Share News

Hyderabad: చిట్టెమ్మ.. రోబో టీచర్‌!

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:11 AM

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలో ‘‘చిట్టి’’ హంగామా చూశారు కదా..? ఆ ‘రోబో’ అంతా సూపర్‌ ఫాస్ట్‌..! ఏదైనా చకచకా చేసేస్తుంది..! టకటకా చెప్పేస్తుంది..! ఇప్పుడు ఇలాంటి రోబో టీచర్లు ‘చిట్టెమ్మ’లను హైదరాబాద్‌లోని నెక్ట్స్‌ జెన్‌ స్కూల్స్‌లో ప్రవేశపెట్టారు.

Hyderabad: చిట్టెమ్మ.. రోబో టీచర్‌!

  • హైదరాబాద్‌లో భారత్‌ తయారీ రోబోలతో బోధన

హైదర్‌నగర్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలో ‘‘చిట్టి’’ హంగామా చూశారు కదా..? ఆ ‘రోబో’ అంతా సూపర్‌ ఫాస్ట్‌..! ఏదైనా చకచకా చేసేస్తుంది..! టకటకా చెప్పేస్తుంది..! ఇప్పుడు ఇలాంటి రోబో టీచర్లు ‘చిట్టెమ్మ’లను హైదరాబాద్‌లోని నెక్ట్స్‌ జెన్‌ స్కూల్స్‌లో ప్రవేశపెట్టారు. కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌లోని పాఠశాలల్లో వీటి సేవలు అందుబాటులో ఉంటాయని నెక్ట్స్‌ జెన్‌ స్కూల్స్‌ వ్యవస్థాపకుడు కంకణాల రఘ తెలిపారు. ఇవి పూర్తిగా భారత్‌లో తయారైన ఈ రోబోలని, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఆధారంగా పనిచేస్తాయని చెప్పారు. కేపీహెచ్‌బీలోని ఓ హోటల్‌లో సోమవారం మీడియా సమావేశంలో రెండు రోబో టీచర్లను పరిచయం చేశారు.


కేరళలోని కొచ్చికి చెందిన మేకర్స్‌ ల్యాబ్‌ స్టార్టప్‌ కంపెనీ వీటిని తయారుచేసిందన్నారు. సాంకేతికతను చిన్నారులకు చేరువ చేసే ఉద్దేశంతో రోబో టీచర్స్‌ను ప్రవేశపెట్టామన్నారు. చాట్‌ జీపీటీ, అలెక్సాతో పోలిస్తే ఇవి అత్యుత్తమ సేవలందిస్తాయని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి సందేహాలున్నా చకచకా జవాబు ఇస్తుందన్నారు. జనరల్‌ నాలెడ్జి, సబ్జెక్టుల్లో ఏ సందేహమైనా ఇంగ్లిష్‌, హిందీ, ఫ్రెంచ్‌ భాషల్లో విపులంగా వివరిస్తుందని తెలిపారు. త్వరలోనే తెలుగుతో పాటు మరో 20 ప్రాంతీయ భాషలను కూడా బోధించేలా సాఫ్ట్‌వేర్‌ ఆప్‌డేట్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ల్యాబ్‌ స్టార్టప్‌ ప్రతినిధి హరిసాగర్‌ చెప్పారు.


విద్యార్థుల తల్లిదండ్రుల ఫీడ్‌ బ్యాక్‌ను కూడా రోబో తీసుకునేలా చూస్తామని ప్రధానోపాధ్యాయురాలు సురేఖ తెలిపారు. తద్వారా మెరుగైన విద్య అందించే అవకాశం ఉంటుందని, తల్లిదండ్రుల సూచనలు, సలహాలు గౌరవించినట్లు కూడా ఉంటుందని పేర్కొన్నారు. కాగా, కార్యక్రమంలో విద్యార్థులు రోబో టీచర్లకు ప్రశ్నలు వేశారు. సందేహాలను అవి నివృత్తి చేస్తున్న తీరును చూసి ఉబ్బితబ్బిబయ్యారు.

Updated Date - Jun 11 , 2024 | 04:11 AM