Finance Commission: రాష్ట్రాల పన్ను వాటాను 50 శాతానికి పెంచండి
ABN , Publish Date - Sep 10 , 2024 | 04:11 AM
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్ను వాటాను 50శాతానికి పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ఆర్థిక సంఘం, వివిధ రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో కోరాయి.
16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక సంఘం, పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి
ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాల్ని ప్రోత్సహించాలి
నిధులిచ్చే ముందు మాకు సమాచారమివ్వండి
విపత్తుల నిర్వహణకు ప్రత్యేక నిధులు ఇవ్వండి
చిన్న పంచాయతీలకు గ్రాంట్లివ్వండి: కాంగ్రెస్
భగీరథకు 20 వేల కోట్లు ఇవ్వండి: హరీశ్‌రావు
ఓబీసీలకు గ్రాంటు సిఫారసు చేయాలి: బీజేపీ
రాష్ట్రాలకు వాటా పెంపుపై ఆలోచిస్తాం.. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్ను వాటాను 50శాతానికి పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ఆర్థిక సంఘం, వివిధ రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో కోరాయి. 14వ ఆర్థిక సంఘంలో 42శాతంగా ఉన్న వాటాను 15వ ఆర్థిక సంఘం 41శాతానికి కుదించిందని, దీనివల్ల ప్రగతిశీల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని వివరించాయి. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఒకే సూచనను చేయడాన్ని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అర్వింత్ పనగారియా అభినందించారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, తమ సిఫార్సుల విషయంలో ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ కేంద్ర ఆర్థిక సంఘం సోమవారం ప్రజాభవన్‌లో వివిధ వర్గాలతో వరుస సమావేశాలను నిర్వహించింది.
కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అర్వింద్ పనగారియా, కార్యదర్శి, సభ్యులతోకూడిన బృందం తొలుత మునిసిపల్ కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల మేయర్లు, చైర్మన్‌లతో సమావేశమైంది. అనంతరం గ్రామపంచాయతీల మాజీ సర్పంచులు, జడ్పీల చైర్‌పర్సన్లు, జడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సంఘ సభ్యులతో భేటీ అయ్యింది. ఆ తర్వాత పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు-- అలీఫ్, ఫిక్కీ, సీఐఐ ప్రతినిధులతో, సాయంత్రం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున సిరిసిల్ల రాజయ్య, టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలి. 15వ ఆర్థిక సంఘం సూచించిన 41ు కూడా రాష్ట్రానికి దక్కలేదు. కేవలం 31ు మేర నిధులు వస్తున్నాయి. సెస్‌లు, సర్‌చార్జీల పేరుతో కేంద్ర ప్రభుత్వమే మిగతా నిధులను లాగేసుకుంటోంది’’ అని ఆరోపించారు. జనాభా నియంత్రణ, భౌగోళిక విస్తీర్ణం, అడవుల పెంపు, తలసరి ఆదాయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా గుర్తించాలన్నారు. జనాభా పరంగా 12వ స్థానంలో ఉన్న తెలంగాణ.. నిధుల కేటాయింపులో మాత్రం 18వ స్థానంలో ఉందని, ఇది చాలా అన్యాయమని వివరించారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలున్నాయని వివరించారు. ‘‘వీటిలో చాలా పంచాయతీలు నిధుల్లేక ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి. 500 జనాభా ఉన్న ప్రతి తండాను, ఇతర గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. మొత్తం 1,851 తండాలు, గ్రామాలను పంచాయతీలుగా అభివృద్ధి చేశాం. వీటికి ఎలాంటి ఆదాయ మార్గాలు లేవు.
కొన్ని చిన్న గ్రామ పంచాయతీలకు కూడా నిధులు లేవు. ఇలాంటి తండాలు, చిన్న పంచాయతీలకు కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంటును కేటాయించేలా సిఫారసు చేయాలి’’ అని విజ్ఞప్తి చేశారు. దేశంలో గిరిజన జనాభా పరంగా తెలంగాణ 12వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. ఈ దృష్ట్యా ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా.. గిరిజన పంచాయతీలకు ప్రత్యేక గ్రాంటును కేటాయించాల్సిన అవసరముందన్నారు. ఆరోగ్య రంగలో పలు మార్పులు చేపడుతున్నామని, జనాభాను నియంత్రిస్తున్నామని, ఇలాంటి ప్రగతిశీల రాష్ట్రానికి తప్పకుండా నిధులు పెంచాలని కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు విడుదల చేసే ముందు రాష్ట్ర ఆర్థిక సంఘాని(టీఎ్‌సఎ్‌ఫసీ)కి సమాచారమివ్వాలని విన్నవించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీపీ) కిందకు వ్యవసాయ రంగాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తరచూ తుపాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని, వీటిని ఎదుర్కొనడానికి ప్రత్యేక గ్రాంటును మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో పట్టణీకరణ పెరుగుతోందని, ఈ దృష్ట్యా సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రత్యేక నిధులివ్వాలని డిమాండ్ చేశారు.
