Khammam: మృతదేహం తరలింపునకు ఎన్నారైల సాయం..
ABN , Publish Date - Jul 02 , 2024 | 04:22 AM
అమెరికాలో ఇటీవల స్విమ్మింగ్ పూల్‌లో మునిగి మృతి చెందిన ఖమ్మం జిల్లా విద్యార్థి శ్రీనాథరాజు కిరణ్‌కుమార్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎన్నారైలు తమ వంతుగా ఆర్థిక సాయం అందించారు.
20లక్షల వితరణ, దాతలను కదిలించిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం
కల్లూరు, జూలై 1: అమెరికాలో ఇటీవల స్విమ్మింగ్ పూల్‌లో మునిగి మృతి చెందిన ఖమ్మం జిల్లా విద్యార్థి శ్రీనాథరాజు కిరణ్‌కుమార్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎన్నారైలు తమ వంతుగా ఆర్థిక సాయం అందించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన శ్రీనాథరాజు కిరణ్‌కుమార్ ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. గత శనివారం ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి కిరణ్‌కుమార్ మృతి చెందాడు. ఈ సంఘటనపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం అమెరికాలో ఉన్న ఎన్నారైల హృదయాలను కదిలించింది. ఆమెరికాలోనే ఉన్న చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన ఎన్నారైలు తిరుమలశెట్టి గోపి, కమ్మంపాటి అంజేనేయులు, మాదిరాజు శ్రీనివాసరావు ఆన్‌లైన్‌లో ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని చదివి దాన్ని అమెరికాలో ఉన్న తెలుగు వారందరి సోషల్ మీడియా గ్రూప్‌లలో పోస్ట్ చేశారు.
దీంతో ఎంతో మంది తెలుగు ఎన్నారైలు ముందుకు వచ్చి తమ వంతుగా రూ. 20 లక్షలు సాయం చేశారు. గురువారం నాటికి కిరణ్ మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉందని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో కిరణ్ అంతక్రియలు నిర్వహించేందుకు స్థానికంగా ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు, మిత్రబృందం కూడా ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు.