Share News

Telangana budget: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి 50,180 కోట్లు..

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:28 AM

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్టీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక నిధుల కింద రూ.50,180 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీల ప్రత్యేక నిధికి రూ.33,124 కోట్లు, ఎస్టీకి రూ.17,056 కోట్లు ఇచ్చింది.

Telangana budget: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి 50,180 కోట్లు..

  • దళిత బంధుకు రూ.2వేల కోట్లు.. మేడారం జాతరకు రూ.52 కోట్లు

  • కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌కు రూ.3,585 కోట్లు

  • బీసీ శాఖకు రూ.9,200 కోట్లు.. మహిళా, శిశు సంక్షేమానికి రూ.2,736 కోట్లు

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్టీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక నిధుల కింద రూ.50,180 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీల ప్రత్యేక నిధికి రూ.33,124 కోట్లు, ఎస్టీకి రూ.17,056 కోట్లు ఇచ్చింది. 2023-24 బడ్జెట్‌లో ఎస్టీ ప్రత్యేక నిధికి రూ.15,232 కోట్లు, ఎస్సీలకు రూ.36,750కోట్లు కలిపి మొత్తం రూ.51,982 కోట్లు కేటాయింపులు జరిగాయి. వాటితో పోలిస్తే ఈసారి కేటాయింపులు స్వల్పంగా తగ్గాయి. గత బడ్జెట్‌తో పొలిస్తే బీసీ సంక్షేమానికి, మహిళా, శిశు సంక్షేమ శాఖకు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు కేటాయింపులు ఈసారి స్వల్పంగా పెరిగాయి.


బీసీ సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉన్న వివిధ కులాల కార్పోరేషన్లకు గత ప్రభుత్వం కేటాయించిన విధంగానే రూ.50కోట్లు, రూ.65కోట్ల చొప్పున కేటాయించగా, వెనుకబడిన కులాల కార్పోరేషన్‌ (ఎంబీసీ)కు రూ.400కోట్లు, బీసీ కార్పోరేషన్‌కు రూ.700 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో బీసీ శాఖకు రూ. 6,229 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.9,200 కోట్లు ఇచ్చారు. ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.7,638 కోట్లు కేటాయించారు. దళితబంధు పథకానికి బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు కేటాయించారు. 2023-24 బడ్జెట్‌లో ఎస్సీ సంక్షేమానికి రూ.21,072కోట్లను కేటాయించగా అందులో రూ.17,700 కోట్ల మేర నిధులను దళిత బంధుకు ఇచ్చారు. ఇక, ప్రస్తుత బడ్జెట్‌లో గిరిజన సంక్షేమశాఖకు రూ.3,969 కోట్లు, మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌ శాఖకు రూ.2,736 కోట్లు కేటాయించారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలకు ఈ బడ్జెట్‌లో రూ.3,585 కోట్లు కేటాయించగా 2023-24లో జరిగిన కేటాయింపుల కంటే ఇది రూ.375కోట్లు అదనం. ఇక, మేడారం జాతరకు సర్కారు రూ.52 కోట్లు కేటాయించింది.


గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు

గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్సీ సమీకృత గురుకులాల నిర్మాణానికి రూ.2వేల కోట్లు, గిరిజన గురుకుల ఎడ్యుకేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.200కోట్లు, బీసీ రెసిడెన్షియల్‌ హైస్కూల్‌, జూనియర్‌ కళాశాలలకు రూ.307 కోట్లు కేటాయించింది. కొత్తగా ఏర్పాటైన గిరిజన తండాల గ్రామ పంచాయతీల్లో.. పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.300కోట్లు, గిరిజన ఆవాసాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.200కోట్లు, రహదారి సౌకర్యం లేని తండాలకు రహదారుల కల్పనకు రూ.150కోట్లు ఇచ్చారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని ఫ్రీ, పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పలు, విదేశీ విద్యానిధి పథకం అమలుకు కూడా నిధులు కేటాయించారు.

Updated Date - Jul 26 , 2024 | 12:04 PM