Jangaon: హాస్టల్‌లో ఉండలేక విద్యార్థిని ఆత్మహత్య..
ABN , Publish Date - Jun 24 , 2024 | 04:41 AM
వసతి గృహంలో ఉండడం ఇష్టం లేక ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జనగామ జిల్లా చిలుపూర్ మండలం రాజవరం సమీపంలోని కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం)లో జరిగింది.
చిలుపూర్, జూన్ 23: వసతి గృహంలో ఉండడం ఇష్టం లేక ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జనగామ జిల్లా చిలుపూర్ మండలం రాజవరం సమీపంలోని కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం)లో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం... రాజవరం రెవెన్యూ పరిధిలోని పకీరతండాకు చెందిన ఇస్లావత్ వర్షిణి (14)ని తల్లిదండ్రులు ఈనెల 21న స్థానిక కేజీబీవీలో చేర్పించారు. అక్కడ ఉండడం ఇష్టం లేని వర్షిణి తాను వెంట తెచ్చుకున్న పురుగుల మందు కలిసిన కూల్‌డ్రింక్‌ను అదే రోజు రాత్రి తాగి పడుకుంది.
ఉదయం నిద్ర లేచిన కాసేపటికే అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంది. దాంతో కేజీబీవీ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారమిచ్చి వెంటనే బాలికను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున వర్షిణి మృతి చెందింది. బాలిక తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎలాంటి తినుబండారాలను పాఠశాలలోనికి అనుమతించని కేజీబీవీ సిబ్బంది పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్ బాటిల్‌ను విద్యార్థిని వెంట పట్టుకెళ్లినా గమనించకపోవడం బాధాకరమని వాపోతున్నారు.