ఏప్రిల్‌లోనే ఎంట్రెన్స్‌లు!
ABN , Publish Date - Oct 30 , 2024 | 04:25 AM
రాష్ట్రంలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ప్రవేశ పరీక్షలను గతంలో కన్నా నెల రోజుల ముందుగానే నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు.
నెల ముందుగానే నిర్వహించే యోచన
అడ్మిషన్లలో జాప్యాన్ని నివారించేందుకే..
ప్రవేశ పరీక్షల సెట్లకు త్వరలో కొత్త కమిటీలు
1-2 రోజుల్లో అంబేడ్కర్ వర్సిటీ వీసీ ఎంపిక
మూడు పేర్లతో సెర్చ్ కమిటీ జాబితా
గవర్నర్ ఆమోదం తర్వాత ప్రకటన
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ప్రవేశ పరీక్షలను గతంలో కన్నా నెల రోజుల ముందుగానే నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. ప్రవేశ పరీక్షలను ఆలస్యంగా నిర్వహించడం వల్ల అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని అంచనా వేశారు. అడ్మిషన్లను సకాలంలో పూర్తి చేయాలంటే... ప్రవేశ పరీక్షలను కనీసం నెల రోజులు ముందుగా నిర్వహించాలనే నిర్ణయానికొచ్చారు. దాదాపు ఏప్రిల్‌లోనే ఈ పరీక్షలను పూర్తి చేయాలనే యోచనలో ఉన్నారు. రాష్ట్రంలో కరోనా తర్వాత ప్రవేశ పరీక్షల నిర్వహణ, వివిధ కోర్సులకు నిర్వహించే అడ్మిషన్ల ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీని వల్ల విద్యార్థుల్లో కొంత అయోమయం నెలకొంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో వివిధ కోర్సుల్లో చేరే విద్యార్థులకు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని నివారించేలా ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేయాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. ఎంసెట్, ఐసెట్, ఈసెట్ వంటి అనేక ప్రవేశ పరీక్షలు మే నుంచి జూన్ నెలల్లో జరుగుతున్నాయి. వాటి ఫలితాలను జూలైలో వెల్లడిస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో అడ్మిషన్లు చేపడుతున్నారు. ఈ ఏడాది కొన్ని కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని భావిస్తున్నారు. వీలైతే ఏప్రిల్‌లోనే ముఖ్యమైన ప్రవేశ పరీక్షలను పూర్తి చేయడానికి వీలుగా షెడ్యూల్‌ను రూపొందించాలనే యోచనలో ఉన్నారు. ఈ అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు దృష్టి కేంద్రీకరించారు.
త్వరలోనే సెట్లకు కమిటీలు..
రాబోయే విద్యా సంవత్సరం ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఆయా సెట్ల కమిటీలను కూడా త్వరలోనే ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడున్న సెట్ల కన్వీనర్లలో కొందరిని కొనసాగిస్తూ, మిగిలిన సెట్లకు కొత్త వారిని ఎంపిక చేయాలని యోచిస్తున్నారు. ఈ సెట్ల నిర్వహణలో కొందరు కన్వీనర్లపై ఆరోపణలు వస్తుండడం, ముఖ్యంగా నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు వస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త సెట్లను ప్రకటించాలని నిర్ణయించారు. దీనిపై త్వరలోనే ఆయా యూనివర్సిటీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఒకటి రెండు రోజుల్లో కొత్త వైస్ చాన్సలర్‌ను ప్రకటించే అవకాశం ఉంది. వీసీ ఎంపికలో భాగంగా తాజాగా సెర్చ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మూడు పేర్లను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ జాబితాలో అదే యూనివర్సిటీలో డీన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌తోపాటు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసి రిటైరయిన ప్రొఫెసర్ పేరు కూడా ఉన్నట్లు తెలిసింది. సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన మూడు పేర్లను ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. ఈ ప్రతిపాదనలను గవర్నర్‌కు పంపించనున్నారు. గవర్నర్ నుంచి ఆమోదం వచ్చిన వెంటనే కొత్త వీసీని ప్రకటించనున్నారు.