Share News

Hyderabad: ఉసురు తీసిన హాస్టల్‌ భయం..

ABN , Publish Date - Jun 22 , 2024 | 04:55 AM

ఇంటికి, అమ్మానాన్నకు దూరంగా హాస్టల్‌లో ఉంటూ చదువుకోవడం ఆ బాలుడికి చాలా భయంకరంగా అనిపించింది. తన కష్టాన్ని అమ్మకు చెబితే.. కొడుకు భవిష్యత్తు కోసం ఆ తల్లి నచ్చజెప్పింది. కానీ, హాస్టల్‌లో ఉండే దైర్యం చేయలేకపోయిన ఆ బాలుడు అక్కడి నుంచి పారిపోయేందుకు సాహసించి ప్రాణాలు కోల్పోయాడు.

Hyderabad: ఉసురు తీసిన హాస్టల్‌ భయం..

  • కళాశాల హాస్టల్‌ నుంచి పారిపోతూ విద్యుదాఘాతానికి గురై.. ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం

  • రెండ్రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు

హయత్‌నగర్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఇంటికి, అమ్మానాన్నకు దూరంగా హాస్టల్‌లో ఉంటూ చదువుకోవడం ఆ బాలుడికి చాలా భయంకరంగా అనిపించింది. తన కష్టాన్ని అమ్మకు చెబితే.. కొడుకు భవిష్యత్తు కోసం ఆ తల్లి నచ్చజెప్పింది. కానీ, హాస్టల్‌లో ఉండే దైర్యం చేయలేకపోయిన ఆ బాలుడు అక్కడి నుంచి పారిపోయేందుకు సాహసించి ప్రాణాలు కోల్పోయాడు. హయత్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ కార్పొరేట్‌ కళాశాల వద్ద ఈ ఘటన జరిగింది. సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడుపల్లిలో నివాసముండే కర్రీ విజయ్‌కుమార్‌, చాముండేశ్వరి దంపతులకు గిరీష్‌ అరావత్‌(16) అనే కుమారుడు ఉన్నాడు. గిరీష్‌ పదో తరగతి పూర్తవ్వడంతో ఇంటర్మీడియట్‌ కోసం కొహెడాలోని ఓ రెసిడెన్షియల్‌ కళాశాలలో పది రోజుల క్రితం చేర్పించారు. హాస్టల్‌లో ఉండటాన్ని ఇష్టపడని గిరీష్‌ తరచూ తల్లికి ఫోన్‌ చేసి రమ్మని పిలిచేవాడు. ఈ క్రమంలో గత ఆదివారం హాస్టల్‌కు వెళ్లిన చాముండేశ్వరి కొడుకును కలిసి భోజనం తినిపించి ధైర్యం చెప్పి వచ్చారు.


కానీ, హాస్టల్‌లో ఉండలేకపోయిన గిరీష్‌ అక్కడి నుంచి పారిపోయేందుకు నిర్ణయించుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత పారిపోయేందుకు హాస్టల్‌లో తన గది నుంచి బయటికొచ్చాడు. కళాశాల ఆగ్నేయం వైపున ఉండే విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద గోడ ఎత్తు తక్కువగా ఉండడంతో దానిని దూకేందుకు వెళ్లాడు. ఆ గోడ పైకి ఎక్కిన గిరీ్‌షకు విద్యుత్‌ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై పక్కనే ఉన్న పొదల్లో పడిపోయాడు. అయితే, గురువారం ఉదయం గిరీష్‌ హాస్టల్‌లో కనిపించకపోవడంతో యాజమాన్యం హయత్‌నగర్‌ పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అయితే, గిరీష్‌ బుధవారం అర్ధరాత్రి తర్వాత ట్రాన్స్‌ఫార్మర్‌ వైపు వెళుతున్న సీసీ కెమెరా దృశ్యాలను కళాశాల యాజమాన్యం శుక్రవారం గుర్తించింది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్‌ పరిసరాల్లో గాలించగా అక్కడి పొదల్లో గిరీష్‌ మృతదేహం కనిపించింది. విద్యుదాఘాతం వల్ల గిరీష్‌ శరీరం నల్లగా మారిపోగా చర్మం కూడా కాలిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jun 22 , 2024 | 04:55 AM