Share News

Student Innovations: డ్రైవింగ్‌లో నిద్ర వస్తే.. లేపే కళ్లజోడు

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:49 AM

కారు డ్రైవ్‌ డ్రైవ్‌ చేసే సమయంలో మనకు నిద్ర వస్తే వెంటనే అప్రమత్తం చేసే ఏర్పాటేదైనా ఉంటే? మీటర్‌ దూరంలో ఉన్న అడ్డంకులను కూడా ముందే గుర్తించి శబ్దం చేసే చేతికర్ర అంధుల వద్ద ఉంటే?

Student Innovations: డ్రైవింగ్‌లో నిద్ర వస్తే.. లేపే కళ్లజోడు

  • అంధులను అప్రమత్తం చేసే చేతికర్ర

  • భూమి కింద అనువైన ఇంటి నిర్మాణం

  • ఐఐటీహెచ్‌లో విద్యార్థుల ఆవిష్కరణలు

కంది, ఆగస్టు 18: కారు డ్రైవ్‌ డ్రైవ్‌ చేసే సమయంలో మనకు నిద్ర వస్తే వెంటనే అప్రమత్తం చేసే ఏర్పాటేదైనా ఉంటే? మీటర్‌ దూరంలో ఉన్న అడ్డంకులను కూడా ముందే గుర్తించి శబ్దం చేసే చేతికర్ర అంధుల వద్ద ఉంటే? ...అద్భుతమైన ఆలోచనలు కదూ! రాష్ట్రంలోని 18 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇలాంటి ఆలోచనలకు పదును పెట్టి.. వాటిని ఆవిష్కరణల రూపంలో అందుబాటులోకి తెచ్చారు. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌ వారి ఆవిష్కరణలకు వేదికైంది.


‘ఫ్యూచర్‌ ఇన్నోవేటర్స్‌ ఫెయిర్‌’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ఆయా పాఠశాలలకు చెందిన 8,9,10 తరగతుల విద్యార్థులు రూపొందించిన వినూత్న వస్తువులను ప్రదర్శించారు. డ్రైవర్లకు నిద్రవస్తే వెంటనే అప్రమత్తం చేసే ‘యాంటీ స్లీప్‌ డిటెక్టర్‌’ కళ్లజోడును మచ్చబొల్లారానికి చెందిన ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు అభివృద్ధి చేశారు. అలాగే.. అంధులకు ఎంతగానో ఉపయోగపడే ‘ఎంపవరింగ్‌ స్టిక్‌ను’ హైదరాబాద్‌లోని ఫ్యూచర్‌ కిడ్స్‌ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి వివాన్‌ రూపొందించాడు.


పీవీసీ పైపులకు యూవీఆర్‌ సెన్సర్లను అమర్చి దీన్ని తయారుచేశాడు. ఈ కర్రపట్టుకొని నడిచేటప్పుడు.. ఏదైనా అడ్డం వస్తే ఒక మీటర్‌ దూరం నుంచే ఆ కర్ర దాన్ని గుర్తించి గట్టిగా బీప్‌ శబ్దం చేస్తుంది. ఇక.. యాప్రాల్‌లోని ఇండస్‌ యూనివర్సల్‌ స్కూల్‌ విద్యార్థులు పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో భూమిలోపల ఇళ్లు నిర్మించే ప్రాజెక్టును ఆవిష్కరించారు. దాదాపు 750 చదరపు గజాల్లో గాలి, వెలుతురు తగిలే ఇంటి డిజైన్‌ను రూపొందించారు. ఇలా భూమి లోపల ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తక్కువ అని, భూమి పైన ఉన్న స్లమ్‌ ఏరియాను ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8, 9, 10 తరగతి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికే ఈ పోటీలు నిర్వహించామని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి తెలిపారు.

Updated Date - Aug 19 , 2024 | 04:49 AM