Share News

Hyderabad: పోటాపోటీగా ‘సెప్టెంబరు 17’!

ABN , Publish Date - Sep 16 , 2024 | 02:53 AM

హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమైన ‘సెప్టెంబరు 17’ వేడుకల అంశం మరోసారి రాజకీయ పార్టీల మధ్య వివాదాన్ని రగిలించింది.

Hyderabad: పోటాపోటీగా ‘సెప్టెంబరు 17’!

  • పబ్లిక్‌ గార్డెన్స్‌లో ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’

  • రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ

  • అమిత్‌షా సహా నలుగురు కేంద్ర మంత్రులకు ఆహ్వానం

  • పరేడ్‌ గ్రౌండ్‌లో ‘తెలంగాణ విమోచన దినోత్సవం’

  • కేంద్ర సర్కారు వేడుకలు.. సీఎం రేవంత్‌కు పిలుపు

  • పేరు మార్పు సబబు కాదు.. నేను రాలేను: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమైన ‘సెప్టెంబరు 17’ వేడుకల అంశం మరోసారి రాజకీయ పార్టీల మధ్య వివాదాన్ని రగిలించింది. ఇప్పటికే ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ఈ వేడుకలు నిర్వహిస్తుండగా.. తాజాగా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనికి ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’గా పేరు పెట్టడంతోపాటు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించింది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా నిర్వహిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. దీంతో కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీగా చేపట్టిన ఈ కార్యక్రమాలు చర్చనీయాంశంగా మారాయి.


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తొలిసారి సెప్టెంబరు 17 కార్యక్రమం జరుగుతుండడంతో రేవంత్‌ సర్కారు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకలకు హాజరు కావాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తోపాటు రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు వారికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా లేఖలు రాశారు.


ఇదిలా ఉండగా.. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో సంవత్సరం కూడా పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా వేడుకలకు సిద్ధమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి విస్మరిస్తే.. తెలంగాణ సమాజం ఆయనను క్షమించదన్నారు.


  • పేరు మార్పు సబబు కాదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 17ను అత్యంత ప్రాధాన్యం కలిగిన రోజుగా గుర్తించి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోవడం సంతోషకరమంటూనే.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తున్న పేరును మార్చడం సబబు కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు. ‘‘ప్రతిపాదిత ‘ప్రజాపాలన దినోత్సవాని’కి ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. కానీ, నిజాం నవాబు ప్రైవేటు సైన్యమైన రజాకార్ల కిరాతక పాలన నుంచి హైదరాబాద్‌ సంస్థానం స్వాతంత్య్రం పొందేందుకు.. ఏళ్ల తరబడి పోరాడిన విధానం, రజాకార్ల హింసకు వేలమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి.. ఈ గడ్డపై పుట్టిన బిడ్డగా మీకు తెలుసు.


వారందరి వీరోచిత పోరాటం, త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రస్తుత తరానికి మన పెద్దల ధైర్య సాహసాలను తెలియజేసి జాతీయ భావన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంతటి స్ఫూర్తిదాయకమైన రోజు, వేలాది మంది త్యాగాల ఫలితమైన విమోచన దినోత్సవానికి పేరు మార్చడం.. వాస్తవ చరిత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చడమేనని అర్థమవుతోంది. ఇది సంతుష్టీకరణ రాజకీయాలను ప్రోత్సహించినట్లవుతుంది’’ అని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఘనమైన తెలంగాణ చరిత్రను ప్రజల స్మృతిపథం నుంచి తుడిచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో తాను భాగస్వామిని కాలేనని తెలిపారు.


సమీప భవిష్యత్తులోనైనా వాస్తవాలను అర్థం చేసుకుని.. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచనం దినోత్సవంగా గుర్తిస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఒవైసీ సోదరులకు భయపడే కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించిందన్నారు ప్రజాపాలన దినోత్సవం పేరుతో కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబరు 17ను నిర్వహించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.

Updated Date - Sep 16 , 2024 | 02:53 AM