Share News

Vikarabad: అభివృద్ధి చేస్తామంటే అల్లరి మూకలతో దాడులా: తిరుపతి రెడ్డి

ABN , Publish Date - Nov 13 , 2024 | 06:14 PM

కొడంగల్ నియోజకవర్గాన్ని ఇప్పుడు అభివృద్ధి చేసుకోకపోతే ఎప్పటికీ అభివృద్ధి చేసుకోలేమని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై మెున్న జరిగిన దాడిలో ఎంత మంది ఉన్నారో వారందరిపై విచారణ జరిపి కేసులు పెడతామని ఆయన తెలిపారు.

Vikarabad: అభివృద్ధి చేస్తామంటే అల్లరి మూకలతో దాడులా: తిరుపతి రెడ్డి
Kodangal congress incharge Tirupathi Reddy

వికారాబాద్: లగుచర్ల (Lagucharla) ఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు, కొండగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ తిరుపతి రెడ్డి (Tirupathi Reddy) అన్నారు. 50 సంవత్సరాలుగా వెనకబడిన కొండగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం పరితపిస్తుంటే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు అడ్డుపడుతున్నారని తిరుపతి రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గం అభివృద్ధి కాకుండా ఆ పార్టీ నేతలంతా శాయశక్తులా పని చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది చిల్లర, మల్లర మూకలను రప్పించి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని తిరుపతి రెడ్డి ధ్వజమెత్తారు.


కొడంగల్ నియోజకవర్గాన్ని ఇప్పుడు అభివృద్ధి చేసుకోకపోతే జీవితంలో ఎప్పటికీ అభివృద్ధి చేసుకోలేమని తిరుపతి రెడ్డి చెప్పారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై మెున్న జరిగిన దాడిలో ఎంత మంది ఉన్నారో వారందరిపై విచారణ జరిపి కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్‌ లేదా తమకు చెప్పుకోవాలని కోరారు. అల్లరి మూకలతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే నష్టపోయేది కొడంగల్ ప్రజలేనని ఆయన ఉద్ఘాటించారు. ఇప్పుడు వచ్చిన అవకాశం మళ్లీమళ్లీ రాదని తెలిపారు.


కేటీఆర్, హరీశ్ రావు, నరేందర్ రెడ్డిలు అమాయక యవతను మద్యానికి బానిసలుగా చేశారని, వారిని రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని తిరుపతి రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల మోసపూరిత మాటలు నమ్మి యువకులు మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. గొడవలకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రైతులను ఒప్పించి, మెప్పించి, వాళ్ల అంగీకారంతో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తామని తిరుపతి రెడ్డి తేల్చి చెప్పారు.

Updated Date - Nov 13 , 2024 | 06:14 PM