Share News

Rangareddy: వాట్సాప్‌ గ్రూపు నుంచి తొలగించారని.. ఇద్దరు యువకుల హత్య

ABN , Publish Date - Jun 07 , 2024 | 03:42 AM

వాట్సాప్‌ గ్రూప్‌లో తన పుట్టినరోజు వేడుకల ఫొటోలతో పాటు గ్రూప్‌ నుంచి తనను తొలగించడంతో కోపంతో రగిలిపోయిన ఓ వ్యక్తి అతని స్నేహితుడితో కలిసి ఇద్దరు యువకులను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశాడు.

Rangareddy: వాట్సాప్‌ గ్రూపు నుంచి తొలగించారని.. ఇద్దరు యువకుల హత్య

  • మాట్లాడేందుకు విల్లాకు పిలిచి కత్తులతో పొడిచి చంపారు

  • రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో ఘోరం నిందితుడు స్థానిక బీజేపీ నాయకుడు

  • పోలీసుల అదుపులో నిందితులు

  • బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన

కడ్తాల్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): వాట్సాప్‌ గ్రూప్‌లో తన పుట్టినరోజు వేడుకల ఫొటోలతో పాటు గ్రూప్‌ నుంచి తనను తొలగించడంతో కోపంతో రగిలిపోయిన ఓ వ్యక్తి అతని స్నేహితుడితో కలిసి ఇద్దరు యువకులను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండల కేంద్రం సమీపంలోని ఫార్చ్యూన్‌ బట్టర్‌ఫ్లై సిటీలో గురువారం ఈ ఘోరం చోటుచేసుకుంది. నిందితులు ఇద్దరూ పోలీసులకు లొంగిపోగా మరో ఐదుగుర్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రధాన నిందితుడు స్థానిక బీజేపీ నాయకుడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కడ్తాల్‌ మండల కేంద్రం సమీపంలోని ఫార్చ్యూన్‌ బట్టర్‌ఫ్లై సిటీలోని ఓ విల్లాను గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు జల్కం రవి ఇటీవల అద్దెకు తీసుకొన్నాడు. రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు అందులో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు.


ఈ నెల 4న సాయంత్రం రవి తన పుట్టినరోజు వేడుకలను పలువురు బీజేపీ నాయకులు, స్నేహితులతో కలిసి జరుపుకున్నాడు. ఆ ఫొటోలను గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేశాడు. పెద్దఎత్తున ఫొటోలను పోస్టు చేయడంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. గ్రూప్‌ అడ్మిన్‌గా ఉన్న గ్రామానికి చెందిన శేషగారి శివగౌడ్‌ వాట్సాప్‌ నుంచి రవి ఫొటోలతో పాటు గ్రూప్‌ నుంచి అతడిని తొలగించాడు. ఆ తర్వాత గుండమోని శివగౌడ్‌ కూడా అడ్మిన్‌గా ఉండడంతో రవిని మళ్లీ గ్రూప్‌లో చేర్చాడు. ఈ నేపథ్యంలో రవి బుధవారం సాయంత్రం ఇద్దరు శివగౌడ్‌లను తన ఆఫీసుకు పిలిపించుకున్నట్లు సమాచారం. రవితో సన్నిహితంగా ఉండే వారిద్దరూ ఆఫీసుకు వెళ్లారు. అప్పటికే అక్కడ రవితో అతని స్నేహితుడు జంగారెడ్డిపల్లికి చెందిన ఆమనగల్లు పట్టణ బీజేవైఎం నాయకుడు పల్లె రాజుగౌడ్‌ ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత నలుగురూ కలిసి మద్యం తాగుతున్న తరుణంలో రవి వాట్సాప్‌ గ్రూపుల్లో తన ఫొటోలు ఎందుకు డిలీట్‌ చేశావని శేషగారి శివగౌడ్‌ను ప్రశ్నించాడు.


వారి మధ్య మాటామాటా పెరిగిన క్రమంలో రవి, రాజు గౌడ్‌ కత్తులతో దాడి చేసి గుండమోని శివగౌడ్‌ (25) శేషగారి శివగౌడ్‌ (27)లను హత్య చేశారు. ఆ తర్వాత విల్లాకు తాళం వేసి వెళ్లిపోయిన రవి, రాజుగౌడ్‌లు గురువారం ఉదయం పోలీసులకు, స్థానికులకు జంటహత్యల గురించి సమాచారం ఇచ్చి లొంగిపోయారు. పోలీసులు ఆ విల్లా వద్దకు వెళ్లి.. తాళం వేసి ఉండటంతో పైభాగం నుంచి చూసి ఇద్దరు హత్యకు గురైనట్లు గుర్తించారు. క్లూస్‌టీం సమక్షంలో తాళాలు పగలగొట్టి సాక్ష్యాధారాలు సేకరించారు. ఇద్దరు యువకుల మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శేషగారి శివగౌడ్‌ హైదరాబాద్‌లో డ్రైవర్‌గా, గుండమోని శివగౌడ్‌ హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని చికెన్‌ సెంటర్‌లో పనిచేస్తున్నారు. జంట హత్యలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ వివాదాలు, వ్యక్తిగత కక్షలు కూడా హత్యకు కారణంగా పలువురు అనుమానిస్తున్నారు.


హంతకులను కఠినంగా శిక్షించాలి

హతుల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు కడ్తాల్‌లో ఆందోళనకు దిగారు. పోలీసు స్టేషన్‌ ఎదుట హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించి హంతకులను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని రాస్తారోకో చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని విచారణ జరుపుతున్నామని, బాధితులకు న్యాయం చేస్తామని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు. అయితే సాయంత్రం వందల మంది మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కడ్తాల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని వారితో, పోలీసులతో మాట్లాడారు. హత్యలకు గల కారణాలు తెలుసుకున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 03:42 AM