15వ ఆర్థిక సంఘం నిధులివ్వండి: హరీశ్
15వ ఆర్థిక సంఘం స్పెసిఫిక్ స్టేట్, స్పెసిఫిక్ సెక్టార్ తదితర గ్రాంట్ల కింద రాష్ట్రానికి రూ.6,097 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసిందని, అయితే.. పైసా కూడా ఇవ్వలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మొత్తం నిధులను విడుదల చేయాలని, రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల్లో వాటాను 50శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. 13వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా 2.43 శాతంగా ఉండేదని, 14వ ఆర్థిక సంఘం నాటికి అది 2.133 శాతానికి తగ్గిందన్నారు. 15వ ఆర్థిక సంఘం దానిని 2.102 శాతానికి తగ్గించిందన్నారు. దీంతో రాష్ట్రానికి పన్నుల వాటా నిధులు తగ్గిపోయాయని అన్నారు. పన్నులు వసూలు చేయడంలో అగ్రస్థానంలో ఉంటే... 2.5 శాతం వెయిటేజీని ఇస్తున్నారని, దీనిని 10 శాతానికి పెంచాలన్నారు. 1961లో కేంద్రానికి పన్నేతర రాబడి రూ.171 కోట్లు ఉంటే, 2024-25లో అది రూ.5.46 లక్షల కోట్లకు పెరిగిందని, ఈ దృష్ట్యా పన్నేతర రాబడిలోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని కోరారు. మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, నిర్వహణ కోసం రూ.2350 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచిస్తే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. మిషన్ భగీరథకు రూ.20 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద విపత్తు సహాయ నిధి కింద కేంద్ర రాష్ట్రాల వాటా 75:25గా ఉందని, దీనిని 90:10గా మార్చాలని కోరారు.
విపత్తుల నిర్వహణకు అదనపు నిధులు:ఈటల
ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం రాష్ట్రాలకు మరో 1ు నిధులను పెంచాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అప్పట్లో రూ.1.28 లక్షల కోట్లను కేటాయించిందని, అందులో తెలంగాణకు రూ.2,648 కోట్లు వచ్చాయని గుర్తుచేశారు. కానీ.. తెలంగాణతో సహా రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవిస్తున్నాయని, ఈ దృష్ట్యా 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులకు అదనంగా మరో ఒక్క శాతం పెంచి ఇవ్వడానికి 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేయాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గ్రాంటును సిఫారసు చేసిందని, అదే మాదిరిగా ఓబీసీలకు ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలంటూ 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేయాలని కోరారు. దారిద్య్ర నిర్మూలన, వ్యవసాయాధారిత కార్యక్రమాలకు ప్రత్యేక గ్రాంట్లనివ్వాలన్నారు. ప్రాంతీయ అసమానతలను తొలగించడంలో భాగం గా తెలంగాణలోని అత్యంత వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక గ్రాంటు కింద నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు.
నేడు భేటీ కానున్న సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం 16వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో భేటీ కానున్నారు. వీరికి ముఖ్యమంత్రి విందు ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
రాష్ట్ర వాటాను 3.5 శాతానికి పెంచాలి: సీపీఎం
కేంద్ర పన్నుల్లో వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నంద్యాల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు వచ్చే వాటాలో జనాభా దామాషాలో తెలంగాణకు 2.10 శాతం నిధులను మాత్రమే కేటాయిస్తున్నారని, ఈ దృష్ట్యా దీనిని 3.5 శాతానికి పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఎడ్యుకేషన్ సెస్, రోడ్డు సెస్ వంటి సెస్సులన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విజ్ఞప్తులపై ఆర్థిక సంఘం చైర్మన్ అర్వింద్ పనగారియా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఒకే రకమైన డిమాండ్ చేయడం మంచి సంప్రదాయమన్నారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటాను 41ు నుంచి 50 శాతానికి పెంచాలని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయని.. ఈ అంశంపై ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. పార్టీలు ఇచ్చిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. కేంద్ర ఆర్థిక సంఘంతో భేటీ అయిన వారిలో.. రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు ఎస్.సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ నుంచి కాసం వెంకటేశ్వర్లు, ప్రకాశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద్, టీడీపీ నుంచి సామా భూపాల్‌రెడ్డి, ఎన్.దుర్గాప్రసాద్, మజ్లిస్ నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, సయ్యద్ అమీన్ జాఫ్రీ, అహ్మద్ బలాల తదితరులు కూడా ఉన్నారు.