Share News

MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 73% ఓటింగ్‌..

ABN , Publish Date - May 28 , 2024 | 05:22 AM

నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ సోమవారం ముగిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌లో మూడు జిల్లాల పరిధిలోని ఓటర్లలో 73 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు సమాచారం.

MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 73% ఓటింగ్‌..

  • ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

  • నల్లగొండ స్ట్రాంగ్‌ రూంకు బ్యాలెట్‌ బాక్సులు

  • రెండు చోట్ల దొంగ ఓట్ల నమోదు

  • టెండర్‌ ఓటు వేసిన అసలు ఓటర్లు

  • పట్టభద్రులకూ డబ్బులతో పార్టీల ప్రలోభం!

  • మూడు ప్రధాన పార్టీలూ పంచినట్లు ప్రచారం

  • నార్కట్‌పల్లిలో స్వతంత్ర అభ్యర్థి అశోక్‌పై దాడి

  • పోలీసు స్టేషన్‌లో బైఠాయించి నిరసన ఖమ్మం జిల్లాలో ఓటు వేసేందుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ సోమవారం ముగిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌లో మూడు జిల్లాల పరిధిలోని ఓటర్లలో 73 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. సాయంత్రం 4 గంటల్లోపు క్యూలైన్లలో నిల్చున్న వారికి సమయం ముగిసినా అవకాశం కల్పించడంతో.. 30కిపైగా పోలింగ్‌ స్టేషన్లలో రాత్రి 9గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. కాగా, పోలింగ్‌ ముగిసే సమయానికి అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54 శాతం, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54 శాతం నమోదైందని ఉప ఎన్నిక రిటర్నింగ్‌ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని, జూన్‌ 5న ఓట్ల లెక్కింపు చేపడతామని పేర్కొన్నారు. సోమవారం రాత్రి పోలింగ్‌ మెటీరియల్‌ను భారీ బందోబస్తు మధ్య నల్లగొండలో ఏర్పాటుచేసిన స్ర్టాంగ్‌ రూంకు తరలించారు. కాగా, ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్‌ మల్లన్న తన సతీమణితో కలిసి యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రెమేందర్‌రెడ్డి దంపతులు హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీలో, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రాకేశ్‌రెడ్డి హనుమకొండలోని పింగిళి కాలేజీలో ఓటు వేశారు.


ఓటర్లకు డబ్బుల పంపిణీ..!

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పలు చోట్ల పట్టభద్రులైన ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారన్న ప్రచారం జరిగింది. రెండు రాజకీయ పార్టీలు ఒక్కో ఓటరుకు రూ.500 చొప్పున ఇవ్వగా, మరో పార్టీ రూ.300 చొప్పున ఇచ్చినట్లు తెలిసింది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామంలో ఓ పార్టీ నేతలు డబ్బులు పంపిణీ చేశారంటూ ఆడియో లీకయి.. వైరల్‌గా మారింది. కాగా, యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో బట్టు స్వాతి అనే ఓటరుకు బదులు మరొకరు ఓటు వేశారు. దీంతో ఆమె ఎన్నికల సిబ్బందిని నిలదీయగా.. చివరికి టెండర్‌ ఓటు వేసేందుకు అనుమతించారు. ఖమ్మం జిల్లాలోని వైరాలోనూ సంపసాల మోహన్‌కాంత్‌ అనే వ్యక్తి ఓటును మరొకరు వేశారు. చివరికి మోహన్‌కాంత్‌ చాలెంజ్‌ ఓటు వినియోగించుకున్నారు. కాగా, మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లికి చెందిన మేడి రమేశ్‌ అనే ఓటరు.. అధికారుల తప్పిదం వల్ల పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నట్లు నమోదైంది. దీంతో ఆయన ఓటువేసే అవకాశం కోల్పోయారు.


స్వతంత్ర అభ్యర్థి అశోక్‌పై దాడి

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కుమార్‌పై నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో దాడి జరిగింది. సోమవారం ఉదయం ఆయన వరంగల్‌ వెళ్తూ నార్కట్‌పల్లిలో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. కాగా, అక్కడికి సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కాంగ్రెస్‌ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో తన అనుచరులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లారు. దానిని తన మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా.. కాంగ్రెస్‌ కార్యకర్తలు, అశోక్‌కుమార్‌తోపాటు ఆయన అనుచరుల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు అశోక్‌కుమార్‌పై దాడి చేసి మొబైల్‌ ఫోన్‌ను ధ్వంసం చేశారంటూ ఆయన అనుచరులు డయల్‌-100కు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు సకాలంలో రావడంలేదని, కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అశోక్‌కుమార్‌ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఆవరణలో భైఠాయించారు. నల్లగొండ అదనపు ఎస్‌పీ రాములునాయక్‌ వచ్చి ఫిర్యాదు మేరకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అశోక్‌కుమార్‌కు హామీ ఇచ్చారు. అయితే తమ కార్యకర్తలకు భోజన సదుపాయం కల్పించిన ఫంక్షన్‌హాల్‌ వద్దకు అశోక్‌కుమార్‌ వచ్చి తమను బెదిరించారంటూ నార్కట్‌పల్లి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులపై న్యాయసలహా తీసుకుని కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ అంతిరెడ్డి తెలిపారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభాలకు గురిచేసిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.


ఓటు వేసేందుకు వెళ్తూ అనంత లోకాలకు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తూ.. భద్రాద్రి జిల్లాలో ఇద్దరు దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. టేకులపల్లి మండలం సంపత్‌నగర్‌ గ్రామానికి చెందిన పాయం కృష్ణ(47), జానకీ(38) దంపతులు ఓటు వేసేందుకు ఇల్లెందు-కొత్తగూడెం ప్రధాన రహదారిపై బైక్‌ వెళ్తుండగా.. ఇల్లెందు వైపు నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ దంపతులు అపస్మారక స్థితికి వెళ్లారు. సమీప గ్రామానికి చెందిన యువకులు వారిని గుర్తించి ఆటోలో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో వీరి 13 ఏళ్ల కుమార్తె అనాథగా మారింది.

Updated Date - May 28 , 2024 | 05:22 AM