Share News

Transfer Policy: వైద్యశాఖ బదిలీల్లో గందరగోళం..

ABN , Publish Date - Jul 20 , 2024 | 05:14 AM

వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ల బదిలీల కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో శుక్రవారం గందరగోళ పరిస్థితి నెలకొంది. బదిలీల ప్రక్రియలో లోపాలున్నాయని, తమకు అన్యాయం జరుగుతోందంటూ నర్సింగ్‌ ఆఫీసర్స్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను అడ్డుకోవడమేకాకుండా ఆందోళనకు దిగారు.

Transfer Policy: వైద్యశాఖ బదిలీల్లో గందరగోళం..

  • కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న స్టాఫ్‌నర్స్‌లు.. రోడ్డుపైకి వచ్చి ఆందోళన

  • బదిలీలు ఆపించుకునేందుకు జాబితాలో పేర్లు మాయం

  • కౌన్సెలింగ్‌ వాయిదాతో రాత్రి స్టాఫ్‌ నర్సుల ఆందోళన

  • జాబితా ఆన్‌లైన్‌లో ఉంచుతామన్న హామీతో నిరసన విరమణ

హైదరాబాద్‌, అఫ్జల్‌గంజ్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ల బదిలీల కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో శుక్రవారం గందరగోళ పరిస్థితి నెలకొంది. బదిలీల ప్రక్రియలో లోపాలున్నాయని, తమకు అన్యాయం జరుగుతోందంటూ నర్సింగ్‌ ఆఫీసర్స్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను అడ్డుకోవడమేకాకుండా ఆందోళనకు దిగారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని స్టాఫ్‌నర్స్‌కు శుక్రవారం కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. అయితే బదిలీ అయ్యేవారి జాబితా తప్పులుతడకగా ఉందని.. కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకాగానే జాబితాలో 250వ పేరును తొలుత ఎలా పిలుస్తారంటూ మిగతా నర్సులంతా అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియారిటీ జాబితా అంతా అస్తవ్యస్తంగా ఉందని వారు ఆరోపించారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియను అడ్డుకున్నారు. తర్వాత ఆడిటోరియం బయటకు వెళ్లి ఆందోళనకు దిగారు.


సీనియారిటీ జాబితాలో రాత్రికి రాత్రే కొందరు నర్సుల పేర్లు మాయమయ్యాయని చెబుతున్నారు. కచ్చితంగా బదిలీ కావాల్సిన వారి పేర్లు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్టాఫ్‌నర్స్‌లు ఓ దశలో ప్రజారోగ్య సంచాలకుడు రవీంద్రనాయక్‌ను ఘెరావ్‌ చేశారు. కాగా బదిలీల కౌన్సెలింగ్‌ను అధికారులు వాయిదా వేయడంతో స్టాఫ్‌ నర్సులు ఆందోళన చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మెడికల్‌ కళాశాల నుంచి కోఠిలోని డీపీహెచ్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బదిలీల జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.


ఈ సందర్భంగా పలువురు నర్సులు మాట్లాడుతూ.. పలు సంఘాల నేతలు మితిమీరిన జోక్యంతో బదిలీలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో భారీగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నిరసన వ్యక్తం చేసిన నర్సులు శుక్రవారం రాత్రి మరోసారి ఆందోళనకు దిగారు. బదిలీల జాబితా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని హెల్త్‌ డైరెక్టర్‌ హామీ ఇవ్వడంతో రాత్రి 10.30 గంటల సమయంలో ఆందోళన విరమించారు. అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులో కొందరు నేతలు అరాచకం సృష్టించారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన ఉద్యోగులు కొందరు వీరి తీరును ప్రశ్నించే ప్రయత్నం చేయగా... ఒకరిద్దరిపై చేయి చేసుకున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


పలువురు డీఎంహెచ్‌వోల బదిలీలు

సుదీర్ఘకాలంగా ఒకేచోట సివిల్‌ సర్జన్స్‌గా పనిచేస్తున్న వారినీ వైద్యశాఖ బదిలీ చేసింది. ఈ జాబితాలో పది మంది ఉండగా.. అందులో కొందరు డీఎంహెచ్‌వోలు, ఆర్‌ఎంవోలున్నారు.

Updated Date - Jul 20 , 2024 | 05:14 AM