Share News

Stanford University: తెలంగాణకు స్టాన్‌ఫర్డ్‌!

ABN , Publish Date - Aug 11 , 2024 | 02:47 AM

ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ విశ్వ విద్యాలయం సంసిద్ధత వ్యక్తం చేసింది.

Stanford University: తెలంగాణకు  స్టాన్‌ఫర్డ్‌!

  • బయో డిజైన్‌ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం

  • లైఫ్‌ సైన్సెస్‌, స్కిల్‌ యూనివర్సిటీల్లో భాగస్వామ్యం

  • సీఎం రేవంత్‌కు లేఖ అందించిన యూనివర్సిటీ బృందం

  • గూగుల్‌ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం

  • సాంకేతిక సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్‌ వర్సిటీ

  • ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగస్వామ్యంపైన చర్చలు

  • హైదరాబాద్‌లో జొయిటిస్‌, మోనార్క్‌ ట్రాక్టర్స్‌ విస్తరణ

  • అమెరికాలో సీఎంతో భేటీ అయిన కంపెనీల ప్రతినిధులు

హైదరాబాద్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ విశ్వ విద్యాలయం సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో బయో డిజైన్‌ శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఆసక్తి కనరబరుస్తూ అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ అందజేసింది. శనివారం స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీని సీఎంతో పాటు మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సందర్శించింది. బైర్స్‌ సెంటర్‌ ఫర్‌ బయో డిజైన్‌ విభాగంలోని సీనియర్‌ ప్రతినిధులతో పలు అంశాలపై చర్చలు జరిపింది.


ఆరోగ్య సంరక్షణలో ఆవిష్కరణలు, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై ప్రధానంగా సమాలోచనలు చేసింది. కొత్తగా నెలకొల్పనున్న స్కిల్‌ యూనివర్సిటీ, లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీల్లో భాగస్వామ్యం కావాలని, తెలంగాణలో కేంద్రం ఏర్పాటు చేయాలని స్టాన్‌ఫర్డ్‌ బయో డిజైన్‌ అధికారులను సీఎం రేవంత్‌ ఆహ్వానించారు. ఉమ్మడి పరిశోధనలు నిర్వహిస్తూ ఆధునాతన పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ప్రతిపాదించారు. సానుకూలంగా స్పందించిన స్టాన్‌ఫర్డ్‌ ప్రతినిధులు.. వైద్య పరికరాల విద్య, ఆవిష్కరణలకు మద్దతు ఉంటుందని తెలుపుతూ సీఎం రేవంత్‌కు లేఖ అందజేశారు. భారీ వైద్య పరికరాల పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు చొరవ ఎందరికో ఉపాధి చూపుతుందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించడం అభినందనీయమన్నారు.


యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. స్టాన్‌ఫర్డ్‌ వంటి ప్రపంచ స్థాయి వర్సిటీ భాగస్వామ్యంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణ యువతకు ఆధునిక నైపుణ్యం, పరిజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు సీఎం తెలిపారు. ఇది తెలంగాణ యువత భవిష్యత్తుకు కొత్త బాటలు వేస్తుందని అన్నారు. పరిశ్రమలు, ఆవిష్కరణల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని వివరించారు. తెలంగాణ-స్టాన్‌ఫర్డ్‌ భాగస్వామ్యం ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగానికి ఉపయోగకరం అని.. శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటునూ పరిశీలించాలని కోరారు. స్టాన్‌ఫర్డ్డ్‌ బయో డిజైన్‌ సెంటర్‌ లాంటి ప్రపంచ స్థాయి విభాగాలు కలిసి వస్తే నైపుణ్యాభివృద్ధిలో తమ ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఇది తెలంగాణకే కాక యావత్‌ ప్రపంచానికి ఆరోగ్య సంరక్షణలో కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.


