Share News

Medchal: చిన్నారి ప్రాణం కాపాడుదామా!

ABN , Publish Date - Jul 11 , 2024 | 03:49 AM

అభంశుభం తెలియని ఓ పదేళ్ల బాలుడు కాలేయ సంబంధిత సమస్యతో మూడు నెలలుగా ఆస్పత్రిపాలై ప్రస్తుతం చావుబతుకులతో పోరాడుతున్నాడు.

Medchal: చిన్నారి ప్రాణం కాపాడుదామా!

  • కాలేయ సమస్యతో మూడు నెలలుగా ఆస్పత్రిపాలైన శ్రీశాంత్‌

  • వైద్యం కోసం ఇప్పటికే రూ.కోటికి పైగా ఖర్చు

  • దాతల సాయం కోరుతున్న తల్లిదండ్రులు

మేడ్చల్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): అభంశుభం తెలియని ఓ పదేళ్ల బాలుడు కాలేయ సంబంధిత సమస్యతో మూడు నెలలుగా ఆస్పత్రిపాలై ప్రస్తుతం చావుబతుకులతో పోరాడుతున్నాడు. వైద్యులు శస్త్రచికిత్స తప్పనిసరి అని చెప్పగా.. చికిత్స కోసం ఇప్పటికే రూ.కోటికిపైగా ఖర్చు చేసిన ఆ బాలుడి తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు. మేడ్చల్‌ మండలం సైదోనిగడ్డ తండాకు చెందిన మోహన్‌-జ్యోతి దంపతులకు ఓ కూతురు, కుమారుడు శ్రీశాంత్‌(10) ఉన్నారు. శ్రీశాంత్‌ మూడునెలల క్రితం అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు శ్రీశాంత్‌ కాలేయంలో సమస్య ఉందని, వెంటనే మార్పిడి చేయాలని సూచించారు. దీంతో మోహన్‌ దంపతులు శ్రీశాంత్‌ను హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో చేర్పించారు. శ్రీశాంత్‌ మామ సురేష్‌ ముందుకు రావడంతో అతని కాలేయాన్ని శ్రీశాంత్‌కు మార్పిడి చేశారు.


శస్త్రచికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలోనే ఆస్పత్రిలో ఉన్న శ్రీశాంత్‌ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి గురువారం మరింత విషమించడంతో వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయాలని సూచించారు. కొడుకు ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఉన్న కొద్దిపాటి భూమిని తనఖా పెట్టిన తల్లిదండ్రులు రూ. కోటికి పైగా ఖర్చు చేశారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న రెయిన్‌బో యాజమాన్యం వైద్య ఖర్చులు వద్దని మందుల ఖర్చులు మాత్రమే పెట్టుకోవాలని సూచించింది. దాతలు సాయం చేసి తమ బిడ్డ ప్రాణాన్ని కాపాడాలని వారు వేడుకుంటున్నారు. దాతలు తమను 96030 74233 నంబర్‌లో సంప్రదించాలని శ్రీశాంత్‌ తండ్రి మోహన్‌ కోరారు.

Updated Date - Jul 11 , 2024 | 03:49 AM