Share News

Hyderabad: కేంద్ర ప్రాయోజిత పథకాల వాటా పెంచాలి..

ABN , Publish Date - Jun 23 , 2024 | 02:52 AM

‘కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎ్‌సఎస్‌)’ కింద రాష్ట్రానికి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం.. ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.

Hyderabad: కేంద్ర ప్రాయోజిత పథకాల వాటా పెంచాలి..

  • ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలి.. బడ్జెట్‌ను పెట్టేటప్పుడే రాష్ట్రాల రుణ పరిమితి ప్రకటించాలి

  • రూ.2,250 కోట్ల వెనుకబడిన ప్రాంతాల నిధులను విడుదల చేయాలి

  • కేంద్ర బడ్జెట్‌ సన్నాహక సమావేశంలో భట్టి

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ‘కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎ్‌సఎస్‌)’ కింద రాష్ట్రానికి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం.. ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన శనివారం న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో కేంద్ర బడ్జెట్‌ సన్నాహక, జీఎస్టీ కౌన్సిల్‌ 53వ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రం తర ఫున భట్టి విక్రమార్క పాల్గొని పలు అంశాలను నిర్మలా సీతారామన్‌ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం గొప్ప పురోగతిని సాధిస్తూ జాతీయ ఆర్థిక వ్యవస్థకు విలువైన భాగస్వామిగా నిలుస్తోందని, అయితే రాష్ట్రానికి తక్షణమే పరిష్కరించుకోవాల్సిన సమస్యలున్నాయని తెలిపారు. ముఖ్యంగా సీఎ్‌సఎ్‌సల కింద తగ్గుతున్న నిధులు, కేంద్ర పన్నుల్లో వాటాను పంచుకునే ఆర్థిక సూత్రం వంటి సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. నిజానికి సీఎ్‌సఎ్‌సల కింద ఏ ఒక్క రాష్ట్రానికి పక్షపాతం లేకుండా నిధులను విడుదల చేయాల్సి ఉంటుందని భట్టి అన్నారు.


తెలంగాణ విషయంలో సీఎ్‌సఎ్‌సల నిధులు తగ్గాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో సీఎ్‌స ఎ్‌సల కింద అన్ని రాష్ట్రాలకు రూ.4,60,000 కోట్లను విడుదల చేశారని, ఇందులో తెలంగాణకు రూ.6,577 కోట్లు వచ్చాయని తెలిపారు. అంటే... ఇవి 1.4 శాతం నిధులు మాత్రమేనని, రాష్ట్ర జనాభా నిష్పత్తి (లేదా ఏ ఇతర అంగీకరించిన మార్గం) ప్రకారం చూసినా... నిధులు తగ్గాయని అన్నారు. ఈ దృష్ట్యా సీఎ్‌సఎ్‌సల నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం... నిర్ణీత సమయంలో విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 94(2) సెక్షన్‌ ప్రకారం... వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున ఐదేళ్లకు సంబంధించి రూ.2,250 కోట్ల నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉందని, వీటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ పథకం కింద కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ... హైదరాబాద్‌ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించినందున... మరో ఐదేళ్ల పాటు నిధులను విడుదల చేయాలన్నారు. రాష్ట్రం ఏర్పాటైన మొదట్లో... తెలంగాణకు మంజూరైన రూ.495.21 కోట్ల సీఎ్‌సఎస్‌ నిధులు పొరపాటున ఏపీకి వెళ్లాయని, వీటిని ఏపీ నుంచి తెలంగాణకు ఇప్పించాలని కోరారు.


కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలోనే రాష్ట్రాల ‘నికర రుణ పరిమితి(నెట్‌ బారోయింగ్‌ సీలింగ్‌)’ని తెలియజేయాలని, తద్వారా రాష్ట్రాలు తమ వనరులను సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలను రచించుకుంటాయని తెలిపారు. కేంద్ర పన్నుల విభజనలో రాష్ట్రాలకు వాటా తగ్గిందని, సెస్‌లు, సర్‌చార్జీల రూపంలో కేంద్రమే ఎక్కువ నిధులు లాక్కుంటుందని అన్నారు. మొత్తం పన్ను ఆదాయంలో సెస్‌లు, సర్‌చార్జీల వాటా 10 శాతానికి మించకుండా ఉండేలా చూడాలన్నారు. ‘పాలమూరు-రంగారెడ్డి’ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరారు. రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)కు నిధులివ్వాలని, జిల్లాకొక నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని డిమాండ్‌చేశారు.


ప్రధాని సూర్యఘర్‌ పథకంలో విద్యుత్తు సబ్సిడీ, ‘ముఫ్తీ బిజిలీ యోజన’ కింద సబ్సిడీ నిధులను వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని, ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రాలకు విధించిన పరిమితులను తొలగించాలని అన్నారు. రాష్ట్రాల మూలధన వ్యయం కోసం అమలు చేస్తున్న ప్రత్యేక ఆర్థిక సాయం పథకం కింద సంవత్సరానికి రూ.2.5 లక్షల కోట్లకు పెంచాలని, దీనికి సీఎ్‌సఎ్‌సల అనుసంధాన షరతులు, పరిమితులు లేకుండా చూడాలన్నారు. వివిధ సీఎ్‌సఎ్‌సలను పునఃసమీక్షించి, అనవసరమైనవాటిని తొలగించాలని, రాష్ట్రాల ఆప్షన్ల మేరకు కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఆదాయ పంపిణీ అసమానతల తొలగింపునకు బడ్జెట్‌లో కొత్త పథకాలను ప్రవేశపెట్టి ఎక్కువ నిధులివ్వాలని కోరారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య పెంపుదల శిక్షణ ఇవ్వాలన్నారు.


ప్రభుత్వ స్కూళ్ల నిర్మాణంలో జీఎస్టీ వద్దు

జీఎ్‌సటీ కౌన్సిల్‌ సమావేశంలోనూ మల్లు భట్టి విక్రమార్క పలు అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల నిర్మాణ పనులకు జీఎస్టీని మినహాయించాలని కోరారు. అలాగైతే... రాష్ట్రాలు అదనపు పాఠశాలల భవనాలను నిర్మించుకోవడానికి వీలవుతుందన్నారు. మద్యం తయారీలో వినియోగించే ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌’ను జీఎ్‌సటీ నుంచి మినహాయించాలని అన్నారు. వివిధ సందర్భాల్లో పన్ను చెల్లింపుదారులపై విధించే జరిమానా, వడ్డీని మినహాయించే ప్రతిపాదనపై మద్దతు ఇస్తున్నామని తెలిపారు. జీఎస్టీ శ్లాబుల హేతుబద్ధీకరణకు మద్దతు ఇస్తున్నామన్నారు. కాగా, బొగ్గు గనులను వేలం వెయ్యడానికి చట్టాన్ని తెచ్చింది బీజేపీ అయితే బిల్లుకు పార్లమెంటులో మద్దతు తెలిపింది బీఆర్‌ఎసేనని విలేకరులతో మాట్లాడుతూ భట్టి దుయ్యబట్టారు.

Updated Date - Jun 23 , 2024 | 02:52 AM