  • మా లక్ష్యం నెరవేరుతుంది: శ్రీధర్‌బాబు

స్టాన్‌ఫర్డ్డ్‌ సెంటర్‌తో.. స్కిల్‌, లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్శిటీల లక్ష్యం నెరవేరుతుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణలో లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ పరిశ్రమల వృద్థికి మరో ముందడుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్‌ బృందం కాలిఫోర్నియా మౌంటైన్‌ వ్యూలో ఉన్న గూగుల్‌ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో టెక్నాలజీ వినియోగం, తెలంగాణలో సాంకేతిక సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగస్వామ్యంపై గూగుల్‌ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. గూగుల్‌ సిబ్బందితో టెక్నాలజీ, ఏఐ, స్కిల్స్‌ తదితర అంశాలపై ముచ్చటించింది.


  • జొయిటిస్‌, మోనార్క్‌ విస్తరణ..

జంతు ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రముఖ సంస్థగా పేరుపొందిన జొయిటిస్‌.. హైదరాబాద్‌లో వచ్చే సెప్టెంబర్‌ నుంచి సామర్థ్య కేంద్రం (క్యాపబులిటీ సెంటర్‌)ను విస్తరించాలని నిర్ణయించింది. అమెరికాలో సీఎం రేవంత్‌, మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమైన సంస్థ ప్రతినిధుల బృందం ఈ విషయాన్ని ప్రకటించింది. జొయిటిస్‌ నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం.. కొత్త ఆవిష్కరణలు, వ్యాపార వృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడతాయన్నారు. భవిష్యత్‌ టెక్నాలజీలో జొయిటిస్‌ రంగప్రవేశం హైదరాబాద్‌కు మరింత గుర్తింపు తెస్తుందని తెలిపారు. వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు.


భారత్‌లో తమ సంస్థ విస్తరణకు హైదరాబాద్‌ అనువైనదని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం సంతోషంగా ఉందని జొయిటిస్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ కీత్‌ సర్బాగ్‌ తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్రపంచస్థాయి ప్రతిభా వనరులను సద్వినియోగం చేసుకుంటామని జొయిటిస్‌ ఇండియా సెంటర్‌ ఉపాధ్యక్షుడు అనిల్‌ రాఘవ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని తమ పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) సెంటర్‌ను విస్తరించే అంశంపై సీఎం రేవంత్‌ బృందానికి మోనార్క్‌ ట్రాక్టర్స్‌ ప్రతినిధులు లేఖ అందజేశారు. అమెరికాలో రేవంత్‌ను మోనార్క్‌ ట్రాక్టర్స్‌ సంస్థ ప్రతినిధులు కలిశారు.


అనంతరం హైదరాబాద్‌లో ఆర్‌అండ్‌డీ సంస్థకు అనుబంధంగా స్వయంప్రతిపత్తి ట్రాక్టర్‌ టెస్టింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధునాతన, పర్యావరణ అనుకూల సంస్థలను ఆకర్షించడంపై దృష్టిసారించామని, మోనార్క్‌ ట్రాక్టర్స్‌ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని రేవంత్‌ తెలిపారు. స్వయంప్రతిపత్తి, ఎలక్ర్టిక్‌ వాహనాల సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపామని, ఆ విజన్‌లో మోనార్క్‌ ట్రాక్టర్స్‌ భాగమై రాష్ట్రంలో తమ ఉనికిని విస్తరించుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కార్యకలాపాలపై చర్చించేందుకు రేవంత్‌ బృందాన్ని కలవడం సంతోషంగా ఉందని మోనార్క్‌ ట్రాక్టర్స్‌ సీఈవో ప్రవీణ్‌ పెన్మెత్స వెల్లడించారు.


  • కన్సల్టెంట్‌ రామ్‌చరణ్‌కు ప్రశంసలు

గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం ఉద్వేగభరితంగా ఉందని సీఎం రేవంత్‌ ట్వీట్‌ చేశారు. కాలిఫోర్నియాలో ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్‌ కన్సల్టెంట్‌, రచయిత, ఉపన్యాసకర్త ప్రొఫెసర్‌ రామ్‌చరణ్‌తో భేటీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక రంగంపై 30 పుస్తకాలకు పైగా రచించి, తన శిక్షణ ద్వారా ప్రపంచంలోని డజనుకు పైగా దిగ్గజ కంపెనీలకు సీఈవోలను అందించిన ఘనత రామ్‌ చరణ్‌కు దక్కుతుందని కొనియాడారు.

Updated Date - Aug 11 , 2024 | 02:47 AM