుమార్, బండ్లగూడ జాగీర్‌కు చెందిన మహమ్మద్ మహబూబ్ షరీ్‌ఫకు అందజేస్తున్నాడు’’ అని టీజీ న్యాబ్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. గౌతమ్ ఏకంగా రాజమండ్రి, ప్రకాశం జిల్లాలకు డ్రగ్స్ నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు తెలిపారు. గురువారం అన్ని రాష్ట్రాల సీఎ్‌సలు, డీజీపీలు, హోంశాఖ ముఖ్య కార్యదర్శులతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా డ్రగ్స్‌పై సమాచార మార్పిడిపై పరస్పర సహకారం అందించుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీజీ న్యాబ్ పోలీసులు రాజమండ్రి, ప్రకాశం జిల్లాల్లో డ్రగ్స్ దందాపై సమాచారాన్ని ఏపీ పోలీసులతో పంచుకోనున్నట్లు తెలిసింది.
కస్టమర్లకు సరఫరా చేసింది వీరే..!
నైజీరియా గ్యాంగ్‌పై దాడి సందర్భంగా పోలీసులు 13 మంది డ్రగ్స్ వినియోగదారులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే..! వీరిలో నటి రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్‌సింగ్ కూడా ఉన్నారు. గౌతమ్, వరుణ్, షరీఫ్ ద్వారానే ఈ 13 మందికి కొకైన్ చేరినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 10 మంది డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలగా.. అమన్ ప్రీత్‌సింగ్, ప్రసాద్ అభయ్ మనాజ్కర్, నిఖిల్ ధావన్, చింతలపాటి మధుసూదన్‌కు నోటీసులు ఇచ్చారు. నైజీరియన్ డ్రగ్స్ స్మగ్లర్ల నుంచి పెడ్లర్లు.. వినియోగదారుల వరకు కొకైన్ చేతులు మారిన కొద్దీ దాని ధర రెండింతలు.. మూడింతలు.. నాలుగింతలు పెరుగుతూ ఉంటోందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వివరించారు.