Train Robbery: షిర్డీ నుంచి వస్తున్న రైల్లో దొంగతనం
ABN , Publish Date - Jul 27 , 2024 | 03:58 AM
షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న సాయినగర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దొంగలు పడ్డారు. గురువారం అర్ధరాత్రి ప్రయాణికులు నిద్రమత్తులో ఉండగా దొంగలు నాలుగు బోగీల్లో(ఎస్-3,4,5,6) బంగారం, నగదు, బ్యాగులు ఇలా ఏది దొరికితే అది ఎత్తుకెళ్లారు.
నాలుగు బోగీల్లో రూ.40 లక్షల విలువైన సొత్తు చోరీ
ఖమ్మం/సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న సాయినగర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దొంగలు పడ్డారు. గురువారం అర్ధరాత్రి ప్రయాణికులు నిద్రమత్తులో ఉండగా దొంగలు నాలుగు బోగీల్లో(ఎస్-3,4,5,6) బంగారం, నగదు, బ్యాగులు ఇలా ఏది దొరికితే అది ఎత్తుకెళ్లారు. రైలు బీదర్ సమీపంలోని పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి వచ్చాక ప్రయాణికులు దొంగతనం జరిగినట్లు గుర్తించారు. రైల్లోనే ప్రయాణిస్తూ వచ్చిన దొంగలు అవకాశం చూసుకొని దొంగతనం చేసి చైన్ లాగి పారిపోయినట్లు భావిస్తున్నారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు. సుమారు 30 మందికి చెందిన రూ.30-40లక్షల విలువైన ఆభరణాలు, నగదును దొంగలు దోచుకువెళ్లారని అంచనా. బాధితుల్లో ముగ్గురు శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లికి చెందిన రావెళ్ల పద్మ తన 110గ్రాముల బంగారం, రూ.10వేల నగదుతోపాటు సెల్‌ఫోన్‌ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శీనివాసరావు రూ.20వేలు నగదు, సెల్‌ఫోన్.. అదే మండలం చిల్లకల్లుకు చెందిన యర్రా వాణి రూ.20వేలు, సెల్‌ఫోన్ చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేసిన ఖమ్మం రైల్వే పోలీసులు కేసును పల్లి జీఆర్‌పీ పోలీసులకు పంపనున్నట్లు తెలిపారు. రైల్లో చోరీ జరిగినట్టు రాత్రి 2 గంటల సమయంలో గుర్తించగా.. బీదర్ వచ్చేవరకు ఎవరూ పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బీదర్‌లో అధికారులకు చెప్తే.. సికింద్రాబాద్ వెళ్లమని చెప్పారని, అక్కడికి వెళ్తే ఖమ్మం వెళ్లి ఫిర్యాదు చేయమన్నారని వాపోయారు.