Cybercrime: సైబర్ నేరాలకు ఏజెంట్లు!
ABN , Publish Date - Aug 26 , 2024 | 04:46 AM
ఎక్కడో ఉత్తరాదిలో ఉంటూ.. అమాయకులకు కుచ్చుటోపీ పెడుతూ.. రూ.కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు సహకరిస్తున్నదెవరో తెలుసా? వారు చేసే ప్రతీ నేరానికి సిమ్ కార్డులు మొదలు..
ప్రతి దశలో దళారుల నియామకం.. వారి ద్వారానే బ్యాంకు ఖాతాలు
వాటితోనే యథేచ్ఛగా సైబర్ నేరాలు
హైదరాబాద్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఎక్కడో ఉత్తరాదిలో ఉంటూ.. అమాయకులకు కుచ్చుటోపీ పెడుతూ.. రూ.కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు సహకరిస్తున్నదెవరో తెలుసా? వారు చేసే ప్రతీ నేరానికి సిమ్ కార్డులు మొదలు.. సెల్‌ఫోన్లు అందజేయడం, చివరకు అమాయకుల డబ్బును బదిలీ చేసుకునేందుకు బ్యాంకు ఖాతాల దాకా సమకూర్చేందుకు ఎక్కడికక్కడ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. తెలంగాణలో మారుమూల జిల్లాలకు కూడా సైబర్ నేరగాళ్ల ఏజెంట్ల సంస్కృతి పాకిపోయిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బాధితులు ఫిర్యాదు చేసినా.. బ్యాంకు ఖాతాలు ఎవరి పేరిట ఉన్నాయో.. వారు, ఏజెంట్లు మాత్రమే పట్టుబడుతున్నారు. సైబర్ కేటుగాళ్లు మాత్రం సురక్షితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు.. ఏజెంట్ల ద్వారా మూలాలకు వెళ్లి నేరస్థులకు బేడీలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
30% కమీషన్..
సైబర్ నేరగాళ్లు తాము చేసిన నేరాల్లో ఏజెంట్లకు 30ు కమీషన్ ఆశ చూపుతూ పని కానిచ్చేస్తున్నారు. ఏజెంట్లు గ్రామాల్లో ఉండే అమాయకులకు వల వేసి.. వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించి, వాటి వివరాలను సైబర్ కేటుగాళ్లకు అందజేస్తూ.. లక్షలు గడిస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రణయ్ శిందే అనే ఏజెంట్.. అక్కడ నిరుపేద రైతులు, రైతుకూలీల పేర్లతో 125కు పైగా బ్యాంకు ఖాతాలను తెరిపించినట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న సైబర్ నేరాల్లో బాధితుల సొమ్ము నిర్మల్ జిల్లాలోని బ్యాంకు ఖాతాల్లో జమ అవ్వడంతో.. పోలీసులు తీగ లాగితే.. ప్రణయ్ డొంక కదిలింది. ఇదే తరహాలో సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్లు, గ్రామీణుల పేర్లతో తీసుకున్న సిమ్‌కార్డులను ఏజెంట్ల ద్వారా సంపాదిస్తున్న సైబర్ కేటుగాళ్లు.. వాటి సాయంతో నేరాలకు పాల్పడుతున్నారు. నేరం జరగ్గానే పోలీసులు ముందుగా దృష్టి సారించేది సెల్‌ఫోన్ నంబర్ యజమాని, స్మార్ట్‌ఫోన్ ఐఎంఈఐ నంబర్‌పైనే. పోలీసులు వారిని విచారించేలోపు.. సైబర్ నేరగాళ్లు నగదును విత్‌డ్రా చేసుకుని, గప్‌చిప్ అయిపోతున్నారు.
పోలీసుల చేతిలో సైకాప్స్ అస్త్రం!
సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు తెలంగాణకు చెందిన వారే అయినా.. నిందితులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. దీంతో సైబర్ నేరాల కట్టడిపై దృష్టి సారించిన రాష్ట్ర పోలీసులు.. అంతర్రాష్ట్ర ముఠాలను గుర్తించేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇండియన్ సైబర్ క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) సమాచారంతో.. రాష్ట్ర పోలీసులు సైబర్ క్రైం అనాలసిస్ అడ్ ప్రొఫైలింగ్ సిస్టం(సైకాప్స్) అనే టూల్‌ను రూపొందించారు. సైబర్ నేరగాళ్లు వాడిన సిమ్ నంబరు, ఐఎంఈఐ నంబర్‌ను ఇందులో ఎంటర్ చేస్తే.. వారు ఎక్కడున్నారో గుర్తించగలుగుతారు. ఇలా.. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన 70 మంది కేటుగాళ్ల చిట్టాను ఈ యాప్‌లో పొందుపరిచారు. వీరు దేశవ్యాప్తంగా 9 వేలకు పైగా సైబర్ నేరాల కేసుల్లో నిందితులు. సైకాప్స్ మార్గదర్శనంలోనే ఇటీవల గుజరాత్‌లో 36మంది కేటుగాళ్లను పట్టుకోగలిగారు. వీరు దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా సైబర్ నేరాల్లో నిందితులు. వీరిపై తెలంగాణలో 150 వరకు కేసులుండడం గమనార్హం. సైబర్ పోలీసులు ఓ వైపు నేరగాళ్లపైన ఫోకస్ చేస్తూనే.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నేరం జరిగిన వెంటనే(గోల్డెన్ అవర్స్) ఫిర్యాదు చేస్తే.. పోగొట్టుకున్న డబ్బును తిరిగి రాబట్టవచ్చని, 1930కి ఫోన్ చేసి, ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
బాధితులే ఏజెంట్లుగా మారి..
ట్రేడింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ ఇలా రకరకాల పేర్లతో సైబర్ నేరగాళ్లు అమాయకులను ఉచ్చులోకి దింపుతుంటారు. అలా వారి ఉచ్చుకు చిక్కి.. ఉన్నదంతా పోగొట్టుకుంటున్న బాధితులు.. కమీషన్ల ఆశతో ఏజెంట్లుగా మారుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కేశవరెడ్డి అలియాస్ మహా విషయంలో ఇదే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. బెంగళూరులో నివసించే మహా.. ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడేవాడు. బెట్టింగ్‌లో పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించేందుకు సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపాడు. వారి కోసం బ్యాంకు ఖాతాలను సమకూర్చడం మొదలుపెట్టాడు.