Share News

Peddapalli: ఏసీబీ వలలో కాల్వశ్రీరాంపూర్‌ తహసీల్దార్‌

ABN , Publish Date - Aug 04 , 2024 | 05:14 AM

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ తహసీల్దార్‌ జాహెద్‌పాషా శనివారం ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాల ప్రకారం.. ఓదెల మండలం చిన్నకొమిరె గ్రామానికి చెందిన కడెం తిరుపతికి కాల్వశ్రీరాంపూర్‌ మండలం పందిళ్ల గ్రామ శివారులో 28 గుంటల భూమి ఉంది.

Peddapalli: ఏసీబీ వలలో కాల్వశ్రీరాంపూర్‌ తహసీల్దార్‌

కాల్వశ్రీరాంపూర్‌, ఆగస్టు 3: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ తహసీల్దార్‌ జాహెద్‌పాషా శనివారం ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాల ప్రకారం.. ఓదెల మండలం చిన్నకొమిరె గ్రామానికి చెందిన కడెం తిరుపతికి కాల్వశ్రీరాంపూర్‌ మండలం పందిళ్ల గ్రామ శివారులో 28 గుంటల భూమి ఉంది. అయితే బ్యాంకు రుణం కోసం పహాణి నకల్‌ అవసరం ఉండటంతో అందుకు రూ.10 వేలు ఇవ్వాలని తహసీల్దార్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో తిరుపతి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.


ఈ క్రమంలో శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో తిరుపతి నుంచి తాత్కాలిక ఉద్యోగి దాసరి ధర్మేందర్‌, తహసీల్దార్‌ డ్రైవర్‌ అమ్జద్‌పాషా రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. తిరుపతి తండ్రి పేరు మీద ఉన్న భూమిని విరాసత్‌ చేసేందుకు ధర్మేందర్‌, అమ్జద్‌ పాషాల ద్వారా రూ.50వేల లంచం తీసుకున్న తహసీల్దార్‌ గత నెల 23న మ్యుటేషన్‌ చేసినట్టు తెలిపారు.


అయితే బ్యాంకు రుణం కోసం డాక్యుమెంట్లు, పహాణి నకలు మాన్యువల్‌గా ఇవ్వాల్సి ఉన్నందున తహసీల్దార్‌ లంచం డిమాండ్‌ చేశాడన్నారు. ఈ క్రమంలో తహసీల్దార్‌ అడిగిన మొత్తం తిరుపతి నుంచి ధర్మేందర్‌, అమ్జద్‌పాషా తీసుకుంటుండగా పట్టుకున్నామని, వారిద్దరి వాంగ్మూలం మేరకు తహసీల్దార్‌ను అరెస్టు చేశామని తెలిపారు. వీరిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు చెప్పారు.

Updated Date - Aug 04 , 2024 | 05:14 AM