Share News

Airport Metro: ‘ఫాస్ట్‌ట్రాక్‌’లో ఎయిర్‌పోర్ట్‌ మెట్రో!

ABN , Publish Date - Jul 30 , 2024 | 04:28 AM

ఎయిర్‌పోర్టు మెట్రోను ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.24,042 కోట్లు కాగా.. రేవంత్‌ సర్కారు తాజా బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాయించింది.

Airport Metro: ‘ఫాస్ట్‌ట్రాక్‌’లో ఎయిర్‌పోర్ట్‌ మెట్రో!

  • అంతర్జాతీయ బ్యాంకుల నుంచి 45ు రుణం

  • పీపీపీ పద్ధతిలో మరో ఐదు శాతం

  • రాష్ట్రం వాటా 35ు.. కేంద్రం నుంచి 15ు

  • రాష్ట్ర మంత్రివర్గ భేటీ తర్వాత కేంద్రానికి డీపీఆర్‌

  • ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.24,042 కోట్లు

  • తాజా బడ్జెట్‌లో రూ.500 కోట్ల కేటాయింపు

హైదరాబాద్‌ సిటీ, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఎయిర్‌పోర్టు మెట్రోను ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.24,042 కోట్లు కాగా.. రేవంత్‌ సర్కారు తాజా బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాయించింది. నాగోల్‌-ఎయిర్‌పోర్టు కారిడార్‌కు ‘గ్రీన్‌లైన్‌ కారిడార్‌’గా నామకరణం చేసిన సర్కారు.. అంతర్జాతీయ బ్యాంకుల రుణాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు, పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును జాయింట్‌ వెంచర్‌గా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో 35ు నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా అందించనుంది. మరో 15ు నిధులను కేంద్రం అందజేయనుంది. మిగతా 50శాతంలో 45ు నిధులను ఆసియా అభివృద్ధి బ్యాంక్‌(ఏడీబీ) లేదా జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ(జైకా) వంటి అంతర్జాతీయ బ్యాంకుల నుంచి నిధులను సేకరించాలని ప్రభుత్వ నిర్ణయించింది. మిగిలిన 5ు నిధులను పీపీపీ పద్ధతిలో సేకరించనుంది. ఎయిర్‌పోర్టు కారిడార్‌కు ఇప్పటికే సిస్ర్టా జనరల్‌ కన్సల్టెంట్‌ సంస్థ డీపీఆర్‌ను సిద్ధం చేసింది.


  • పాతనగరంతో కలిపి..

మొదటి దశ మెట్రో రైల్‌ పనుల్లో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. మేర పెండింగ్‌లో ఉంది. రెండో దశలో 7 కారిడార్లలో 78.04 కి.మీ. మేర పనులను చేపట్టాలని సంకల్పించిన రేవంత్‌ సర్కారు.. పాతనగర మెట్రో లైన్‌ను మరో 2 కి.మీ. పెంచి, చాంద్రాయణగుట్ట వరకు పొడిగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే..! నాగోల్‌-ఎయిర్‌పోర్టు మెట్రోకు చాంద్రాయణగుట్ట వద్ద పాతనగర మెట్రో లైన్‌తో రెడ్‌లైన్‌ ఏర్పాటవుతుంది. అక్కడ ఇంటర్‌చేంజ్‌కు అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే అధికారులు పాతనగరంలోని మొత్తం 7.5 కి.మీ. మేర పనులను చేపట్టారు. ఇక నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌కు 5 కి.మీ. లైన్‌ను పొడిగించి, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్‌కు ‘గ్రీన్‌లైన్‌ కారిడార్‌’ను నిర్మిస్తారు. రెండో దశ ఏడు కారిడార్లకు సంబంధించి డీపీఆర్‌లను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంది. కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులను ప్రా రంభిస్తారు. చాంద్రాయణగుట్ట వద్ద రెడ్‌లైన్‌(ఇంటర్‌చేంజ్‌) ఏర్పాటు వల్ల.. మెట్రో ప్రయాణికులు ఎక్కడి నుంచైనా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకునే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు.


  • ఎన్‌హెచ్‌, రైల్వేల వద్ద పక్కా ప్రణాళికతో

మొదటి దశ మెట్రోరైల్‌ నిర్మాణం వద్ద అధికారులు జాతీయ రహదారులు, రైల్వే లైన్ల వద్ద ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జాతీయ రహదారులపై ట్రాఫిక్‌ ఇబ్బంది ఎదురవ్వగా.. రైల్వే లైన్ల వద్ద నిర్మాణాలకు అనుకూలంగా ఆ మార్గంలో ఎంత సమయం వరకు రైళ్లను ఆపితే.. అంత మొత్తంలో దక్షిణ మధ్య రైల్వేకు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండో దశ విషయంలో అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

Updated Date - Jul 30 , 2024 | 04:28 AM