Share News

High Court: జగన్‌ అక్రమాస్తుల కేసులో.. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చుక్కెదురు

ABN , Publish Date - Jul 09 , 2024 | 04:35 AM

జగన్‌ అక్రమాస్తులకు సంబంధించిన వాన్‌పిక్‌ కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలని పేర్కొంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టేసింది.

High Court: జగన్‌ అక్రమాస్తుల కేసులో..  నిమ్మగడ్డ ప్రసాద్‌కు చుక్కెదురు

  • క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): జగన్‌ అక్రమాస్తులకు సంబంధించిన వాన్‌పిక్‌ కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలని పేర్కొంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ప్రకాశం-గుంటూరు జిల్లాల మధ్య ‘వాడరేవు నిజాంపట్నం పోర్ట్‌ అండ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ (వాన్‌పిక్‌) ఏర్పాటుకు రాస్‌-అల్‌-ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (రాకియా)ను ముందుపెట్టి 2008లో ర్యాక్‌, ఉమ్మడి ఏపీ మధ్య ఎంవోయూ జరిగేలా నిమ్మగడ్డ ప్రసాద్‌ చేశారని.. ఈ ప్రాజెక్టు అమలుకు వాన్‌పిక్‌ పోర్ట్స్‌ను స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ)గా ఏర్పాటు చేసి అప్పటి కేబినెట్‌ను తప్పుదోవ పట్టించడం ద్వారా 28 వేల ఎకరాలు దక్కించుకునేలా రాయితీ ఒప్పందం రూపొందించారని సీబీఐ కేసు నమోదు చేసింది.


జగన్‌ అందించిన సహాయ సహకారాలకు లంచంగా నిమ్మగడ్డ ఆయన కంపెనీలకు రూ.850 కోట్లు మళ్లించారని.. వాటిని పెట్టుబడులుగా చిత్రీకరించారని.. ఇదంతా క్విడ్‌ ప్రొ కోలో భాగమని చార్జిషీట్‌లో పేర్కొంది. సీబీఐ కేసును కొట్టేయాలని నిమ్మగడ్డ 2021లో హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ‘జగన్‌ కంపెనీల్లో పిటిషనర్‌ అయిన నిమ్మగడ్డ ప్రసాద్‌ పెట్టిన పెట్టుబడులు క్విడ్‌ ప్రొ కోలో భాగమా.. కాదా? దానిని లంచంగా భావించాలా అనే అంశాలు విచారణలోనే తేలాల్సి ఉంటుంది. వైఎస్‌ జగన్‌కు సంబంధించిన పలు కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్‌ లంచాలను పెట్టుబడుల రూపంలో పెట్టారని చార్జిషీట్‌ వెల్లడిస్తోంది. దురుద్దేశంతో క్రిమినల్‌ కేసు పెట్టారన్న పిటిషనర్‌ ఆరోపణలను మేం ఆమోదించడం లేదు. ప్రస్తుత కేసులో నిమ్మగడ్డ పాత్రపై చాలా స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ తప్పులకు తాను బాధ్యుడిని కాదని పిటిషనర్‌ తప్పించుకోలేరు. నిమ్మగడ్డ పిటిషన్‌ను కొట్టేస్తున్నాం’ అని తన తీర్పులో పేర్కొంది.

Updated Date - Jul 09 , 2024 | 04:35 AM