Share News

Supreme Court: సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేస్తాం

ABN , Publish Date - Aug 03 , 2024 | 03:30 AM

సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పు ఆ వర్గాల రిజర్వేషన్లకు భంగం కలిగించేలా ఉందని మాల మహానాడు నేతలు అన్నారు. ఈ నెల 8, 9, 10వ తేదీల్లో ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల అగ్రనేతలు, ఎంపీలను కలిసి.. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే వర్గీకరణ అనే అంశంపై చర్చిస్తామని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ జి.చెన్నయ్య చెప్పారు.

Supreme Court: సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేస్తాం

  • వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం: మాల మహానాడు

నల్లకుంట/కవాడిగూడ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పు ఆ వర్గాల రిజర్వేషన్లకు భంగం కలిగించేలా ఉందని మాల మహానాడు నేతలు అన్నారు. ఈ నెల 8, 9, 10వ తేదీల్లో ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల అగ్రనేతలు, ఎంపీలను కలిసి.. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే వర్గీకరణ అనే అంశంపై చర్చిస్తామని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ జి.చెన్నయ్య చెప్పారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 11, 12వ తేదీల్లో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయనున్నట్లు తెలిపారు.


బీజేపీ ప్రభుత్వ రాజకీయ కుట్రలో భాగంగానే తిరిగి వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ ఆరోపించారు. వర్గీకరణను అందరి కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో చేస్తానని సీఎం రేవంత్‌ అసెంబ్లీలో ప్రకటించడం దుర్మార్గమన్నారు. వర్గీకరణపై సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ మాల సంఘాల నేతలు శుక్రవారం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తీర్పు ప్రతులను దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - Aug 03 , 2024 | 03:30 AM