Sangareddy: పాఠ్యపుస్తకాల పంపిణీలో గందరగోళం..
ABN , Publish Date - Jun 13 , 2024 | 03:29 AM
పాఠశాలల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాల పంపిణీలో పలుచోట్ల గందరగోళం చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాల్లోని ‘ముందుమాట’లో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లు ఉండటమే ఇందుకు కారణం..
‘ముందుమాట’లో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, అధికారుల పేర్లు
విద్యాశాఖ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీహరి ఆగ్రహం
పలుచోట్ల ఆ పేజీ తొలగించి పంపిణీ.. ‘బడిబాట’లో పాల్గొన్న మంత్రులు
సంగారెడ్డిఅర్బన్/వైరా/అమరచింత/రాయికోడ్/ఖమ్మం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పాఠశాలల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాల పంపిణీలో పలుచోట్ల గందరగోళం చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాల్లోని ‘ముందుమాట’లో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లు ఉండటమే ఇందుకు కారణం.. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా అమరచింత జెడ్పీహెచ్‌ఎ్‌సలో పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా తరగతుల తెలుగు పుస్తకాలను పరిశీలించగా.. ముందుమాటలో ‘పాఠ్య పుస్తకాల రూపకల్పన కోసం ఎప్పటికప్పుడు సలహాలు సూచనలిచ్చి ప్రోత్సహించిన తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పూర్వపు విద్యాశాఖ మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొని ఉండటం గమనించిన ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎంఈవో భాస్కర్ సింగ్, ప్రధానోపాధ్యాయుడిని పిలిచి ఈ అంశంపై నిలదీశారు. ప్రభుత్వం మారినా పాత వారి పేర్లను ఎలా ముద్రిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ప్రశ్నించారు. పలుచోట్ల ఇదే విషయాన్ని చివరి నిమిషంలో గుర్తించిన కొందరు అధికారులు ఆ పేజీని తొలగించిన అనంతరం పుస్తకాలు అందజేశారు. 2022లో ఆ పుస్తకాలు ముద్రించినవని వివరణ ఇచ్చారు. సంగారెడ్డి, జనగామ జిల్లాల విద్యా శాఖాధికారులు కూడా ఇదే విషయమై ఆ పేజీ తొలగించి పుస్తకాలు పంపిణీ చేయాలంటూ ఆదేశించారు.
పలు జిల్లాల్లో పాల్గొన్న మంత్రులు
పలు జిల్లాల్లో మంత్రులు బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఖమ్మంలోని ఎన్‌ఎ్‌సపీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో పెనుమార్పు తెచ్చేందుకే తెలంగాణ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ పేరుతో పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు. ఇటు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎ్‌సలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఒక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.