State Debt: రుణభారం.. సుదీర్ఘకాలం!
ABN , Publish Date - Aug 19 , 2024 | 03:01 AM
రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో తీసుకుంటున్న అప్పుల సగటు కాల పరిమితి(టర్మ్) నానాటికీ పెరిగిపోతోంది. గతంలో సగటు కాల పరిమితి 10-12 ఏళ్లు ఉండగా.. ఇప్పుడది 19 ఏళ్లకు పెరిగింది.
పెరుగుతున్న ప్రభుత్వ అప్పుల కాల పరిమితి
తెలంగాణ వచ్చిన కొత్తలో 6 నుంచి 8 ఏళ్లు.. ఇప్పుడు 19 ఏళ్లు!
రుణం చెల్లింపు వ్యవధి పెరిగితే వడ్డీ శాతాల్లో కాస్త తగ్గుదల
అందుకే దీర్ఘకాలిక అప్పులు తీసుకుంటున్న రాష్ట్ర సర్కార్లు
రాబోయే ప్రభుత్వాలకు భారంగా మారనున్న రుణాలు
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో తీసుకుంటున్న అప్పుల సగటు కాల పరిమితి(టర్మ్) నానాటికీ పెరిగిపోతోంది. గతంలో సగటు కాల పరిమితి 10-12 ఏళ్లు ఉండగా.. ఇప్పుడది 19 ఏళ్లకు పెరిగింది. ఫలితంగా కొత్తగా వచ్చే ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతోంది. అప్పులకు అసలు, వడ్డీలు చెల్లించలేక, సంక్షేమ పథకాలకు నిధులను సర్దలేక సతమతమవుతున్నాయి. అధికారంలో ఉండే ఏ పార్టీ అయినా భవిష్యత్తు రుణ భారం గురించి ఆలోచించడం లేదన్న ఆరోపణలున్నాయి.
తాము గట్టెక్కితే చాలన్న ధోరణిలో అప్పులు చేస్తూ పోతున్నాయి. ఒక్క తెలంగాణలోనే కాదు.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అందుకే అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంకు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. నగదు బదిలీ పథకాలు, ఇతర ఉచిత పథకాలకు అప్పుల సొమ్మును వినియోగించొద్దని హెచ్చరిస్తున్నాయి. తీసుకుంటున్న రుణాల్ని ఆస్తులు సృష్టించడానికి వెచ్చించాలని చెబుతున్నాయి. కానీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు అప్పుల్లో ఎక్కువ సొమ్మును ఉచిత పథకాలకే వినియోగిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు ఏ మాత్రం ఆరోగ్యకరం కాదంటూ కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా హెచ్చరిస్తోంది. అయినా రాష్ట్రాల తీరు మారడం లేదు. తెలంగాణ ఆవిర్భవించిన కొత్తలో ఆరేళ్లు, ఎనిమిదేళ్ల కాల పరిమితితో ప్రభుత్వం అప్పులు తీసుకుంది. ఆ తర్వాత 2015, 2016 సంవత్సరాల్లో ఇది 10, 12 ఏళ్లకు పెరిగింది. 2021, 2022 నాటికి 15-17 ఏళ్ల మధ్య కొనసాగింది. ఇప్పుడది ఏకంగా 19 ఏళ్లకు చేరింది. ఒక్కోసారి 28, 29 ఏళ్ల కాల పరిమితితోనూ ప్రభుత్వం అప్పులు తీసుకుంటోంది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 47 సెక్యూరిటీ బాండ్లను జారీ చేసింది.
అత్యల్పంగా రూ.500 కోట్లు.. అత్యధికంగా రూ.3000 కోట్ల రుణం కోసం వీటిని విడుదల చేసింది. అతి తక్కువగా ఏడేళ్లు, అత్యధికంగా 28 ఏళ్ల కాల పరిమితితో బాండ్లు జారీ అయ్యాయి. సగటు కాల పరిమితి 18.5 ఏళ్లుగా తేలింది. 2023 మే 2న రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల అప్పును 25 ఏళ్ల కాల పరిమితి, 7.32 శాతం వార్షిక వడ్డీతో తీసుకోవడం గమనార్హం. అదేరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ.1000 కోట్లను 16 ఏళ్ల కాల పరిమితి, 7.32 శాతం వార్షిక వడ్డీతో, మరో రూ.1000 కోట్లను 20 ఏళ్ల కాల పరిమితి, 7.30 శాతం వార్షిక వడ్డీతో తీసుకుంది. వడ్డీ శాతాల్లో పెద్దగా తేడా లేకపోయినా.. ఏపీ తక్కువ కాల పరిమితితో అప్పు తీసుకుంటే, తెలంగాణ మాత్రం 25 ఏళ్ల కాల పరిమితితో అప్పు తీసుకోవడం గమనార్హం.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 6 వరకు మొత్తం 24 సెక్యూరిటీ బాండ్లను జారీ చేసింది. ఇందులో కూడా అత్యధికంగా 29 ఏళ్ల కాల పరిమితితో జారీ చేసినవి ఉన్నాయి. ఈ నాలుగు నెలలకు గాను అప్పుల సగటు కాల పరిమితి 19 ఏళ్లుగా ఉంది. ఇలా సుదీర్ఘ కాల పరిమితితో తీసుకుంటున్న అప్పులు.. రాబోయే ప్రభుత్వాలకు గుదిబండగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుల్లో 76.23 శాతం మేర నిధులు పాత అప్పుల చెల్లింపులకే సరిపోతున్నాయని కాగ్ ఆక్షేపించింది. 2032-33 నాటికి రాష్ట్ర ప్రభుత్వం అసలు, వడ్డీల కింద రూ.2.90 లక్షల కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుందని నిగ్గు తేల్చింది.
వడ్డీ తగ్గుతుందనే..!
సాధారణంగా కాల పరిమితి ఆధారంగా వడ్డీ శాతాలు నిర్ణయమవుతాయి. రాష్ట్రాలు అప్పుల కోసం జారీ చేసే బాండ్లను ఆర్‌బీఐ వేలానికి పెట్టి, వడ్డీ శాతాలను ఖరారు చేస్తుంది. ఎక్కువ కాల పరిమితితో బాండ్లను జారీ చేస్తే వడ్డీ శాతం స్వల్పంగా తగ్గుతుంది. అందుకే ప్రభుత్వాలు తక్కువ వడ్డీతో సుదీర్ఘ కాల పరిమితితో అప్పలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాయి. కానీ, ఇది రాబోయే ప్రభుత్వాలకు సంకటంగా మారుతోంది.