Sudarshan Reddy: మాఫియా రాజ్య పునాది.. మల్లన్న సాగర్..
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:42 AM
మాఫియా సామ్రాజ్య నిర్మాణానికి పునాది మల్లన్న సాగర్ ప్రాజెక్టు అని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి అన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల వ్యథను వివరిస్తూ సీనియర్ జర్నలిస్టు రేమిల్ల అవధాని రాసిన ‘ఊళ్లు-నీళ్లు-కన్నీళ్లు’ పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు.
నిర్వాసితుల గోస చూసి దుఃఖం ఆగలేదు
సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి
ప్రాజెక్టుతో ప్రజల ప్రాణాలకు ముప్పు: కోదండరాం
హైదరాబాద్ సిటీ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): మాఫియా సామ్రాజ్య నిర్మాణానికి పునాది మల్లన్న సాగర్ ప్రాజెక్టు అని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి అన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల వ్యథను వివరిస్తూ సీనియర్ జర్నలిస్టు రేమిల్ల అవధాని రాసిన ‘ఊళ్లు-నీళ్లు-కన్నీళ్లు’ పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పుస్తకం చదువుతుంటే దుఃఖం ఆగలేదని తెలిపారు. రాజ్యాంగ బద్ధమైన పాలన ఎలా ఉండకూడదో కాళేశ్వరం పునాదితోనే ప్రారంభమైందని అన్నారు. గుప్పెడుమంది కలిసి వ్యవస్థలను, సంస్థలను ఆధీనంలోకి తీసుకొని సాగించిన పరిపాలనకు నిదర్శనం మల్లన్నసాగర్ అని ఆక్షేపించారు. మల్లన్నసాగర్ బాధితులకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు.
‘‘భూకంపాలు రావడానికి అవకాశమున్న ప్రాంతంలో ప్రాజెక్టు కట్టారు. ఏదైనా జరిగితే 5 లక్షల మంది ప్రాణాలు పోతాయని నిపుణులు హెచ్చరించినా గత పాలకులు వినలేదు’’ అని ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. భూసేకరణ చట్టానికి అనేక తూట్లు పొడిచిన కేసీఆర్ ప్రభుత్వం మూడు లక్షల ఎకరాలను లాక్కుందని విమర్శించారు. మేడిగడ్డను అలా వదిలేసి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టడం మంచిదని రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సూచించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు మార్కెట్ ధర ప్రకారం డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి మాటున సాగిన విధ్వంసాన్ని ఈ పుస్తకం ద్వారా కళ్లకు కట్టారని ఆచార్య జయధీర్ తిరుమల రావు అన్నారు.